సాక్షి, తాడేపల్లి: ఒక గొప్ప ఉద్యమాన్ని విజయవంతంగా పూర్తి చేశామని.. చర్రితలో ఇంత పెద్ద ఎత్తున సంతకాల ఉద్యమం జరగలేదని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరికీ వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు.
‘‘మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పెద్ద స్కాం. మళ్లీ రూ. 120 కోట్ల ప్రజాధనాన్ని జీతాల కింద ఎలా ఇస్తారు?. కాలేజీలు ప్రైవేటుకు ఇచ్చి జీతాలు మీరు ఎలా ఇస్తారు?. ఇంతకంటే పెద్ద స్కాం ఉంటుందా?’’ అంటూ వైఎస్ జగన్.. చంద్రబాబు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కోటి సంతకాలు లోక్‌భవన్‌కు చేరుకున్నాయి. కోటి 4 లక్షల 11 వేల 136 మంది సంతకాలు ఒక చరిత్ర. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ మాట చంద్రబాబే చెప్పుకున్నారు. కూటమి పాలనలో ప్రజలకు మంచి జరగలేదు. 2 బడ్జెట్‌లు పెట్టినా ప్రజలను జరిగిన మంచి గుండుసున్నా. మన హయాంలో పథకాల అమలుకు క్యాలెండర్ ఇచ్చాం. బాబు సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ అంటూ మోసం చేశారు. మన హయాంలో పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశాడు’’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు.
‘‘కూటమి పాలనలో వ్యవస్థలు కుప్పకూలాయి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. అన్నదాతలకు రైతు భరోసా అందడం లేదు. ప్రైవేటీకరణ అంటేనే దోపీడీ. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. మన హయాంలో ఆర్టీసీని బతికించాం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేశాం. కూటమి పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం. చంద్రబాబు తప్పులు చేసి కలెక్టర్లపైకి నెట్టేస్తున్నారు. అక్టోబర్ 7న సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టాం. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించా. అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు సంతకాల ఉద్యమం సాగింది’’ అని వైఎస్ జగన్ వివరించారు.



