సాక్షి, తాడేపల్లి: మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు కట్టబెట్టడమే పెద్ద స్కాం.. అంటూ చంద్రబాబు సర్కార్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలదీశారు. గురువారం ఆయన వైఎస్సార్‌సీపీ ముఖ్య నేతల సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. చంద్రబాబు నిర్ణయాన్ని కోటి 4 లక్షల మంది వ్యతిరేకించారని.. ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేశారన్నారు.
ఈ సంతకాలు గవర్నర్‌ను సమర్పిస్తాం.. కోర్టుకు కూడా పంపుతాం. గవర్నర్ దగ్గరకు వెళ్లే ముందు అంబేద్కర్ విగ్రహం వద్ద కోటి సంతకాల ప్రతులను ఉంచుతాం. కోటి సంతకాలు చూడాలంటూ కోర్టులో అఫిడవిట్ వేస్తాం. స్కామ్‌లు చేయడానికి చంద్రబాబు వెనకడుగు వేయడం లేదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్. ప్రైవేట్ వాళ్లకు మెడికల్ కాలేజీలు అప్పజెప్పడమే కాదు.. వాళ్లకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట!. ఒక్కో కాలేజీకి రూ.120 కోట్లు ఎదురు ఇస్తున్నారు(జీతాల కింద).. ఇంత కంటే పెద్ద స్కామ్ ఉంటుందా?’’ అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
నింద కలెక్టర్లపై మోపుతున్న చంద్రబాబు:
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు మాటలు వింటుంటే.. ఆశ్చర్యం కలుగుతోంది. తన గ్రాఫ్ పడిపోవడానికి కలెక్లర్లు కారణం అంటున్నారు. కలెక్టర్ల గ్రాఫ్ కాదు పడిపోతోంది. చంద్రబాబు గ్రాఫ్ పడిపోతోంది. ఎందుకంటే ఆయన ప్రభుత్వం ప్రజలకు ఒక్కటంటే ఒక్క మంచి పని చేయలేదు. మార్చి వస్తే, మూడో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నాడు. ఇప్పటికే రెండు బడ్జెట్లు పెట్టాడు. కానీ, ప్రజలకు ఒక్కటంటే ఒక్క మేలు లేదు. గత పథకాలన్నీ సున్నా. కొత్తగా ఏదీ లేదు. మన ప్రభుత్వ హయాంలో క్యాలెండర్ ప్రకటించి, అన్ని పథకాలు పక్కాగా అమలు చేశాం. వాటితో పాటు, అంత కంటే ఎక్కువగా అమలు చేస్తానన్న చంద్రబాబు, ఏదీ చేయలేదు. గతంలో అమలు చేసిన అన్ని పథకాలు రద్దు చేశారు. సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ లేవు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి. ఆరోగ్యశ్రీ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేదు. పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. ఇంకా సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ మోసాలు.
విద్య, వైద్యం, రవాణా. ప్రభుత్వ వ్యవస్థలు:
అసలు ఎక్కడైనా ప్రభుత్వం స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు నడుపుతుంది? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అది ఎందుకు జరుగుతోంది?. ఎందుకంటే, ఒకవేళ ప్రభుత్వమే కనుక.. స్కూళ్లు, ఆస్పత్రులు, బస్సులు (ప్రజా రవాణా వ్యవస్థ) నడపకపోతే.. విద్య, వైద్యం, రవాణా ఎవరికీ అందుబాటులో ఉండవు. ఆయా రంగాల్లో మొత్తం ప్రైవేటు రంగం పెత్తనమే ఉంటుంది.
వ్యవస్థలన్నీ తిరోగమనం:
కానీ, ఈరోజు అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. అసలు ప్రభుత్వ స్కూళ్లు, ఆస్పత్రులు ఎందుకు అంటున్నాడు చంద్రబాబు. మనం గత ఎన్నికల్లో గెల్చిపోయి ఉండకపోతే, ఆర్టీసీ కూడా ఉండేది కాదు. అదే చంద్రబాబు వచ్చి ఉంటే, దాన్ని కచ్చితంగా అమ్మేసేవాడు. ఈరోజు అన్ని వ్యవస్థలు తిరోగమనం. గతంలో అమలైన పథకాలన్నీ రద్దు. అన్ని ఘనకార్యాలు చేసిన నీవు (చంద్రబాబు), కలెక్టర్ల సదస్సులో వారి (కలెక్టర్లు) పనితీరు బాగా లేదనడం దారుణం. చంద్రబాబు బుర్ర పని చేయడం లేదు.
న్యాయపోరాటం కూడా చేస్తాం:
ఆ తర్వాత ఆ పత్రాలు.. కోర్టు ద్వారాలు తడుతాయి. ఆ మేరకు కోర్టులో పిటిషన్ వేస్తాం. వారు ఎప్పుడు కోరినా, ఆ పత్రాలు చూపుతాం. అయినా చంద్రబాబులో చలనం రాదు. ఎందుకంటే ఆయన చర్మం మందం. గతంలో ఎన్.జనార్థన్‌రెడ్డి సీఎంగా ఉండి, ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తే, ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
2 ఏళ్లు జీతాలు మరో పెద్ద స్కామ్:
ఇక్కడ ప్రభుత్వం కట్టిన కాలేజీలు ప్రైవేటుపరం చేయడం ఒక స్కామ్ కాగా.. ఆయా కాలేజీల సిబ్బంది జీతాలు రెండేళ్లు ప్రభుత్వం ఇస్తుందట!. ఇది మరో పెద్ద స్కామ్. ఒక మెడికల్ కాలేజీ సిబ్బందికి జీతాల కింద నెలకు దాదాపు రూ.6 కోట్లు ఖర్చవుతాయి. అంటే రెండేళ్లకు దాదాపు రూ.140 కోట్లు. పది కాలేజీలకు కలిపి ఏకంగా రూ.1400 కోట్లు. ఇది ఒక పెద్ద స్కామ్
అధికారంలోకి రాగానే రద్దు చేస్తాం:
రేపు మనం అధికారంలోకి రాగానే అవన్నీ రద్దు చేస్తాం. ఈ స్కామ్‌కు పాల్పడిన వారెవ్వరినీ వదిలిపెట్టం. రెండు నెలల్లో వారిని జైల్లో పెడతాం. అందుకే చంద్రబాబుకు గట్టిగా బుద్ధి చెప్పబోతున్నాం. గవర్నర్ 40 మందికి అనుమతి ఇచ్చారు. లోక్‌భవన్‌కు వెళ్లే ముందు అంబేడ్కర్ విగ్రహం వరకు అందరం వెళ్దాం. అక్కణ్నుంచి 40 మందితో కలిసి గవర్నర్‌ను కలుస్తాం. ఆ తర్వాత కోర్టు తలుపు తడతాం. అయినా చంద్రబాబు నిర్ణయం మార్చుకోకపోతే.. ప్రజా ఉద్యమం కొనసాగిస్తాం’’ అని వైఎస్ జగన్ హెచ్చరించారు.


