ఆత్మకూరురూరల్: కోడి మాంసం అంటే మాంసాహార ప్రియులు లొట్టలేసుకుంటూ తింటారు. అది నాటు కోడి అయితే ఇక చెప్పనవసరం లేదు. దీంతో ఈ కోళ్లకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో బెడస జాతికి చెందిన కోళ్ల ధర వేలల్లో ఉంటుంది. దీంతో దొంగల కన్ను ఈ కోళ్లపై పడింది. గత కొన్ని రోజులుగా ఆత్మకూరు మండలంలోని కొట్టాల చెర్వు, కురుకుంద, వెంకటాపురం, క్రిష్ణాపురం, పాములపాడు మండలం మద్దూరు, బానకచర్ల తదితర గ్రామాల్లో కోళ్ల దొంగతనాలు జరుగుతున్నాయి.
ఇప్పటి వరకు దాదాపు 200కు పైగా నాటుకోళ్లు మాయమయ్యాయని, ఒక్కో కోడి ధర రూ. 5 వేలు అనుకున్నా రూ. 10 లక్షలు విలువ చేస్తాయని బాధితులు చెబుతున్నారు. విలువైన కోళ్లు మాయమవుతుండటంతో కొందరు బాధితులు ఆత్మకూరు పోలీసులను కలిసి ఫిర్యాదు కూడా చేశారు. అయితే, కోళ్లే కదా అని పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మారుమూల అటవీ ప్రాంత గ్రామంలోని కొందరు యువకులు ఈ చోరీకి పాల్పడుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్పందించి దొంగల బెడద నుంచి తమ కోళ్లను కాపాడాలని పెంపకందారులు కోరుతున్నారు.


