సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంతూరిలోనే ఆయనకు షాక్ తగిలింది. ఆయన తీసుకున్న పీపీపీ విధానాన్ని ఆ ఊరి ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణలో ఈ ఊరి ప్రజలూ భాగం కావడం గమనార్హం.
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంకల్పించారు. అందులో ఏడు పూర్తి చేయగా.. మరో 10 నిర్మాణ దశలో ఉన్నాయి. ఈలోపు కూటమి ప్రభుత్వం జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో వాటిని అలాగే వదిలేసింది. అటుపై.. పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యాన్ని దూరం చేస్తూ చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంలో వాటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయించింది.
చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. తమ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కోటి సంతకాల సేకరణ చేపట్టింది వైఎస్సార్‌సీపీ. తుపాను, వర్షాల్లోనూ రెండు నెలలపాటు రాష్ట్రమంతటా ఉవ్వెత్తున సాగింది ఈ కార్యక్రమం. ఇందులో భాగంగా.. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలోనూ ప్రజలు సంతకాలు చేశారు. అయితే.. తమ ఊరి నుంచి ఎలాంటి సంతకాలు చేయలేదని నారావారిపల్లె టీడీపీ నేతలు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటనలు చేశారు.
కానీ, వైఎస్సార్‌సీపీ రచ్చబండలో భాగంగా అక్కడా సంతకాల సేకరణ జరిగింది. ఆ పత్రాలు అక్కడి నుంచి చంద్రగిరి నియోజకవర్గానికి.. అక్కడి నుంచి తిరుపతికి.. అక్కడి నుంచి ఇవాళ తాడేపల్లికి చేరుకున్నాయి. ఈ లెక్కన.. సాయంత్రం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు వైఎస్ జగన్ సమర్పించబోయే చంద్రబాబు వ్యతిరేక ప్రజా గళాల్లో ఆయన సొంతూరి ప్రజలది కూడా ఉండబోతుందన్నమాట.


