తమిళనాడు: నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ గురువారం మధ్యాహ్నం తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 27న కరూర్‌లో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన తర్వాత రాష్ట్రంలో ఆయన పెద్ద ఎత్తున జరిపిన మీటింగ్ ఇదే కావడం విశేషం. ఈ ర్యాలీ ద్వారా విజయ్ వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు తన ప్రచారానికి స్వరం సిద్ధం చేసుకున్నారు.
విజయ్ మాట్లాడుతూ.. తమిళనాడులో NEET పరీక్ష మినహాయింపు అంశం, శాంతిభద్రతల సమస్యలపై ఆయన డీఎంకేపై తీవ్ర విమర్శలు చేశారు. డీఎంకే పార్టీకి సమస్యలు ఫెవికాల్‌తో ముడిపడి ఉన్నాయి, వాటిని వేరు చేయలేం అని వ్యాఖ్యానించారు. అధికార డీఎంకేను దుష్ట శక్తిగా, తన పార్టీ TVK (తమిళగ వెట్రి కజగం)ను స్వచ్ఛమైన శక్తిగా అభివర్ణించారు. పోరాటం స్వచ్ఛమైన శక్తికి, చెడుకు మధ్య అని విజయ్ మండిపడ్డారు. ర్యాలీకి వచ్చిన జనసమూహాన్ని సురక్షితంగా వెళ్లమని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ ర్యాలీ మాజీ ఏఐఏడీఎంకే నాయకుడు కేఏ సెంగొట్టయన్ స్వస్థలం విజయమంగళం సమీపంలో జరగడం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. సెంగొట్టయన్ గత నెలలో ఏఐఏడీఎంకే నుండి బహిష్కరణకు గురైన తర్వాత విజయ్ పార్టీ టీవీకేలో చేరారు. ఆయనను సీనియర్ రాజకీయ నాయకుడు, అద్భుతమైన ప్రచార వ్యూహకర్తగా పరిగణిస్తారు. కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత విజయ్ నిర్వహించిన రెండవ పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇదే కావడం విశేషం. మొదటి సభ గత వారం పుదుచ్చేరిలో జరిగింది, అక్కడ కూడా ఆయన డీఎంకేపై మాటల దాడి చేశారు. ఈరోడ్ ర్యాలీతో విజయ్ తన రాజకీయ యాత్రను మరింత దూకుడుగా కొనసాగిస్తున్నారు. ఈ ర్యాలీతో డీఎంకేపై ప్రత్యక్ష పోరాటానికి సంకేతాలు ఇచ్చారు.
తోపులాటకు ఆస్కారం లేకుండా..
తోపులాట, తొక్కిసలాటలకు ఆస్కారం ఇవ్వకుండా లోనికి కేడర్‌ను నిర్ణీత సమయంలోకి అనుమతించడం, నిర్ణీత సమయంలో విజయ్ అక్కడికి వచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఏర్పాట్లను టీవీకే వర్కింగ్ కమిటీ సమన్వయకర్త సెంగొట్టయ్యన్, ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ పర్యవేక్షించారు. గుర్తింపు కార్డులు ఉన్న కేడర్‌ను మాత్రమే లోనికి అనుమతించే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా విజయ్ పర్యటనను నిర్వహించారు. గర్భిణిలు, వృద్ధులు, పిల్లలు దయ చేసి ఇక్కడకు రావొద్దని ముందుగానే సూచించారు. రెండున్నర నెలల అనంతరం రాష్ట్రంలో మళ్లీ మీట్ ది పీపుల్ ప్రచార ప్రయాణానికి విజయ్ శ్రీకారం చుట్టనన్నడంతో బయటి వ్యక్తులు ఎవ్వరూ ఈరోడ్‌కు రావొద్దని, విజయ్ వాహనాన్ని వెంబడించ వద్దని టీవీకే కార్యాలయం విన్నవించుకుంది.


