ఢిల్లీ: వికసిత భారత్ జీ రామ్ జీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. విపక్షాల నిరసన మధ్యే ‘జీ-రామ్-జీ’ బిల్లుకు ఆమోదం లభించింది. వీబీ-జీ-రామ్-జీ బిల్లు పత్రులను చించి విపక్షాలు నిరసన తెలిపాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రం మార్చగా.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు బిల్లును వ్యతిరేకించాయి. విపక్షాల ఆందోళనతో లోక్‌సభ రేపటికి(శుక్రవారం) వాయిదా పడింది.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే, ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందని కేంద్రం చెబుతోంది. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని కేంద్ర సర్కార్ అంటోంది. ఉపాధి హామీ పథకం నుంచి గాంధీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అది అతిపెద్ద నేరమన్నారు.
కాగా, దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్‌కా బీమా సబ్‌కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు. అలాగే, కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్‌మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించిన సంగతి తెలిసిందే.


