సాక్షి, న్యూఢిల్లీ: గ్రామీణ పేదలకు కష్టకాలంలో అండగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించేందుకు.. పేదలకు హక్కుగా ఉన్న ఉపాధిని అగమ్యగోచరంగా మార్చేలా, ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాల మెడపై కత్తి వేలాడదీసేలా రూపొందించిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ బిల్లు–2025’పై వైఎస్సార్‌సీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభలో బుధవారం ఈ బిల్లుపై జరిగిన చర్చలో వైఎస్సార్‌సీపీ ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రప్రభుత్వ తీరును ఎండగట్టారు.
రాష్ట్రా లపై భరించలేనంత భారం మోపి, పరోక్షంగా ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల పొట్టకొట్టే ఈ బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. ‘ఇన్నాళ్లూ మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు ఒక చట్టబద్ధమైన హక్కుగా ఉండేది. కానీ కేంద్రం తెస్తున్న కొత్త బిల్లులోని అస్పష్టమైన నిబంధనల వల్ల ఆ హక్కును పేదలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.
ఈ బిల్లు పేదల్లో తీవ్ర అభద్రతాభావాన్ని, గందరగోళాన్ని సృష్టిస్తోంది. నిధుల కేటాయింపులో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో కేంద్రం 90 శాతం నిధులు ఇస్తుండగా, రాష్ట్రాలు కేవలం 10 శాతం మాత్రమే భరిస్తున్నాయి. కొత్త బిల్లులో కేంద్రం తన వాటాను 60 శాతానికి తగ్గించుకుని, రాష్ట్రాలపై ఏకంగా 40 శాతం భారం మోపడం దారుణం. ఇది సమాఖ్య స్ఫూర్తికే విఘాతం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలను మరింత సంక్షోభంలోకి నెట్టేయడమే.
మరీ ముఖ్యంగా.. రాష్ట్రాలు తమ వాటా 40 శాతం నిధులను ముందుగా జమచేస్తేనే, కేంద్రం తన వాటా నిధులను విడుదల చేస్తుందన్న నిబంధన పెట్టడం పూర్తిగా అసంబద్ధం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తాన్ని ముందుగా ఎలా సర్దుబాటు చేస్తాయి? ఈ నిబంధన ఆచరణ సాధ్యం కాదు. ఇది పథకాన్ని నిర్వీర్యం చేయడమే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత మూడేళ్లలో సగటున రూ.8 వేలకోట్లు ఉపాధి హామీ కోసం ఖర్చు చేశారు. కొత్త నిబంధన అమలైతే రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.3,200 కోట్లు భరించాల్సి వస్తుంది. ఇంతటి భారీ భారాన్ని రాష్ట్రం మోయలేదు.
పనిదినాల పెంపు ఆచరణ సాధ్యం కాదు..
మరోవైపు పనిదినాలను 100 నుంచి 125 రోజులకు పెంచామని కేంద్రం గొప్పగా చెప్పుకొంటున్నా.. అది ఆచరణలో సాధ్యం కాదు. రాష్ట్రాలు తమ వాటా నిధులను కట్టలేకపోతే, కేంద్రం నిధులు ఆగిపోతాయి. అప్పుడు ఈ పెంచిన పనిదినాల వల్ల పేదలకు ఒరిగేదేమీ ఉండదు. ఇది కేవలం కంటితుడుపు చర్యగానే మిగిలిపోతుంది..’ అని పేర్కొన్నారు.
వాస్తవ పరిస్థితులను గమనించకుండా, ఏకపక్షంగా రూపొందించిన ఈ బిల్లును వెంటనే జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఇతర వాటాదారులతో విస్తత చర్చలు జరిపిన తర్వాతే, పేదల ప్రయోజనాలు కాపాడేలా మార్పులు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.


