అడ్వాణీకి ప్రధాని పీఠం
2002లో బీజేపీలో యోచన
తిరస్కరించిన వాజ్‌పేయి
దాంతో తెరపైకి కలాం పేరు
టాండన్ పుస్తకంలో వెల్లడి
న్యూఢిల్లీ: అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో ఏపీజే అబ్దుల్ కలాం అనూహ్య రీతిలో రాష్ట్రపతిగా ఎన్నికవడం తెలిసిందే. కానీ అసలు వాజ్ పేయినే రాష్ట్రపతిగా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన అప్పట్లో బీజేపీ నాయకత్వానికి వచ్చిందట! అంతేగాక వాజ్ పేయి స్థానంలో నాటి పార్టీ అగ్ర నేత ఎల్ కే అడ్వాణీని ప్రధానిగా చేయాలన్న ప్రతిపాదన కూడా జోరుగా సాగిందట. కానీ రాష్ట్రపతి అయ్యేందుకు స్వయానా వాజ్ పేయే తిరస్కరించడంతో ఆ ప్రయత్నాలకు అక్కడితోనే తెర పడిందట! నాడు ఆయన మీడియా సలహాదారుగా ఉన్న అశోక్ టాండన్ తన తాజా పుస్తకం ’అటల్ సంస్మరణ్’ లో ఈ ఆసక్తికర అంశాన్ని పేర్కొన్నారు. పాలక ఎన్డీఏతో పాటు విపక్షాల మద్దతుతో కలాం 2022లో దేశ 11వ రాష్ట్రపతిగా ఎన్నికవడం తెలిసిందే.
కలాం ఎంపిక వెనక...
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా కలాం ఎంపిక వెనక ఏం జరిగిందీ, ఈ విషయంలో కలిసి వచ్చేలా కాంగ్రెస్ తో పాటు ఇతర విపక్షాలను వాజ్ పేయి ఎలా ఒప్పించిందీ పుస్తకంలో టాండన్ వివరించారు. ‘తాను రాష్ట్రపతి కావాలన్న ప్రతిపాదనను వాజ్ పేయి తీవ్రంగా వ్యతిరేకించారు. జనాదరణ ఉన్న ఒక ప్రధాని ఇలా మెజారిటీ ఆధారంగా రాష్ట్రపతి కావడం భారత పార్లమెంటరీ ప్రజా స్వామ్యానికి మంచిది కాదని ఆయన భావించారు.
అదో తప్పుడు సంప్రదాయానికి నాంది పలుకుతుందన్నారు. అంతేగాక కలాం అభ్యర్థి త్వానికి అన్ని పార్టీ మద్దతు కూడగట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగారు. ఈ విషయమై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నేతలను చర్చలకు ఆహ్వానించారు. సోనియాగాంధీ, ప్రణబ్ ముఖర్జీ, మన్మోహన్ సింగ్ వంటి అగ్ర నేతలు వచ్చి వాజ్ పేయితో చర్చించారు. రాష్ట్రపతిగా కలాంను నామినేట్ చేయాలని ఎన్డీఏ నిర్ణయించినట్టు వాజ్ పేయి తొలిసారిగా ఆ భేటీలోనే ప్రకటించారు. దాంతో కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. ముందుగా సోనియానే తేరుకున్నారు.
ఈ ఎంపికతో ఆశ్చర్యపోయినట్టు చెప్పారు. అయితే కలాంకు మద్దతివ్వడం తప్ప తమకు మరో మార్గం కూడా లేదని ఆమె అన్నారు‘ అని ఆయన రాసుకొచ్చారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి సందర్భంగా సోనియా, వాజ్ పేయి ఫోన్ సంభాషణ గురించి టాండన్ ప్రస్తావించారు. ‘నాడు విపక్ష నేతగా ఉన్న సోనియా వెంటనే వాజ్ పేయికి కాల్ చేశారు. ’మీరు క్షేమమేనా? నాకు ఆందోళనగా ఉంది’ అంటూ ఆరా తీశారు. ’నేను క్షేమం. మీరు పార్లమెంటు హాల్లో ఉన్నారేమోనని నేను ఆందోళన పడ్డా’ అంటూ వాజ్ పేయి బదులిచ్చారు‘ అని పేర్కొన్నారు.


