ఎం.ఎస్. స్వామినాథన్‌ జీవితగాథ పుస్తకాన్ని ఆవిష్కరించిన కమల్‌హాసన్‌ | Actor, politician Kamal Haasan launches book MS Swaminathan The Man who fed India' by Priyambada Jayakumar | Sakshi
Sakshi News home page

M.S. Swaminathan జీవిత కథను ఆవిష్కరించిన కమల్‌హాసన్‌

Nov 3 2025 12:40 PM | Updated on Nov 3 2025 1:09 PM

Actor, politician Kamal Haasan launches book MS Swaminathan The Man who fed India' by Priyambada Jayakumar

గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త 

వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడు ఎం.ఎస్. స్వామినాథన్‌  జీవితగాథను 'ఎం.ఎస్. స్వామినాథన్: ది మ్యాన్ హూ ఫెడ్ ఇండియా'   పుస్తకాన్ని ప్రముఖనటుడు  కమల్‌ హాసన్‌ చెన్నైలో ఆవిష్కరించారు. ఈ  సందర్బంగా  ఈ పుస్తకం రచయిత్రి, ఆయన మేనకోడలు,  ప్రియంవద జయకుమార్ ఎం.ఎస్. స్వామినాథన్‌తో తన అనబంధాన్ని పంచుకున్నారు.  "నేను ఆయనను ఎంతగానో ఆరాధించాను, రాయాలనుకున్నాను. నా అభిమానిని. చిన్నతనంలో ఆయనను చూసి పెరిగిన వ్యక్తి. కానీ నేను ఆయన గురించి విన్న అనే విశేషాలు పుస్తకంలోకి రాలేదు.  అందుకే ఆయన జీవితాన్ని  గురించి ఒక పుస్తకం రాయాల్సిన సమయం ఆసన్నమైందని నేను అనుకున్నాను. అదే సమయంలో భారతదేశాన్ని నిర్వచించాను. నిజంగి ఇది ఎం.ఎస్. స్వామినాథన్  కథ. ఆయలన కలగన్న  ఆశ, స్థితిస్థాపకత కలిగిన భారతదేశం  కథ. భారతదేశం యొక్క ఎప్పటికీ చెప్పలేని స్ఫూర్తి మరియు ఎప్పటికీ వదులుకోలేని స్ఫూర్తిని మీకు తెలుసు, దీనిని ఆయన తరం భారతీయులు ఉదాహరణగా చూపించారు."అని పేర్కొన్నారు. 

 

గొప్ప శాస్త్రవేత్త... చక్కటి వ్యవహర్త 

ఉన్నత విద్యావంతులున్న ఉమ్మడి కుటుంబంలో మాన్‌కోంబు సాంబశివన్‌ స్వామి నాథన్‌ (M.S. Swaminathan) జన్మించారు (1925). తండ్రి బాటలో మెడిసిన్‌ చదివి కుంభకోణంలోని వాళ్ల హాస్పిటల్‌ను నడిపే అవకాశం; ఐపీఎస్‌కు ఎంపికైనందున అటు వైపుగానూ కెరీర్‌ మలుచుకునే వీలు ఆయనకు ఉండినాయి. కానీ లక్షల మంది చావు లకు కారణమైన బెంగాల్‌ క్షామం(1943) వేసిన ముద్ర ఆయన్ని వ్యవసాయం వైపు నడిపించింది. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యుశాస్త్ర నిపుణుడిగా ఆయన కృషిని చెప్పే పుస్తకం ‘ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా’. ఆయన మేనకోడలు రాసిన జీవిత కథ. 

స్వాతంత్య్రానంతర భారతదేశం ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య... తిండి గింజల కరువు. ‘ఏదైనా ఆగుతుంది కానీ వ్యవసాయం ఆగదు’ అన్నారు నెహ్రూ. సోమవారాలు పస్తులుండమని పిలుపు నిచ్చారు లాల్‌ బహదూర్‌ శాస్త్రి. ‘బ్లడీ అమెరికన్ల’ ముందు చేయి చాచకుండా ఉండే మార్గాల కోసం వెతికారు ఇందిరా గాంధీ. ఒక దశలో ‘పీఎల్‌ 480’ పథకం కింద అమెరికా పంపే గోధుమలే దిక్కు. ఓడలు దిగితేగానీ నోళ్లు ఆడని పరిస్థితి. ఈ దిగుమ తులకు చెల్లించాల్సిన మూల్యం విదేశాంగ విధానంలో స్వతంత్రంగా నిలబడలేకపోవడం. అలాంటి స్థితిలో స్వామినాథన్‌ దేశంలో హరిత విప్లవానికి బాటలు పరిచారు. ‘చరిత్ర ఆయనకు అవకాశం ఇచ్చింది, దాన్ని ఆయన రెండు చేతులా అందుకున్నారు’అంటారు రచయిత్రి.

 గాలికి పడిపోకుండా నిలబడే పొట్టి రకం గోధు మల మీద గామా కిరణాలతో ‘ఐండియన్‌ అగ్రికల్చర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’లో స్వామినాథన్‌ ప్రయోగాలు చేశారు. దానికోసం ‘ఆటమిక్‌ ఎనర్జీ కమిషన్‌’ సాయంతో ‘గామా గార్డెన్‌’ ఏర్పాటుచేశారు. వ్యవ సాయం కోసం అన్ని రంగాలూ సహకరించుకోవాలంటారాయన. ఈ దశలోనే పొట్టి రకం హైబ్రిడ్‌ గోధు మలను మెక్సికోలో నార్మన్‌ బోర్లాగ్‌ విజయవంతంగా పరీక్షించారని తెలిసి, స్వామినాథన్‌ ఆయనకు ఉత్తరం రాశారు(1963). దానివల్ల పదేళ్ల కాలం కలిసొస్తుంద నేది ఆయన ఆలోచన. ఇక వంద కేజీల చొప్పున వచ్చిన ఆ నాలుగు రకాల విత్తనాలను ఇక్కడి నేలలకు అనుగుణంగా కల్యాణ్‌ సోనా, సోనాలిక లాంటి విత్తనాలుగా మార్చి, వ్యవస్థలోని అన్ని అడ్డంకులను అధిగమించి, రైతుల అనుమానాలను తీర్చి, దిగు బడుల ‘చమత్కారాన్ని’ చూపించి, ఇండియా వచ్చిన నార్మన్‌ బోర్లాగ్‌నే ఆశ్చర్యపరిచేలా చేశారు స్వామి నాథన్‌. నాలుగు హెక్టార్లతో మొదలైన ప్రయోగం, 1968 నాటికి పది లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఈ మధ్యలోనే విక్రమ్‌ సారాభాయి సహకారంతో రైతుల కోసం దూరదర్శన్‌లో ‘కృషి దర్శన్‌’ మొదలైంది (1967). సైన్సు శక్తి, విధాన నిర్ణయం, రైతుల ఉత్సాహం – కలగలిసి ‘యూఎస్‌ ఎయిడ్‌’కు చెందిన విలియమ్‌ గాడ్‌ నోటి నుంచి తొలిసారిగా వెలువడిన మాట ‘గ్రీన్‌ రివల్యూషన్‌’ అనేది విజయవంతమైంది.

 

1981లో ఫిలిప్పైన్స్‌లోని ‘ఇంటర్నేషనల్‌ రైస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ డైరెక్టర్‌ జనరల్‌ పదవి ఆయన్ని వరించింది. ఆ స్థానంలోకి వెళ్లిన మొదటి ఆసియన్‌ ఆయన. ఐఆర్‌64 లాంటి పాపులర్‌ వరి రకం ఈ కాలంలోనే వచ్చింది. ప్రణాళికా సంఘం, వ్యవసాయ మంత్రిత్వ శాఖల్లోనూ పనిచేసిన స్వామినాథన్‌ పాత్ర ఇండియాకే పరిమితం కాలేదు. చైనా, పాకిస్తాన్,ఇండోనేషియా, మయన్మార్, టాంజానియా, ఇథియో పియా లాంటి ఎన్నో దేశాల్లో వరి పరిశోధనాకేంద్రాలు ఏర్పాటయ్యేలా సహకరించారు. టైమ్‌ మ్యాగజైన్‌ ప్రచురించిన అత్యంత ప్రభావశీల ఆసి యన్ల జాబితాలోని ముగ్గురు భారతీయుల్లో స్వామి నాథన్‌ ఒకరు (మిగిలిన ఇద్దరు: గాంధీజీ, టాగూర్‌). ‘పది జీవితాల్లో కూడా సాధించలేనిది ఆయన ఒక్క జీవితంలో సాధించారు’ అంటారు రచయిత్రి. ముగ్గురు కూతుళ్ల తండ్రిగా, స్వతంత్ర భావాలున్న భార్య మీనా భర్తగా ఆయన కుటుంబ విశేషాలు మేళవిస్తూ పది అధ్యాయాలుగా రాసిన పుస్తకమిది.  ఫిలిప్పైన్స్‌ వదిలివచ్చేటప్పుడు టగలాంగ్‌లో వీడ్కోలు ఉపన్యాసం చేసి ఆశ్చర్యపరిచారు మీనా. రైతుల కోసం నియమించిన జాతీయ కమిషన్‌తో సహా పదుల కమి టీలకు చైర్మన్‌గా వ్యవహరించి; రామన్‌ మెగసెసే, వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్, భారతరత్న లాంటి గౌరవాలు పొందిన ఎంఎస్‌ తన జీవితంతోనే ఆశ్చర్యపరిచారు.

- ఎడిటోరియల్‌ టీం

(M.S. Swaminathan: The Man Who Fed India)
ఎం.ఎస్‌. స్వామినాథన్‌: ద మ్యాన్‌ హూ ఫెడ్‌ ఇండియా (జీవిత చరిత్ర)
రచన : ప్రియంవద జయకుమార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement