తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపిన తిరుప్పరన్‌కుండ్రం ఆలయ తీర్పు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఆ తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను అభిశంసించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ అభ్యంతరాలతో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అయితే.. ఆయనకు మద్దతుగా న్యాయమూర్తులు రంగంలోకి దిగారు.
జస్టిస్ జీఆర్ స్వామినాథన్ మద్దతుగా 46 రిటైర్డ్ జడ్జిలు, 10 మంది ప్రస్తుత జడ్జిలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అభిశంసన నిర్ణయం న్యాయవ్యవస్థను బెదిరించడమేనని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఇందులో పలువురు సుప్రీం కోర్టు మాజీలు కూడా ఉండడం గమనార్హం.
‘‘తమకు రాజకీయంగా అనుగుణంగా లేరని కారణంతో న్యాయమూర్తులను బాహాటంగా బెదిరించే ప్రయత్నం ఇది. వాళ్లు తీసుకుంది సరైన నిర్ణయమని భావించినా.. అది ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి మూలాలను దెబ్బతీస్తుంది. ఇది నాటి దేశ ఎమర్జెన్సీని తలపించే అంశం. రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా లేని తీర్పులు ఇచ్చినప్పుడు సీనియర్ న్యాయమూర్తులను బద్నాం చేయడం పరిపాటిగా మారుతోంది’’ అని మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అభిశంసనను న్యాయవ్యవస్థ స్వేచ్ఛను కాపాడటానికి ఉపయోగించాలేగానీ.. రాజకీయ ఒత్తిడికి కాదు అని పేర్కొన్నారు.
తమిళనాడులోని మధురై పర్వత ప్రాంతంపై ఆరో శతాబ్దానికి చెందిన తిరుప్పరన్‌కుండ్రం సుబ్రహ్మణ్య ఆలయం.. ఆ ప్రాంగణంలోనే 14వ శతాబ్దానికి చెందిన దర్గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆలయం కింద ఉన్న స్తంభం వద్ద కార్తీక దీపోత్సవం నాడు భక్తులు దీపం వెలిగించడం వందల ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే.. డిసెంబర్ 1వ తేదీన ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ జడ్జి జస్టిస్ స్వామినాథన్.. కింద ఉన్న స్తంభంలో కాకుండా ఆలయం పైన ఉన్న స్తంభం వద్దే దీపం వెలిగించాలని తీర్పు ఇచ్చారు. పైన ఉన్న స్తంభం కూడా ఆలయ సొత్తేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం, అటు ఆలయ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో దర్గా ఉందని.. అక్కడి స్తంభం వద్ద దీపాలు వెలిగిస్తే అది మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పు 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని వాదించింది. అయినప్పటికీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
అయితే ఆ ఆదేశాలను ఆలయ నిర్వాహకులు పాటించలేదు. కొండ దిగువ భాగంలో ఉన్న స్తంభంపైనే దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరిణామంతో జస్టిస్ స్వామినాథన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం పైనా దీపాలు వెలిగించాల్సిందేనని.. లేకుంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని మరోమారు తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీంతో.. డిసెంబర్ 3వ తేదీన వందల మంది కేంద్ర బలగాల సాయంతో కొండపైన దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో.. అధికారులు ఆంక్షలు విధించారు.
ఈలోపు తిరుపరన్‌కుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. జస్టిస్ స్వామినాథన్ గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ డిసెంబర్ 4వ తేదీన మద్రాస్ హైకోర్టును మరోసారి తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ఆ మరుసటిరోజే సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేయగా.. అది ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ఈలోపు..
జడ్జిపై అభిశంసనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. జస్టిస్ స్వామినాథన్‌ను అభిశంసించాలంటూ 120 మంది ఎంపీలు చేసి సంతకాలను డీఎంకే నేత కనిమొళి నేతృత్వంలోని ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు కనిమొళి వెంట ఉన్నారు. అయితే ఈ చర్యను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇండియా కూటమి చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జడ్జిని తొలగించే ప్రయత్నం జరగలేదని.. ఓటు బ్యాంక్ కోసం దిగజారాయని ప్రతిపక్షాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు.
మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏమాత్రం మంచిది కాదని డీఎంకే భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇది డీఎంకే హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడుతోంది.
ఎవరీ స్వామినాథన్?
జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దేశంలో.. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే.


