"వైద్యో నారాయణ హరి" అంటే ప్రాణం పోసే వైద్యులు దేవుళ్లతో సమానమని అర్థం. అయితే వాస్తవం కూడా అదే ఎందుకంటే ఒక వ్యక్తికి ప్రాణం పోయడం కంటే గొప్ప విషయం ప్రపంచంలో మరోకటి ఉండదు. అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన డాక్టర్లకు ఇతర వైద్య సిబ్బందికి సరైన భద్రత కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యతే. అందుకే వైద్య సిబ్బంది భద్రతపై రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు.
ఒక వ్యక్తికి ఆరోగ్యం విలువ తెలిసేది వారు అనారోగ్యం పాలయినప్పుడే అంటారు. ఎందుకంటే అన్నింటిని మించిన సంపద ఆరోగ్యమే అదే లేకుంటే ఎంత సంపద, అధికారం,పరివారం ఇలాంటివి ఎన్ని ఉన్నా అవి వృథానే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడంతో పాటు వారి ప్రాణాలనే కాపాడే వైద్యులను సంఘంలో ఏంతో గౌరవంతో చూస్తారు. అయితే కొన్నికొన్ని సందర్భాలలో తమ వారికి ఏదైనా హాని కలిందనో, లేదా ఇతరాత్రా కారణాలతో వైద్యులతో పాటు ఇతరాత్ర సిబ్బందిపై కొంతమంది దాడులకు పాల్పడుతుంటారు. ఆస్పత్రుల ఆస్తులను ధ్వంసం చేస్తుంటారు. ఆగ్రహంతో క్షణికావేశంలో వైద్యసిబ్బందిపై దాడి చేయడంతో డాక్టర్లు సైతం తమ విధి నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని కొన్ని సార్లు డాక్లర్లు సైతం తాము వైద్యం చేయమని ధర్నాలకు దిగుతున్నారు. వైద్యసిబ్బందిపై దాడి చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాలు కావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇటీవల ఎన్‌సీపీ రాజ్యసభ ఎంపీ డాక్టర్ ఫౌజియా ఖాన్ "సెంట్రల్ ప్రోటెక్షన్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ అండ్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ బిల్ -2025" పేరుతో రాజ్యసభలో బిల్లు ప్రవేశ పెట్టారు.
1.వైద్యసిబ్బందిపై దాడులు 6నెలల నుంచి 5 సంవత్సరాల జైలుశిక్షతో పాటు రూ.50 వేల నుంచి రూ. 5లక్షల వరకూ జరిమానా
2.తీవ్ర దాడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలుశిక్ష రూ. 2 నుంచి 10 లక్షల జరిమానా.
3.ఆసుపత్రులపై దాడిని తీవ్రనేరాలుగా పరిగణించాలి.
పై శిక్షలను చట్టంలో పేర్కొన్నారు. ఈ నేరాలను కాగ్నిజబుల్, నాన్ బెయిలబుల్‌గా పరిగణించాలని తెలిపారు.
2025లో డాక్టర్లపై జరిగిన దాడి ఘటనలు.
1ఇటీవల కోల్‌కతాలో ఒక యువ డాక్టర్‌పై హత్యాచారం చేసి చంపిన సంగతి తెలిసిందే.
2.హౌరాలో మహిళ డాక్టర్‌పై రోగి బంధువులు తీవ్రంగా దాడి చేసి అత్యాచారం చేశారు.
3. మహారాష్ట్ర సతారాలో యువవైద్యురాలిపై లైంగిక దాడి ఆరోపణలు చేయడంతో ఆమె ఆత్మహాత్య చేసుకుంది.
4. ఢిల్లీ ఏయిమ్స్‌లో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు.
భారత్‌లో దాదాపు 75 శాతం మంది తమ విధి నిర్వహణలో ఏదో సందర్భంలో దాడికి గురయ్యారని సర్వేలు తెలుపుతున్నాయి. ఇవే కాకుండా అధికారికంగా రికార్టుల్లోకి ఎక్కకుండా మరెన్నో ఘటనలు జరుగుతున్నాయి.
ET-హెల్త్‌కేర్ సర్వే
ఈ సంస్థ సెప్టెంబర్‌లో ఎస్‌ఎన్ మెడికల్ కాలేజ్ జోధ్‌పూర్‌లోని 658మంది డాక్టర్లపై అధ్యయనం చేసింది. ఇందులో 60 శాతానికి పైగా డాక్టర్లు ఏదో ఒక రకమైన హింస ఎదుర్కొంటున్నట్లు తేలింది. అంతేకాకుండా అందులో 3శాతంకు పైగా డాక్టర్లపై శారీరక దాడులు జరిగినట్లు సర్వేలో వెల్లడైంది.
అయితే డాక్టర్లపై దాడుల నియంత్రించడానికి గతంలోనూ దేశవ్యాప్తంగా చట్టాలు తేవడానికి ప్రయత్నాలు జరిగాయి. కాని అవి అమలులోకి నోచుకోలేదు. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక మైన ఒక చట్టం తేవాలని భావిస్త్నున్నారు.తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో వైద్యులపై దాడికి ప్రత్యేక చట్టాలున్నాయి. అయితే వాటి అమలు విధానంలో లోపాలతో అవి సరైన కార్యరూపం దాల్చడం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకే చట్టం రూపకల్పణ చేయాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు.


