ఢిల్లీ: ఢిల్లీ వాయు కాలుష్యంపై రాజ్యసభ జీరో అవర్‌లో వైఎస్ఆర్ సిపి ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పంధించారు. దీన్ని జాతీయ రాజకీయ, సామాజిక ప్రాధాన్యతాంశంగా తీసుకోవాలి. కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు ఇది ఆరోగ్య ఆర్థిక పరమైన సమస్య. వాయు కాలుష్యంతో మన దేశం ప్రతి ఏడాది మూడు శాతం జీడీపీని కోల్పోతుంది. ప్రజలపై వైద్య చికిత్సల భారం పడి ఉత్పాదకతను కోల్పోతున్నారు. కాలుష్యంతో తీవ్రమైన దీర్ఘకాలిక వ్యాధుల భారిన పడుతున్నారు.
ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతుంది. కాలుష్య నియంత్రణకు తగిన పాలసీ రూపొందించి కఠిన చర్యలు అమలు చేయాలి. వ్యర్ధాల నిర్వహణ, పవర్ ప్లాంట్ కంట్రోల్ , ఎయిర్ క్వాలిటీ, క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టాలి. జాతీయ సామాజిక, రాజకీయ ప్రాధాన్యత అంశంగా దీన్ని తీసుకోవాలి. కాలుష్యం నియంత్రణకు రియల్ టైం డేటాతో తగిన చర్యలు తీసుకోవాలి. ఢిల్లీలో వాయు కాలుష్యం హెల్త్ ఎమర్జెన్సీని తలపిస్తుంది. ఇక్కడ ప్రతి ఏడుగురిలో ఒకరు అకాల మరణ ముప్పును కాలుష్యం వల్ల ఎదుర్కొంటున్నారు.
గతేడాది 17 వేల మంది వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. వాహన కాలుష్యం ,పంట వ్యర్ధాల దహనం, నిర్మాణ పనుల వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరుగుతుంది. ఈ తరహాలోనే విశాఖపట్నంలో కూడా పీఎం 10 లెవెల్స్ గడిచిన ఏడేళ్లలో 32.9 శాతం పెరిగింది. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమం కింద ఏపీకి 129.4 కోట్లు కేటాయిస్తే 39 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కింది స్థాయిలో పర్యవేక్షణ లోపం, అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం,స్థానిక యంత్రాంగ పట్టించుకోకపోవడంతో కాలుష్యం పెరుగుతుందని అయోధ్య రామిరెడ్డి అన్నారు.


