breaking news
Madhurai Bench
-
న్యాయ వ్యవస్థకు బెదిరింపా?
తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపిన తిరుప్పరన్కుండ్రం ఆలయ తీర్పు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఆ తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను అభిశంసించాలని ప్రతిపక్షాలు పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నాయి. అన్నాడీఎంకే-బీజేపీ అభ్యంతరాలతో రాజకీయ దుమారం కొనసాగుతోంది. అయితే.. ఆయనకు మద్దతుగా న్యాయమూర్తులు రంగంలోకి దిగారు. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ మద్దతుగా 46 రిటైర్డ్ జడ్జిలు, 10 మంది ప్రస్తుత జడ్జిలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అభిశంసన నిర్ణయం న్యాయవ్యవస్థను బెదిరించడమేనని.. ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని అంటున్నారు. ఇందులో పలువురు సుప్రీం కోర్టు మాజీలు కూడా ఉండడం గమనార్హం. ‘‘తమకు రాజకీయంగా అనుగుణంగా లేరని కారణంతో న్యాయమూర్తులను బాహాటంగా బెదిరించే ప్రయత్నం ఇది. వాళ్లు తీసుకుంది సరైన నిర్ణయమని భావించినా.. అది ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ స్వాతంత్ర్యానికి మూలాలను దెబ్బతీస్తుంది. ఇది నాటి దేశ ఎమర్జెన్సీని తలపించే అంశం. రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా లేని తీర్పులు ఇచ్చినప్పుడు సీనియర్ న్యాయమూర్తులను బద్నాం చేయడం పరిపాటిగా మారుతోంది’’ అని మాజీ న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. అభిశంసనను న్యాయవ్యవస్థ స్వేచ్ఛను కాపాడటానికి ఉపయోగించాలేగానీ.. రాజకీయ ఒత్తిడికి కాదు అని పేర్కొన్నారు. తమిళనాడులోని మధురై పర్వత ప్రాంతంపై ఆరో శతాబ్దానికి చెందిన తిరుప్పరన్కుండ్రం సుబ్రహ్మణ్య ఆలయం.. ఆ ప్రాంగణంలోనే 14వ శతాబ్దానికి చెందిన దర్గా ఉన్నాయి. ఈ క్రమంలో ఆలయం కింద ఉన్న స్తంభం వద్ద కార్తీక దీపోత్సవం నాడు భక్తులు దీపం వెలిగించడం వందల ఏళ్ల నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే.. డిసెంబర్ 1వ తేదీన ఈ అంశానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన మధురై బెంచ్ జడ్జి జస్టిస్ స్వామినాథన్.. కింద ఉన్న స్తంభంలో కాకుండా ఆలయం పైన ఉన్న స్తంభం వద్దే దీపం వెలిగించాలని తీర్పు ఇచ్చారు. పైన ఉన్న స్తంభం కూడా ఆలయ సొత్తేనని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈ తీర్పుపై ప్రభుత్వం, అటు ఆలయ నిర్వాహకులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో దర్గా ఉందని.. అక్కడి స్తంభం వద్ద దీపాలు వెలిగిస్తే అది మతపరమైన ఉద్రిక్తతలకు దారి తీయొచ్చని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. జస్టిస్ స్వామినాథన్ ఇచ్చిన తీర్పు 2017లో మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు విరుద్ధంగా ఉందని వాదించింది. అయినప్పటికీ ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఆ ఆదేశాలను ఆలయ నిర్వాహకులు పాటించలేదు. కొండ దిగువ భాగంలో ఉన్న స్తంభంపైనే దీపాలు వెలిగించేలా ఏర్పాట్లు చేశారు. ఈ పరిణామంతో జస్టిస్ స్వామినాథన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయం పైనా దీపాలు వెలిగించాల్సిందేనని.. లేకుంటే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని మరోమారు తన ఆదేశాల్లో స్పష్టం చేశారు. దీంతో.. డిసెంబర్ 3వ తేదీన వందల మంది కేంద్ర బలగాల సాయంతో కొండపైన దీపాలు వెలిగించే ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోవడంతో.. అధికారులు ఆంక్షలు విధించారు. ఈలోపు తిరుపరన్‌కుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. జస్టిస్ స్వామినాథన్ గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో పాల్గొన్నారని.. అందుకే ఇలాంటి తీర్పు ఇచ్చారని విమర్శలు గుప్పించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ డిసెంబర్ 4వ తేదీన మద్రాస్ హైకోర్టును మరోసారి తమిళనాడు ప్రభుత్వం ఆశ్రయించింది. అయితే అక్కడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. దీంతో ఆ మరుసటిరోజే సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేయగా.. అది ఇంకా విచారణకు రావాల్సి ఉంది. ఈలోపు.. జడ్జిపై అభిశంసనను విపక్షాలు తెరపైకి తెచ్చాయి. జస్టిస్ స్వామినాథన్‌ను అభిశంసించాలంటూ 120 మంది ఎంపీలు చేసి సంతకాలను డీఎంకే నేత కనిమొళి నేతృత్వంలోని ఎంపీల బృందం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ తదితరులు కనిమొళి వెంట ఉన్నారు. అయితే ఈ చర్యను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఇండియా కూటమి చర్యను సిగ్గుచేటుగా అభివర్ణించింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జడ్జిని తొలగించే ప్రయత్నం జరగలేదని.. ఓటు బ్యాంక్ కోసం దిగజారాయని ప్రతిపక్షాలపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. మరో ఆరు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏమాత్రం మంచిది కాదని డీఎంకే భావిస్తోంది. అయితే బీజేపీ మాత్రం ఇది డీఎంకే హిందూ వ్యతిరేక విధానాలకు నిదర్శనమని మండిపడుతోంది. ఎవరీ స్వామినాథన్?జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దేశంలో.. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. -
జస్టిస్ స్వామినాథన్‌పై అభిశంసన నోటీసు
లోక్‌సభలో మంగళవారం కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ జీఆర్ స్వామినాథన్‌ను తొలగించాలంటూ ఇండియా బ్లాక్ ఎంపీలు అభిశంసన (impeachment) నోటీసులు సమర్పించారు. డీఎంకే ఎంపీ కనిమొళి ఆధ్వర్యంలోని ఎంపీల బృందం.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి నోటీసుల అందజేసింది. మధురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రాంగణంలో కార్తీక దీపం వెలిగించడానికి అనుమతి ఇస్తూ తాజాగా జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తీర్పు ఇచ్చారు. ఈ స్థలం సమీపంలో 14వ శతాబ్దపు దర్గా ఉండటంతో సామాజిక ఉద్రిక్తతలకు దారితీస్తుందనే అభ్యంతరాలు వెల్లవెత్తాయి. డీఎంకే.. దాని మిత్రపక్షాలు ఆయన తీర్పు పక్షపాతంగా ఉందని ఆరోపించాయి. గతంలో దీపం కొండ అడుగున ఉన్న స్తంభం వద్ద వెలిగించేవారు. కానీ, జస్టిస్ స్వామినాథన్ తీర్పు ప్రకారం దీపం కొండ మధ్యలో ఉన్న స్తంభం వద్ద వెలిగించాలి అని ఆదేశించారు. ఈ తీర్పు సెక్యులర్ విలువలకు విరుద్ధంగా ఉందంటూ మద్రాస్ హైకోర్టు న్యాయవాదులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ లోక్‌సభలో 120 ఎంపీల సంతకాలతో కూడిన అభిశంసన పిటిషన్ సమర్పించాయి. డీఎంకే ఎంపీ కనిమొళితో పాటు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా, ఎస్పీ అధినేత.. ఎంపీ అఖిలేష్ యాదవ్ ఆ సమయంలో కనిమొళి వెంట ఉన్నారు. VIDEO | Delhi: DMK leader Kanimozhi submits an Impeachment Notice to Lok Sabha Speaker Om Birla, seeking the removal of Madras High Court Judge G R Swaminathan, after obtaining signatures from more than 120 MPs.Congress MP Priyanka Gandhi Vadra, Samajwadi Party chief Akhilesh… pic.twitter.com/yzn9gq2lio— Press Trust of India (@PTI_News) December 9, 2025 భారతదేశంలో న్యాయమూర్తులపై అభిశంసన చాలా అరుదుగా జరుగుతుంది. అయితే తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ-న్యాయపరమైన ఘర్షణ మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో.. లోక్‌సభ స్పీకర్ నిర్ణయం కీలకంగా మారనుంది. ఆయన నోటీసును స్వీకరిస్తేనే ప్రక్రియ ముందుకు సాగుతుంది. నెక్ట్స్ ఏం జరగొచ్చు.. స్పీకర్ నోటీసును పరిశీలిస్తారు.. అవసరమైతే విచారణ కమిటీ ఏర్పాటు చేస్తారులోక్సభ, రాజ్యసభ రెండింటిలోనూ 2/3 మెజారిటీతో తీర్మానం ఆమోదం కావాలిచివరగా రాష్ట్రపతి ఆమోదిస్తేనే న్యాయమూర్తి పదవి నుంచి తొలగింపబడతారుజస్టిస్ స్వామినాథన్ నేపథ్యం.. జస్టిస్ జీఆర్ స్వామినాథన్ తమిళనాడు తంజావూర్ జిల్లా తిరువారుర్‌లో(1968లో) జన్మించారు. సేలం, చెన్నైలో న్యాయవిద్యను పూర్తి చేశారు. న్యాయవాదిగా దీర్ఘకాలం పనిచేసి, తర్వాత మద్రాస్ హైకోర్టులో మధురై బెంచ్‌కు అదనపు సాలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా సేవలందించారు. అటుపై 2017లో హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. తన పనితీరును ప్రజలకు తెలియజేయడానికి రిపోర్ట్ కార్డు విడుదల చేసిన మొదటి జడ్జి కూడా ఈయనే. గతంలో బీజేపీ అధికారిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తాజాగా తిరుపరంకుండ్రం కార్తీక దీపం తీర్పు వల్ల రాజకీయ వివాదం చెలరేగింది. -
లావణ్య సూసైడ్ కేసు.. స్టాలిన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ!
తమిళనాడును కుదిపేసిన విద్యార్థిని లావణ్య ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకు అప్పగించాలన్న మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. దీంతో రాష్ట్ర పోలీసులతోనే దర్యాప్తు చేయించాలన్న డీఎంకే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సాక్షి, న్యూఢిల్లీ: తంజావూర్ విద్యార్థిని లావణ్య(17) బలవన్మరణ ఉదంతం తమిళనాడును, సోషల్ మీడియా ద్వారా దేశం మొత్తం కుదిపేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీబీ సీఐడీ లేదంటే సమానమైన దర్యాప్తు ఏజెన్సీకి అప్పగించాలంటూ లావణ్య తండ్రి మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌తో ఏకీభవించిన జస్టిస్ జీఎస్ స్వామినాథన్.. జనవరి 1న కేసును సీబీఐకి అప్పగించాలని తీర్పు వెలువరించారు. అయితే ఈ పరిణామం అనంతరం డీజీపీ ద్వారా తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 3న సుప్రీం కోర్టులో ఒక పిటిషన్(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేయించింది. దీనిపై నేడు(సోమవారం) విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. మధురై బెంచ్ తీర్పును సమర్థిస్తూ తమిళనాడు డీజీపీకి, ప్రభుత్వానికి నోటీసులు పంపింది. అంతేకాదు ఇదేం ప్రెస్టీజ్ ఇష్యూ( సీబీఐకు అప్పగించడం ద్వారా రాష్ట్ర పోలీసుల ప్రతిష్టకు భంగం కలిగించే విషయమేం కాదంటూ..) కాదంటూ స్టాలిన్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేసింది బెంచ్. అంతేకాదు దర్యాప్తు కూడా హైకోర్టు ఆదేశాల ప్రకారమే జరగాలని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, బెల ఎం త్రివేది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. మధురై బెంచ్ ఏం చెప్పిందంటే.. తంజావూర్ మైకేల్పట్టీలో నివాసం ఉండేది లావణ్య కుటుంబం. ఆత్మహత్యకు పాల్పడ్డ లావణ్య.. పదిరోజుల తర్వాత కన్నుమూసింది. స్కూల్లో మతమార్పిడి ఒత్తిళ్లతోనే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ చిన్నారి మరణవాంగ్మూలం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడం తెలిసిందే. అయితే మరో వీడియోలో చిన్నారి వార్డెన్ వేధింపుల్ని భరించలేకపోయినట్లు, పినతల్లి వేధింపులు కూడా కారణమేనని చెప్పడం సైతం వైరల్ అయ్యింది. ఈ వ్యవహారంలో బీజేపీ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య రాజకీయ వాగ్వాదం సైతం చోటు చేసుకుంది. ఈ పరిణామాల నడుమే.. స్కూల్లో వేధింపుల కోణంలో కాకుండా.. మతమార్పిడి వేధింపుల కోణంలోనే దర్యాప్తు చేయించాలంటూ లావణ్య తల్లిదండ్రులు మొదటి నుంచి డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ సైతం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంతో.. రాష్ట్ర పోలీసులతో దర్యాప్తు చేయించడం సమంజసం కాదనే ఉద్దేశాన్ని వ్యక్తపరిచింది మద్రాస్ మధురై బెంచ్. అదే టైంలో ఆ వీడియోలను రికార్డు చేసిన వ్యక్తుల పాత్రపైనా అనుమానం వ్యక్తం చేస్తూనే.. ఈ మేరకు సమర్థుడైన అధికారికి అప్పగించాలంటూ సీబీఐని ఆదేశించింది. -
బ్లూ వేల్ ను బ్లాక్ చేసిన తమిళనాడు
సాక్షి, మధురై : సూసైడ్ గేమ్ గా మారి యువత ప్రాణాలు తీస్తున్న బ్లూ వేల్ ఛాలెంజ్ ను తమిళనాడు ప్రభుత్వం బ్యాన్ చేసేసింది. ప్రమాదకరంగా మారిన ఈ ఆటను ఆన్ లైన్ బ్లాక్ చేసినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, మద్రాస్ హైకోర్టులోని మధురై బెంచ్ కు ఈ విషయాన్ని తెలియజేశారు. కోర్టు ఆదేశాలతో బ్లూ వేల్ గేమ్ ను బ్లాక్ చేశామని.. సోషల్ మీడియాలో వీటి లింకులను షేర్ చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ శాఖ ప్రకటించిన విషయాన్ని ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవిందరాజన్ బెంచ్ కు తెలిపారు. ఇక నిఘా వర్గాలు కూడా ఈ విషయంలో సమర్థవంతంగా పని చేస్తున్నాయని వివరించారు. దీంతో తదుపరి వాదనను బెంచ్ సెప్టెంబర్ 8కి వాయిదా వేసింది. మధురైకి చెందిన విఘ్నేష్ అనే యువకుడు గత నెల 30న బ్లూ వేల్ ఆటతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కాగా, గేమ్ కు బానిసలై టీనేజర్లు ప్రాణాలు తీసుకోవటంపై తక్షణమే స్పందించాలంటూ మద్రాస్ హైకోర్టు మధుర బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 50 రోజులపాటు కొనసాగే బ్లూ వేల్ ఛాలెంజ్ గేమ్ లో ప్లేయర్ కి పలు టాస్క్ లను ఇస్తారు. తనని తాను గాయపరుచుకుని, ఆ ఫోటోలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. చివరి లెవల్ లో భాగంగా ఆత్మహత్య చేసుకోవాలంటూ సూచనలు రావటం.. అప్పటికే ఆటకు బానిస అయ్యే గేమర్ ఆ క్రమంలో ప్రాణాలు తీసేసుకుంటుంటాడు. రష్యా నుంచి మొదలైన బ్లూ వేల్ గేమ్ భూతం ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుటివరకు వందల మంది ప్రాణాలను బలి తీసుకుంది.


