గతవారం సరిగ్గా థియేటర్లలో విడుదలకు కొన్ని గంటలు ఉందనగా బాలకృష్ణ 'అఖండ 2' వాయిదా పడింది. ఈ చిత్ర నిర్మాతలు.. గతంలో తీసుకున్న డబ్బుని ఈరోస్ సంస్థకు సకాలంలో చెల్లించకపోవడమే దీనికి కారణం. అయితే కోర్ట్ బయటే సమస్య పరిష్కారమైంది. డబ్బంతా నిర్మాతలు చెల్లించడంతో అఖండ సీక్వెల్‌కి మార్గం సుగమమైంది. సేమ్ దీనిలానే కార్తీ చిత్రం కూడా రిలీజ్‌కి రోజు ముందు వాయిదా పడింది.
కార్తీ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'వా వాతియర్'. తెలుగులో 'అన్నగారు వస్తారు' పేరుతో రిలీజ్ ప్లాన్ చేశారు. లెక్క ప్రకారం గతవారమే విడుదల కావాల్సింది. కానీ చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా.. కొన్నేళ్ల క్రితం అర్జున్ లాల్ సుందర్ దాస్ అనే వ్యక్తి దగ్గర రూ.10 కోట్ల వరకు ఫైనాన్స్ తీసుకున్నారు. కానీ ఆ మొతాన్ని తిరిగి చెల్లించలేకపోయారు. దీంతో వడ్డీలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లకు చేరుకుంది. కొన్నిరోజుల క్రితమే అర్జున్.. మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించారు.
(ఇదీ చదవండి: మహిళలూ... ఆ సైకోలతో జాగ్రత్త: చిన్మయి)
దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజా.. అర్జున్ లాల్‌కి మొత్తం చెల్లించాలని గతవారమే ఆదేశించింది. ఇప్పుడు మళ్లీ అదే విషయాన్ని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సదరు మొత్తాన్ని చెల్లించేవరకు సినిమాని విడుదల చేయడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. మరి జ్ఞానవేల్ రాజా.. ఈ మొత్తాన్ని రేపటిలోపు(డిసెంబరు 12) కడతారా లేదా అనేది చూడాలి? చూస్తుంటే 'అన్నగారు వస్తారు' వాయిదా పడినట్లే అనిపిస్తుంది. అన్నీ క్లియర్ అయిపోతే శనివారం (డిసెంబరు 13) విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
కార్తీ, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. రెండేళ్ల క్రితమే షూటింగ్ మొదలైనప్పటికీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. తీరా ఇప్పుడు విడుదల చేసేందుకు సిద్ధమైతే పాత అప్పుల కారణంగా కోర్ట్.. రిలీజ్‌పై స్టే విధించింది. మరి ఇప్పుడు నిర్మాత జ్ఞానవేల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి?
(ఇదీ చదవండి: మీరు తిట్టకపోతే 'రాజాసాబ్' తీసేవాడిని కాదు: మారుతి)


