‘‘మోగ్లీ 2025’ సినిమాలో రోషన్ ను చూస్తుంటే, ‘చిరుత’ సినిమాలో చరణ్‌ని చూసినట్లు నాకు అనిపించింది. రోషన్‌కి ఆల్ ది బెస్ట్. ‘కలర్‌ఫోటో’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత ‘మోగ్లీ 2025’ సినిమా తీయడానికి ఐదు సంవత్సరాలు పట్టిందని సందీప్ బాధపడుతున్నాడు. కానీ, సమయం గడిచిపోతుంది. సినిమాలు నిలిచిపోతాయి. ‘కలర్‌ఫోటో’లానే ‘మోగ్లీ 2025’ సినిమా కూడా నిలిచిపోతుందని ఆశిస్తున్నాను’’ అని అన్నారు హీరో రానా.
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా, హర్ష చెముడు, బండి సరోజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘మోగ్లీ 2025’(Mowgli Movie). సందీప్ రాజ్ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతీప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రానా ఈ సినిమా టికెట్‌ను కొనుగోలు చేయగా, మరో అతిథిగా హాజరైన దర్శక–నిర్మాత మారుతి ‘మోగ్లీ 2025’ సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.
రోషన్ మాట్లాడుతూ–‘‘ప్రతి మనిషిలో ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ప్రేమ కోసం ఈ మోగ్లీ చేసిన యుద్ధాన్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పారు. ‘‘అమెరికా షెడ్యూల్‌లో మాకు కేటాయించిన థియేటర్స్ మళ్లీ మాకు దొరకవు కనుక, మరొక రిలీజ్ డేట్ లేకపోవడం వల్ల ఓ పెద్ద సినిమాతో పాటు వస్తున్నాం’’అని తెలిపారు టీజీ విశ్వప్రసాద్.
‘‘మా సినిమా దారి తప్పదు. ఒక్క శాతం కూడా మిస్ కాదు’’అని సందీప్ రాజ్ అన్నారు. నటులు బండి సరోజ్ కుమార్, హర్ష మాట్లాడారు.


