
జీవన దృశ్యం
ఒక్కసారి రైల్వేప్లాట్‌ఫామ్‌పై అడుగు పెడితే ఎన్నో దృశ్యాలు కంటబడతాయి. అనుబంధాలకు అద్దం పట్టే తీయటి దృశ్యం, అత్తారింటికి వెళుతున్న కూతురికి వీడ్కోలు చెబుతూ కళ్లనీళ్ల పర్యంతమయ్యే తల్లిదండ్రుల విచార దృశ్యం, కొత్త ప్రాంతానికి వెళ్లే ఆనందంలో స్నేహితుల వినోద దృశ్యం. యాచకుల హడావిడి దృశ్యం, ఒంటరి జీవుల ఏకాంత దృశ్యం...ఎన్నో ఎన్నెన్నో దృశ్యాలు కనిపిస్తాయి.
ఇలాంటి ఎన్నో దృశ్యాలకు సంగీత వల్లట్ పుస్తకాలు అద్దం పడతాయి. రైల్వేడిపార్ట్‌మెంట్‌లో కమర్షియల్ క్లర్క్‌గా పద్నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసిన సంగీత ప్లాట్‌ఫామ్ టికెట్’ పేరుతో తాజాగా పుస్తకం రాసింది. తన ఉద్యోగ జీవితంలో ఎన్నో జ్ఞాపకాలు, అనుభవాలకు ఈ పుస్తకంలో అక్షరరూపం ఇచ్చింది. చెన్నై రైల్వే స్టేషన్‌లో డెబ్బైమంది ఉద్యోగులు పనిచేసే రోజుల్లో తాను ఒక్కరే మహిళా ఉద్యోగి.
హృదయాలను కదిలించే సంఘటనలు మాత్రమే కాదు హాయిగా నవ్వించే సంఘటనలు ఎన్నో ప్లాట్‌ఫామ్ టికెట్’లో ఉన్నాయి. ‘భారతీయ రైల్వే దృశ్యాలు’ అనే మాట వినబడగానే ఆర్‌కే నారాయణ్, రస్కిన్ బాండ్ పుస్తకాలు గుర్తుకు వస్తాయి. ఇప్పుడు ఆ కోవలో సంగీత పేరు కూడా చేరుతుంది. ఉద్యోగిగా రైల్వే డిపార్ట్‌మెంట్‌తో ఉన్న అనుబంధమే ఆమె కలానికి ఉన్న అసలు బలం.
రైల్వేస్టేషన్‌లలో కనిపించే విభిన్న వర్గాల జీవన దృశ్యాలను మాత్రమే కాదు భారతీయ రైల్వే వ్యసస్థ విశ్వరూపాన్ని సూక్ష్మంగానైనా అర్థం చేసుకునే ప్రయత్నం తన రచనల ద్వారా చేస్తోంది సంగీత.