
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ పార్టీ ఆఫీస్ ఇన్‌చార్జ్, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ఆయన దేశానికి చేసిన సేవలను శ్లాఘించారు.
విద్య, శాస్త్రసాంకేతిక రంగాల్లో ఆయన చూపించిన బాటలోనే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనేక సంస్కరణలను ఆ రంగాల్లో తీసుకువచ్చిందని గుర్తు చేశారు. కడు పేదరికంలో జన్మించి, పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, ఈ దేశాన్ని విజ్ఞానపరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టిన అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా ఎవరెవరు ఏం మాట్లాడారంటే..
అబ్దుల్ కలాం ఆశయాలను ఆచరణలో చూపిన నేత వైఎస్ జగన్: ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, పేదరికంను తన పట్టుదల, దీక్షతో జయించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్ కలాం. వీధి దీపాల కింద చదువుకుంటూ, తాను చిన్నతనంలో కన్న కలలను సాకారం చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడి తన భవిష్యత్తును అందరికీ ఆదర్శప్రాయంగా మార్చి చూపించిన గొప్ప దార్శినికుడు. ఉన్నత చదువులతో ఇంజనీర్‌గా, శాస్త్రవేత్తగా, భారతదేశం గర్వించే గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశ రక్షణ వ్యవస్థకు ఆధునిక శాస్త్ర సాంకేతికతను ఊతంగా అందించి, మిస్సైల్ మ్యాన్‌గా కీర్తిని అందుకున్న గొప్ప వ్యక్తి.
ప్రపంచ దేశాల సరసన అణ్వస్త్రదేశంగా భారత్‌ను నిలబెట్టి, ఎటువంటి అంతర్జాతీయ శక్తుల ఒత్తిళ్లకు తలొగ్గం అని చాటిచెప్పడంలో అబ్దుల్ కలాం కృషి మరువలేనిది. ఆయన దేశానికి అందించిన సేవలకు రాష్ట్రపతి వంటి అత్యున్నత పదవి ఆయనను అలంకరించింది. రాష్ట్రపతిగా ఆయన దేశంలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రపతిగా పదవీకాలం పూర్తి అయిన తరువాత ఒక గురువుగా విద్యార్థులకు జ్ఞానాన్ని అందించాలనే సంకల్పంతో పనిచేశారు.
క్రమశిక్షణ, దేశభక్తి, విజయాన్ని సాధించాలనే సంకల్పాన్ని యువతలో పెంపొందించేందుకు ఆయన చేసిన రచనలు కూడా స్పూర్తిదాయకం. అటువంటి మహనీయుల మార్గదర్శకంలో వైయస్ఆర్‌సీపీ ముందుకు సాగుతూ, సమాజంలో మార్పుకు, అభివృద్దికి పాటుపడుతోంది. అబ్ధుల్ కలాం అందించిన స్పూర్తికి అనుగుణంగానే గత అయిదేళ్ళ పాలనలో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ విద్య, సాంకేతికరంగాల్లో అనేక సంస్కరణలను తీసుకువచ్చారు. విద్యతోన పేదరికాన్ని నిర్మూలించాలనే ఆశయంలో ఆయన పనిచేశారు.

దేశానికి అరుదైన సేవలందించిన మహనీయుడు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
తమిళనాడులోని రామేశ్వరం సమీపంలోని ఒక కుగ్రామంలో 1931లో జన్మించి, ఈ దేశం గర్వంచే భారతరత్న వంటి అత్యున్నత పురస్కారాలను ఏపీజే అబ్దుల్ కలాం అందుకున్నారు. దేశానికి రాష్ట్రపతి వంటి ఉన్నతస్థాయి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారు. తన పదవీకాలం పూర్తయిన తరువాత కూడా విద్యార్థులకు స్పూర్తిదాయకంగా నిలవాలని తపించారు. చివరికి ఆయన విద్యార్థులకు బోధనలు చేస్తూనే మరణించారంటే, ఆయన జీవితం ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోవచ్చు.
అటువంటి గొప్ప వ్యక్తి ఈ దేశానికి చేసిన సేవలు మరువలేనివి. అబ్ధుల్ కలాం వంటి మహనీయులు ఇచ్చిన స్పూర్తిని అందుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కూడా సమాజంలో విద్యతోనే మంచి మార్పును సాధించాలనే లక్ష్యంతో పనిచేసింది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తన పాలనలో విద్యకు ఉన్న గొప్పతనాన్ని, అబ్దుల్ కలాం వంటి మహనీయులు సమాజానికి చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తూ పాలన సాగించాలని తపించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు రమేష్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఆలూరు సాంబశివరారెడ్డి, షేక్ ఆసీఫ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణ మూర్తి, పబ్లిసిటీ సెల్ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి, పార్టీ నాయకులు నారమల్లి పద్మజ, కాకాణి పూజిత, బత్తుల రామారావు, దుర్గారెడ్డి, పానుగంటి చైతన్య, ఎ.రవిచంద్ర, దొడ్డ అంజిరెడ్డి, పుణ్యశీల తదితరులు పాల్గొన్నారు.