బీమా రంగంలో ఇక 100 శాతం ఎఫ్‌డీఐలు
ప్రతిపక్షం సూచించిన సవరణలను తిరస్కరించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: దేశంలో బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) 100 శాతం అనుమతిస్తూ కేంద్రం తీసుకొచ్చిన సబ్‌కా బీమా సబ్‌కా రక్షా(బీమా చట్టాల సవరణ) బిల్లు–2025 పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లును మంగళవారం లోక్‌సభలో ఆమోదించగా, బుధవారం రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదించారు. బీమా రంగంలో ప్రస్తుతం 74 శాతం ఎఫ్‌డీఐలను ఆమోదిస్తున్నారు. దీన్ని ఇకపై 100 శాతానికి పెంచబోతున్నారు.
రాజ్యసభలో బిల్లుకు ప్రతిపక్షం సూచించిన పలు సవరణలు తిరస్కరణకు గురయ్యాయి. సమగ్ర పరిశీలన కోసం బిల్లును పార్లమెంటరీ కమిటీకి పంపించాలని విపక్ష సభ్యులు కోరగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. రాజ్యసభలో బిల్లుపై జరిగిన చర్చకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిచ్చారు. ప్రజలకు మేలు జరిగేలా బీమా రంగంలో మరిన్ని సానుకూల మార్పులు రాబోతున్నాయని చెప్పారు. ఈ రంగంలో విదేశీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టబోతున్నాయని వెల్లడించారు.
2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచే దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇప్పటికే పలు కీలక సంస్కరణలు తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రజలకు, వ్యాపారాలకు, వ్యవసాయానికి బీమా రక్షణ విస్తృతంగా లభిస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. 100 శాతం ఎఫ్‌డీలతో బీమా సదుపాయం మరింత విస్తరిస్తుందని, చౌకగా పాలసీలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ రంగంలో వృద్ధికి అపరిమిత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. విదేశీ కంపెనీల రాకతో పోటీ పెరిగి, కొత్త పాలసీలు వస్తాయని, ప్రీమియం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా దేశంలో యువతకు మరిన్ని ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయని స్పష్టం చేశారు.
‘శాంతి’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
అణు ఇంధన రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశానికి వీలు కల్పిస్తూ ప్రభుత్వం రూపొందించిన సస్టైనబుల్ హార్నెసింగ్, అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా(శాంతి) బిల్లును లోక్‌సభలో బుధవారం మూజువాణి ఓటుతో ఆమోదించారు. బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షాలు వాకౌట్ చేశాయి. సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడారు. ప్రైవేట్ కంపెనీల రాకతో అణు ఇంధన రంగం మరింత వేగం పుంజుకుంటుందని చెప్పారు.
‘రామ్ జీ’ బిల్లుపై చర్చ ప్రారంభం
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్, అజీవికా మిషన్–గ్రామీణ(వీబీ–జీ రామ్ జీ) బిల్లుపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ మాట్లాడారు. ఈ బిల్లుతో కూలీలకు ప్రతిఏటా 125 రోజులపాటు పని లభిస్తుందన్నారు. గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న జాతిపిత మహాత్మాగాంధీ కల నెరవేరుతుందని వివరించారు. ఉపాధి హామీ పథకం నుంచి గాం«దీజీ పేరును తొలగించడం పట్ల కాంగ్రెస్ సభ్యుడు జైప్రకాశ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అది అతిపెద్ద నేరమని పేర్కొన్నారు.
71 పాత చట్టాల రద్దు బిల్లుకు సై
కాలం చెల్లిన 71 చట్టాలను రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన రిపీలింగ్, అమెండ్‌మెంట్–2025 బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదం లభించింది. మంగళవారం లోక్‌సభలో, బుధవారం రాజ్యసభలో ఆమోదించారు.


