న్యూఢిల్లీ: రాజ్యసభ జీరో అవర్‌లో ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి కడప–రాయచోటి హైవేపై ప్రతిపాదిత టన్నెల్ నిర్మాణ అంశాన్ని లేవనెత్తారు. ఈ రహదారిలో పొడవైన, ప్రమాదకరమైన ఘాట్ సెక్షన్ ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిలో పలువురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ ప్రమాదకర ఘాట్ సెక్షన్‌ను బైపాస్ చేయడానికి టన్నెల్ నిర్మాణం చేపట్టాలని స్థానిక ప్రజలు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని ఎంపీ తెలిపారు. టన్నెల్ నిర్మాణం పూర్తయితే ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రయాణ సమయం, దూరం కూడా తగ్గుతాయని స్పష్టం చేశారు.
కడప–రాయచోటి హైవే రాయలసీమ ప్రాంతానికి అత్యంత కీలకమైన రహదారిగా ఉండటమే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో అనుసంధానాన్ని మరింత బలోపేతం చేసే ప్రధాన మార్గమని మేడ రఘునాథ్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ వెంటనే ఈ హైవేపై సర్వే నిర్వహించి, టన్నెల్ నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఊతం లభిస్తుందని, వ్యాపారం, రవాణా, పర్యాటక రంగాలకు కూడా మేలు జరుగుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తినట్లు ఆయన స్పష్టం చేశారు.


