ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడలో హీరో నాగార్జున సందడి చేశారు. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్‌లో పాల్గొన్నారు. కాలేజీ కోసం రూ.2 కోట్లని విరాళంగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ పేర్ల మీద కళాశాల విద్యార్థులకు రూ.2 కోట్ల స్కాలర్‌షిప్‌ని నాగార్జున ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ.. నాన్నగారు స్థాపించిన ఏ సంస్థ అయిన నాకు ఎంతో ప్రత్యేకం. గుడివాడ రావడం భావోద్వేగంగా ఉంది. ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంతో పాటు గర్వంగానూ ఉంది. మనుషులు శాశ్వతం కాదు వారు చేసే పనులే శాశ్వతం. తాను చదువుకో లేకపోయినా వేలాదిమంది చదువు, వారి బంగారు భవిష్యత్తు కోసం నాగేశ్వరరావు కళాశాల స్థాపించారు.
రైతు బిడ్డ అయిన నాగేశ్వరరావుకు చదువు అంటే ఆయనకు ఎంతో ఇష్టం. సినిమాకు రూ. 5 వేలు వచ్చే 1951 సంవత్సరాల్లో లక్ష రూపాయలని కళాశాలకు విరాళంగా ఇచ్చారు. ఏఎన్ఆర్ కళాశాలలో చదివిన విద్యార్థులు ఇప్పుడు దేశ, విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. నా తరపున నా కుటుంబ సభ్యుల తరఫున ప్రతియేటా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ అందిస్తాను. గుడివాడలో నాపై చూపుతున్న ప్రేమాభిమానాలకు చేతులెత్తి నమస్కరిస్తున్నా అని నాగార్జున చెప్పుకొచ్చారు.
అక్కినేని నాగేశ్వరరావు విషయానికొస్తే.. దాదాపు ఏడు దశాబ్దాల పాటు 255కు పైగా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. 'ధర్మపత్ని' (1941)తో ప్రారంభించి 'సీతారామ జననం' (1944)లో తొలి హీరోగా మారి, 'దేవదాసు' (1953)తో స్టార్‌డమ్ అందుకున్నారు, పౌరాణిక, జానపద, సామాజిక పాత్రలతో పాటు 'నవరాత్రి'లో తొమ్మిది పాత్రలు పోషించారు, 'అన్నపూర్ణ స్టూడియోస్' స్థాపించి, 'మనం' (2014) చిత్రంలో చివరగా నటించారు. తెలుగు సినిమాను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తరలించడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.
ఏఎన్నార్ తర్వాత నాగార్జున హీరోగా నిలదొక్కుకున్నారు. ప్రస్తుతం నాగ్ తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఏడాది 'కుబేర', 'కూలీ' చిత్రాల్లో నాగ్ వైవిధ్యమైన పాత్రలు చేసి ఆకట్టుకున్నారు.


