ఇషాన్ కట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం "హోమ్ బౌండ్". నీరజ్ ఘెవాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పలు అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. అలాగే 2026లో జరగనున్న ఆస్కార్ అవార్డుల పోటీకి 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం' కేటగిరీలో ఇండియా నుంచి అధికారికంగా ఎంపికైన విషయం తెలిసిందే! ఇప్పుడు మరో ముందడుగు పడింది. ఆస్కార్ ఎంపికలో అతి ముఖ్యమైన షార్ట్‌లిస్ట్ జాబితాలో స్థానం సంపాదించుకుంది.

ఫైనల్ షార్ట్‌లిస్ట్ అప్పుడే..
ఈ విషయాన్ని హోంబౌండ్ మూవీ యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తాజాగా 12 విభాగాల్లో పోటీపడుతున్న సినిమాల షార్ట్‌లిస్ట్‌ను అకాడమీ ప్రకటించింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం విభాగంలో మొత్తం 15 సినిమాలను తాజాగా షార్ట్‌లిస్ట్ చేశారు. అందులో హోంబౌండ్ చోటు దక్కించుకోవడంతో సినీప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తుది జాబితాలో ఈ సంఖ్యను ఐదుకి తగ్గించనున్నారు. ఈ ఫైనల్ జాబితాను జనవరి 22న ప్రకటించనున్నారు. అప్పుడు కూడా హోంబౌండ్ మరోసారి షార్ట్‌లిస్ట్ అవుతుందని ఆశిద్దాం..
హోంబౌండ్ కథేంటి?
షోయబ్, చందన్ కుమార్ అనే ఇద్దరు మిత్రుల కథే హోంబౌండ్. అట్టడుగు ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న వీరిద్దరూ చిన్ననాటి నుంచే పోలీస్ కానిస్టేబుల్ అవాలని కలలు కంటారు. ఓపక్క పోలీస్ ఉద్యోగం కోసం కష్టపడుతూ మరోపక్క చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు. కానీ, ఊరు విడిచి నగరానికి చేరుకున్నాక.. దేశంలో వేళ్లూనుకుపోయిన వివక్ష వారికి అనుభవంలోకి వస్తుంది. మరి వీరి కల నెరవేరిందా? వీరి ప్రయాణం ఎక్కడివరకు సాగిందనేదే కథ. ఈ సినిమాను కరణ్ జోహార్, అదర్ పూనావాలా నిర్మించారు.
#Homebound has been shortlisted for Best International Feature Film at the 98th Academy Awards! @TheAcademy
We’re deeply grateful for the extraordinary love and support we've received from around the world. pic.twitter.com/2dgXjh57Wx— Neeraj Ghaywan (@ghaywan) December 16, 2025


