ముంబైకి చెందిన దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్తని మోసం చేశారనే అభియోగాలపై కొన్ని నెలల క్రితం నటి శిల్పా శెట్టి దంపతులపై కేసు నమోదైంది. ఈ మేరకు జుహు పోలీసులు దీనిని ఆర్థిక నేరాల విభాగానికి బదిలీ చేయగా.. దర్యాప్తు కొనసాగింది. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. రూ.60 కోట్లు మోసం చేశారనే ఆరోపణలపై శిల్పాశెట్టితో పాటు ఈమె భర్త రాజ్ కుంద్రాపై ముంబై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 420 సెక్షన్ పెట్టారు.
అసలేం జరిగింది?
2015- 2023 వరకు ఓ వ్యాపార ఒప్పందం నిమిత్తం దీపక్ కొఠారి అనే వ్యక్తి.. శిల్పాశెట్టి దంపతులకు రూ.60.48 కోట్లు ఇచ్చాడు. కానీ వీళ్లు ఆ డబ్బును వ్యక్తిగత ఖర్చుల కోసం ఉపయోగించుకున్నారు. షాపింగ్ ప్లాట్‌ఫామ్ బెస్ట్ డీల్ టీవీకి శిల్పా-రాజ్ కుంద్రా డైరెక్టర్లుగా ఉన్న సమయంలో దీపక్ ఒప్పందం చేసుకున్నారు. అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా వీళ్లదే. 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి తనకు వ్యక్తిగత హామీ కూడా ఇచ్చారని దీపక్ చెప్పారు.
అయితే ఆ తర్వాత కొన్ని నెలలకే శిల్పా శెట్టి.. డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని, ఆ విషయాన్ని బయటకు చెప్పలేదని దీపక్ కొన్నాళ్ల క్రితం చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ఆ కంపెనీ దివాలా తీసిన విషయం తెలిసిందని చెప్పారు. ఇప్పుడు ఈ కేసులో పురోగతి లభించింది. శిల్పా, ఈమె భర్త రాజ్ కుంద్రాపై ఫ్రాడ్ కేసు నమోదు చేశారు.

మరోవైపు శిల్పా శెట్టికి చెందిన ప్రముఖ రెస్టారెంట్ 'బాస్టియన్' వివాదంలో చిక్కుకుంది. బెంగళూరులోని సెయింట్ మార్క్స్ రోడ్‌లో ఇది ఉంది. అనుమతించిన టైమ్ కంటే ఎక్కువసేపు తెరిచి ఉంచడం, అర్ధరాత్రి పార్టీలకు పర్మిషన్ ఇచ్చి నిబంధనలు ఉల్లంఘించినందుకుగాను బెంగళూరు పోలీసులు ఈ రెస్టారెంట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కర్ణాటక పోలీస్ చట్టంలోని సెక్షన్ 103 కింద సుమోటో ఫిర్యాదుల ఆధారంగా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.


