‘‘అఖండ 2 తాండవం’ని పవర్‌ఫుల్‌గా అన్ని వాణిజ్య అంశాలతో తీశాం. థియేటర్స్‌లో ప్రేక్షకులు ఊపిరి బిగబట్టుకొని చూస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ చాలా ఆనందాన్నిచ్చింది... గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. సంయుక్త, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా బోయపాటి శ్రీను విలేకరులతో మాట్లాడుతూ– ‘‘అఖండ 2’ భారత దేశం ఆత్మ లాంటిది.
అందరికీ చేరాలనే ఉద్దేశంతో తీసిన సినిమా ఇది... డబ్బు కోసం తీయలేదు. మా సినిమా విడుదల వాయిదా పడినప్పుడు బాలకృష్ణగారి ఫ్యాన్స్ ఎలా అర్థం చేసుకుంటారా? అనిపించింది. అంతేకానీ రిలీజ్ పోస్ట్‌పోన్ కావడం గురించి మేం భయపడలేదు. మా సినిమా ఆడుతున్న థియేటర్స్‌కి వెళ్లినప్పుడు ప్రేక్షకులు నిలబడి విజిల్స్, క్లాప్స్ కొట్టడం, చేతులెత్తి దండం పెట్టడం చూశాను. మాకిది చాలా గొప్ప అనుభూతి. ధర్మం మన తల్లి లాంటిది. మన తల్లి గురించి మా సినిమాలో చెప్పాం. ‘అవెంజర్స్, సూపర్ మాన్, బ్యాట్ మాన్’... ఇవన్నీ సృష్టించిన పాత్రలు.
కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది. మనకంత ఘనమైన చరిత్ర ఉంది. మా సినిమా కర్ణాటక, చెన్నై, హిందీలోనూ ఉర్రూతలూగిస్తోంది. మా మూవీ రెవెన్యూ స్ట్రాంగ్‌గా ఉంది. అయితే హిందీలో థియేటర్ల కొరత ఉంది. మా సినిమాని సెప్టెంబరు 25న రిలీజ్ అన్నాం. అయితే అప్పుడు ‘ఓజీ’ సినిమా ఉండటంతో డిసెంబరులో రిలీజ్ చేశాం. ‘అఖండ 2’ త్రీడీలో ఇంకా అద్భుతంగా ఉంటుంది. పిల్లలకు ఒక్కసారి చూపిస్తే మరోసారి వెళ్దామంటారు’’ అని చెప్పారు.


