అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్‌గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.
ప్రీరిలీజ్ ఈవెంట్
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
నా శిష్యుడే
ఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.
ఛాలెంజింగ్ పాత్ర
అరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు.


