ఆర్మీ వీరులకు వీరవందనం
సాక్షి, చైన్నె: భారత్ – పాక్ మధ్య గతంలో జరిగిన యుద్ధంలో అమరులైన వీరులకు వీర వందనం సమర్పించే విధంగా చైన్నె, తిరుచ్చి, పుదుచ్చేరిలలోని అమర వీరుల స్తూపాల వద్ద మంగళవారం కార్యక్రమాలు జరిగాయి. చైన్నెలోని వార్ మెమోరియల్ వద్ద ఆర్మీ వర్గాలు పుష్పగుచ్చాలను ఉంచి వీర వందనంతో నివాళులర్పించాయి. వివరాలు.. 1971లో పాకిస్థాన్ – భారత్ మధ్య యుద్దం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ విజయ కేతనం ఎగుర వేసింది. అప్పటి నుంచి డిసెంబరు 16వ తేదీని విజయ్ దివాస్‌గా జరుపుకుంటూ, ఆ యుద్ధంలో అమరులైన వీరులకు ఘన నివాళుల్ని అర్నిస్తూ వస్తున్నారు. మంగళవారం విజయ్ దివాస్‌ను పురస్కరించుకుని కామరాజర్ సాలై బీచ్ రోడ్డులోని వార్ మెమోరియల్ స్తూపం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సప్తవర్ణ పుష్పాలతో అలంకరించారు. ఉదయాన్నే దక్షిణ భారత ఏరియా చీఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ ఆర్‌ఎం శ్రీనివాస్ తొలుత వీర వందనం సమర్పించారు. అక్కడ పుష్ప గుచ్ఛాల్ని ఉంచి గౌరవ వందనం సమర్పించగా, తదుపరి నావికాదళం, వైమానిక దళానికి చెందిన అధికారులు, తదితరులు వీర వందనంతో నివాళులర్పించారు. ఆర్మీ, నావికాదళం, వైమానిక దళాలకు చెందిన సిబ్బంది ఆ స్తూపం వద్ద గౌరవ వందనం సమర్పించి, వీరుల త్యాగాలు, సేవల్ని స్మరించుకున్నారు. వీరనారీమణులు సైతం తరలి వచ్చి అంజలి ఘటించారు. భారత సాయుధ దళాల శౌర్యం, నైపుణ్యాన్ని ప్రశంసించారు. ఆర్మీలోకి యువతను ప్రోత్సహించే విధంగా సందేశాలు ఇచ్చారు. వీర జవాన్ల అత్యున్నత త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మీఅ ధికారులతో పాటుగా 80 మంది ఎన్‌సీసీ క్యాడెట్లు, విద్యార్థులు సైతం పాల్గొన్నారు. పుదుచ్చేరి సముద్ర తీరంలో విజయ దివాస్ కార్యక్రమం జరిగింది. ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ కై లాస్ నాథన్, సీఎం రంగస్వామి, స్పీకర్ ఎన్బలం సెల్వం, హోంశాఖ మంత్రి నమశ్శివాయంలతో పాటూ ఆర్మీ వర్గాలు వీర వందనంతో వార్ మెమోరియల్ స్తూపం వద్ద అంజలి ఘటించారు. అలాగే తిరుచ్చిలోని వీరుల స్తూపం వద్ద అంజలి ఘటించే కార్యక్రమం జరిగింది.


