సేలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
అదుపు తప్పిన లారీ
ట్రక్కు, మిని లారీ, వ్యాన్, స్కూటర్, కార్లపై దూసుకెళ్లిన వైనం
నలుగురు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
సేలం: ధర్మపురి –సేలం జాతీయ రహదారిలోని తోప్పూరు వద్ద అదుపు తప్పిన ఓ లారీ బీభత్సం సృష్టించింది. అతి వేగంగా దూసుకువచ్చి ఓ ట్రక్కు, మినీలారీ, వ్యాన్, స్కూటర్, రెండు కార్లను ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. ముంబై నుంచి బెంగళూరు మీదుగా తమిళనాడులోని నామక్కల్ కు కోడి దాణా లోడ్ జాతీయరహదారిపై సేలం వైపుగా వస్తున్న ఓ లారీ మంగళవారం ఉదయం తోప్పూరు వద్ద హఠాత్తుగా అదుపు తప్పింది. ముందుకు వెళ్తున్న ట్రక్కు ఽఢీకొంది. ఈ క్రమంలో వెను వెంటనే మరో మినీ వ్యాన్, స్కూటర్, రెండు కార్లు ఒకదాని తర్వాత మరొకటి ఢీ కొట్టుకున్నాయి. ఈ ఘోర ప్రమాదంలో ధర్మపురి జిల్లాలోని మదేమంగళం ప్రాంతానికి చెందిన కలైయరాసి (35), సోదరుడు అరుణగిరి (40) మరణించారు. ఈ ఇద్దరు మోటారు సైకిల్‌పై పయనిస్తున్న వారిగా గుర్తించారు. అలాగే కారులో వెళ్తున్న సేలం జిల్లాలోని పెద్దనాయగన్ పాళయంకు చెందిన దినేష్(30), ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ మునుస్వామి(43) ఘటనా స్థలంలోనే మరణించారు. పలువురు గాయపడ్డారు వీరిలో ముగ్గురి పరిస్థితి విషమయంగా ఉండడంతో ధర్మపురి జిల్లా కేంద్రం ఆస్పత్రికి తరలించారు. తోప్పూరు పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.తోప్పూరు వద్ద తరచూ వాహనాలు ఒకదాని తర్వాత మరొకటి ఢీకొట్టి ప్రమాదానికి గురి కావడం పరిపాటిగా మారింది. తాజా ప్రమాదంలో జాతీయ రహదారిపై 2 గంటల పాటూ వాహన రాకపోకలు స్తంభించాయి.
సేలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం
సేలం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం


