గల్లంతు?
ఎస్‌ఐఆర్‌తో మారిన పరిస్థితి
చైన్నెలో 15 లక్షల ఓట్లు
మాదిరి ఓటరు జాబితా కసరత్తు ముమ్మరం
19వ తేదీన విడుదల చేయనున్న ఈసీ
97 లక్షల ఓట్లు
అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్
సాక్షి, చైన్నె: 2026 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్)కు ఈ ఏడాది నవంబర్ 4వ తేదీన రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఈ సమయంలో రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ప్రకటించారు. అలాగే 68,467 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం విస్తృతంగా చేపట్టింది. తొలుత డీఎంకే కూటమి, టీవీకే వంటి పార్టీలు వ్యతిరేకించినా, చివరకు ఎస్‌ఐఆర్ సవరణలో తమ ఓట్లు గల్లంతు కాకుండా జాగ్రత్తలతోకేడర్‌ను రంగంలోకి దించి తోడ్పాటు అందించే పనిలో నిమగ్నమయ్యారు. 77 వేల మంది బూత్ లెవల్ ఆఫీసర్లు ఇంటింటా పరుగులు తీసినా ఓటర్ల నుంచి స్పందన శూన్యమైంది. ఇందుకు కారణం దరఖాస్తు ఫారంలోని అనేక గందరగోళాలే అని చెప్పవచ్చు. ఎట్టకేలకు ఓటర్లకు దరఖాస్తులు అందజేసి, వాటిని పూర్తి చేసి ఇస్తే చాలు అన్నట్టుగా ముందడుగు వేశారు. నిర్ణీత డిసెంబరు 4వ తేదికి ప్రక్రియను ముగించారు. అయితే పెద్దఎత్తున పూర్తి చేసిన దరఖాస్తులు వెనక్కి రాలేదు. దీంతో డిసెంబరు 11 వరకు కేవలం దరఖాస్తుల స్వీకరణ గడువును మాత్రమే పొడిగించారు. ఆ తదుపరి మరో రెండురోజులు పొడిగించి డిసెంబరు 14వ తేదీతో ఎస్‌ఐఆర్ ప్రక్రియను ముగించారు. తాజాగా వచ్చిన దరఖాస్తుల ప్రక్రియను డిజిటల్‌మయం చేశారు. ఈనెల 19వ తేదీన మాదిరి ఓటరు జాబితాను ప్రకటించేందుకు అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని బృందం చర్యలు చేపట్టింది. దీనికి మరో రోజు మాత్రమే సమయం ఉండటంతో ఈ పనులు తుది దశకు చేర్చారు. ఈ పరిస్థితులలో తాజాగా వెలువడ్డ సమాచారంతో రాష్ట్రంలో 97 లక్షల 40 వేల ఓటర్ల పేర్లు జాబితా నుంచి గల్లంతై ఉన్నాయి. ఈ మేరకు ఓటర్లు ఎస్‌ఐఆర్ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించ లేదని తేల్చారు. ఇందులో 15 లక్షల ఓటర్లు చైన్నెలో ఉండటం గమనార్హం. మొత్తంలో 52.60 లక్షల ఓటర్లు చిరునామా మార్పుతో గుర్తించడం కష్టతరంగా మారినట్టు, మరో 26 లక్షల ఓటర్లు మరణించి ఉన్నట్టుగా తేల్చి ఉన్నారు. 13 లక్షల ఓటర్లు గుర్తించడం సాధ్యం కాలేదని, 3 లక్షల 98 వేల ఓట్లు నకిలీగా ఇప్పటి వరకు తేలినట్టుగా ఎన్నికల వర్గాల నుంచి సమాచారాలు అందుతున్నాయి. చైన్నెలో 40 లక్షల మంది ఓటర్లు ఉండగా 15 లక్షల పేర్లు తొలగించబడనున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. చెంగల్పట్టు జిల్లాలో 7 లక్షలు, కోయంబత్తూరు జిల్లాలో 6.50 లక్షల ఓట్లు అత్యధికంగా గల్లంతు కాబోతున్నాయి. కాంచీపురం తదితర పది జిల్లాలో 15 శాతం మంది ఓటర్ల పేర్లు తొలగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి. తాజాగా అందిన సమాచారం మేరకు సంఖ్య ఈ మేరకు ఉంటే, మాదిరి ఓటరు జాబితా పూర్తి స్థాయిలో వెలువడినానంతరం గల్లంతైన వారి వివరాల వ్యవహారం ఎలాంటి దుమారానికి దారి తీయనుందో వేచి చూడాల్సిందే. సుమారు కోటి మంది ఓటర్ల పేర్లు ఈసారి గల్లంతయ్యే పరిస్థితి ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ఇదిలా ఉండగా, సవరణ ప్రక్రియకు ముందుగా రాష్ట్రంలో 68,467 పోలింగ్ కేంద్రాలు ఉండగా, తాజాగా 6,568 స్టేషన్లు పెరిగాయి. మొత్తంగా 75,035 కేంద్రాలుగా జాబితాలోకి ఎక్కడం గమనార్హం.
పుదుచ్చేరిలో లక్ష తొలగింపు
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎస్‌ఐఆర్ ప్రక్రియకు ముందుగా 10,21,578 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,03,467 ఓటర్ల పేర్లను ఎస్‌ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించారు. దీంతో ఆరాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 9,18,111గా తేలింది. ఇందుకు సంబంధించిన మాదిర ఓటరు జాబితాను ప్రకటించారు. యానం తదితర 25 నియోజకవర్గాలలో వేలాదిగా ఓటర్ల పేర్లను తొలగించారు. ఇందులో అనేకం మరీ చిన్న నియోజకవర్గాలు కావడం గమనార్హం.


