తిరువళ్లూరు: రెవెన్యూ, సర్వేయర్ విభాగాలకు చెందిన ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిస్కరించాలని కోరుతూ దశల వారీగా నిర్వహిస్తున్న ఆందోళనల్లో గత బుధవారం ఉదయం నుంచి రెవెన్యూ ఉద్యోగులు కలెక్టర్ కార్యాలయం వద్ద జాగారం చేస్తున్నారు. ఆందోళన ప్రారంభించి ఏడు రోజులు అవుతున్నా ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో ఉద్యోగులు తమ ఆందోళననూ ఏడో రోజైన సోమవారం సైతం నిర్వహించారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆందోళనలో ఉద్యోగ సంఘాల రాష్ట్ర కో–ఆర్డినేటర్ మణిగండన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, తమిళనాడు పెన్షన్ స్కీము కింద మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలన్నారు. రెవెన్యూ అసిస్టెంట్‌లకు క్రమబద్ధీకరించిన వేతనాలు ఇవ్వాలనే డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సర్వేయర్‌లు, రెవెన్యూ ఉద్యోగుల సమ్మేళనం ఫెరా ఆధ్వర్యంలో జాగారం నిర్వహించారు. ఈ ఆందోళనకు జిల్లా కో–ఆర్డినేటర్ జయకర్ ప్రభు అధ్యక్షత వహించగా ఉద్యోగ సంఘం నేతలు కృష్ణన్, చంద్రశేఖర్, సెంథిల్‌కుమరన్ తదితరులు ప్రసంగించారు. తమ సమస్యలపై ఎన్నికలకు ముందు స్పష్టమైన హామీ ఇచ్చి నేటి వరకు నెరవేర్చకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కరించాలని, లేని పక్షంలో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో సంఘం నేతలు యశ్వంత్‌దాస్, వెన్నిల, అరుల్, ఇళంగోవన్, ఉద్యోగులు పాల్గొన్నారు.


