మైనారిటీల అండగా ద్రావిడ మోడల్
సాక్షి, చైన్నె: మైనారిటీలకు రాష్ట్రంలో అండగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఉందని సీఎం ఎంకే స్టాలిన్ భరోసా ఇచ్చారు. తమిళనాడు హజ్ హౌస్ పనులకు మంగళవారం నంగనల్లూరులో ఆయన శంకుస్థాపన చేశారు. రూ. 39.20 కోట్లతో ఈ పనులు చేపట్టారు. వివరాలు.. చైన్నె అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయంకు కూత వేటు దూరంలో నంగనల్లూరులో ఎకరం స్థలం విస్తీర్ణంలో మైనారిటీ సంక్షేమ శాఖ నేతృత్వంలో హజ్ యాత్ర చేసే ముస్లింల ప్రయోజనం కోసం తమిళనాడు హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం స్టాలిన్ నిర్ణయించిన విషయం తెలిసిందే. రూ.39 కోట్ల 20 లక్షల అంచనా వ్యయంతో ఈ భవన నిర్మాణానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆ పనులకు నంగనల్లూరులో జరిగిన కార్యక్రమంలో సీఎం స్టాలిన్ శంకుస్థాపన చేశారు.
మైనారీటీల సంక్షేమమే లక్ష్యం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం సామాజిక వర్గం శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తున్నట్టుగా పేర్కొంటూ, వివిధ పధకాలను గుర్తు చేశారు. ముస్లీంలకు 3.5 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించామని పేర్కొంటూ, మైనారిటీ ప్రజలకు అండగా ద్రావిడ మోడల్ ప్రభుత్వం ఉందని భరోసా ఇచ్చారు. మైనారిటీ మహిళల శ్రేయస్సు కోసం అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని రకాల ఆర్థిక సాయం అందిస్తున్నామని వివరించారు. మసీదులు, దర్గాల పునర్ నిర్మాణానికి ప్రత్యేక నిధులను కేటాయిస్తూ వస్తున్నామని ఉలమాలకు నెలకు రూ. 1,200 పెన్షన్ అందించడం జరుగుతున్నట్టు పేర్కొన్నారు. ఈ సంవత్సరం తమిళనాడు రాష్ట్ర హజ్ కమిటీకి రూ. 5 కోట్ల నిధిని అందించామని, మైనారిటీ విద్యార్థులకు నెలకు రూ. 1000 స్కాలర్ షిప్‌లను అందజేయడమే కాకుండా, హజ్ యాత్రకు వెళ్లే వారికి ఒకొక్కరికి రూ. 25 వేలు సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ఈ కొత్త తమిళనాడు హజ్ హౌస్‌లో బేస్‌మెంట్‌తో సహా నాలుగు అంతస్తులు ఉంటాయని వివరించారు. బేసెమెంట్‌లో పార్కింగ్ , తొలి అంతస్తులో హజ్ కార్యాలయం, రిసెప్షన్, సమావేశ గది, హజ్ యాత్రికుల వస్తువులను భద్రత పరిచేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయన్నారు. మిగిలిన అంతస్తులలో రోజుకు 400 మంది హజ్ యాత్రికులు బస చేయడానికి వీలుగా అన్ని సౌకార్యలతో వంద గదులను నిర్మించనున్నామని ప్రకటించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ , మంత్రులు అన్బరసన్, నాజర్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యుడు, ఎ మ్మెల్యే అబ్దుల్ సమద్, ఎంపీ నవాజ్ ఖని, ఇండియన్ యూనియన్ ముస్లీం లీగ్ జాతీయ అధ్యక్షుడు కేఎం ఖాదర్ మొహిద్దీన్, మనిద నేయ మక్కల్ కట్చి నేత, ఎమ్మెల్యే జవహిరుల్లా, ఎమ్మెల్యేలు ఇ.కరుణానిధి, ఎస్.ఆర్. రాజా, జె. ముహమ్మద్ షా నవాజ్, అబ్దుల్ వకాఫ్, కె.ఎస్. మస్తాన్, వరలక్ష్మి మధుసూదనన్, మాజీ ఎంపీ అన్వర్ రాజా, సీఎస్ మురుగానందం, తమిళనాడు హజ్ కమిటీ కార్యదర్శి ఎంఏ సిద్ధిక్ తదితరులు పాల్గొన్నారు. కాగా, ఈ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం సీఎం స్టాలిన్ ఎక్స్ పేజీలో ట్వీట్‌చే శారు. హజ్ హౌస్ గురించి ఈ ఏడాది మార్చి 3న ప్రకటన చేశామని, తాజాగా శంకుస్థాపన చేశామని, త్వరితగతిన పనులు ముగించి , హజ్ యాత్రీకులకు అంకితం చేస్తామని పేర్కొన్నారు.
మైనారిటీల అండగా ద్రావిడ మోడల్


