క్లుప్తంగా
ఆంధ్ర విద్యార్థికి అధునాతన రేడియో సర్జరీ
కొరుక్కుపేట: ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన ఓ యువ ఇంజనీరింగ్ విద్యార్థికి అపోలో క్యాన్సర్ సెంటర్‌లో అధునాతన రేడియో సర్జరీ విజయవంతం చేశారు. దీంతో దశాబ్ద కాలంగా ఉన్న మూర్ఛల నుండి ఆ యువకుడు కోలుకున్నట్టు వైద్యులు వెల్లడించారు. అపోలో క్యాన్సర్ సెంటర్‌లోని రేడియో సర్జరీ విభాగానికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ శంకర్ వంగిపురం మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా యువకుడికి మూర్ఛ ఉన్నా మూర్ఛలాగా కనిపించలేదన్నారు. కొన్నిసార్లు అవి అకస్మాత్తుగా అనుచితమైన నవ్వుల తరహాలో, కొన్నిసార్లు ఖాళీ చూపుల తరహాలో , నెమ్మదిగా, అసంకల్పితంగా తల ఊపుతూ వచ్చినట్లుగా వచ్చాయని, ఉపాధ్యాయులు దానిని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఈ క్రమంలో అపోలో క్యాన్సర్ సెంటర్‌లో అధునాతన రేడియో సర్జరీ తో మూర్ఛ నుంచి ఇంజినీరింగ్ విద్యార్థికి విముక్తి కలిగినట్లు తెలిపారు.
సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం
వేలూరు: విశ్వకర్మ స్నేహితుల సంఘం సభ్యులు సేవా కార్యక్రమాలు చేపట్టాలని సేనాందల్ 65వ మఠాధిపతి శివరాజ స్వామిజీ తెలిపారు. తిరువణ్ణామలై జిల్లా కలసపాక్కం తాలుకా కందపాళ్యం గ్రామంలోని విశ్వకర్మ మఠాలయంలో తమిళనాడు విశ్వకర్మ స్నేహితుల సంక్షేమ సంఘం వార్షికోత్సవం, విశ్వకర్మ మఠాలయ 1425 గురు వార్షిక పూజోత్సవం, అవార్డుల ప్రదానోత్సవం ఆ సంఘం నిర్వహకుడు జనార్ధనన్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా శివరాజ స్వామిజీ మాట్లాడుతూ సంఘంలో రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వం చేర్పించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అనంతరం పలువురిని అభినందించి అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు తేజామూర్తి, ఉపాధ్యక్షులు జ్ఞాన సంబందం, కేంద్ర ప్రభుత్వ సిద్ద వైద్య కేంద్రం, పరిశోధన కేంద్రం మాజీ డైరెక్టర్ మీనాక్షి సుందరం, వీఐటీ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ కరుప్పురాజ్, అరుణాచలం పాల్గొన్నారు.
18న వ్యాపారుల సంఘం సర్వసభ్య సమావేశం
కొరుక్కుపేట: తమిళనాడు ట్రేడర్స్ అసోసియేషన్ల సమాఖ్య 42వ రాష్ట్ర జనరల్ కమిటీ సమావేశం 18వ తేదీన తేని జిల్లా వీరపాండిలోని జానకి ముత్తయ్య మహల్‌లో ఫెడరేషన్ అధ్యక్షుడు ఎ.ఎం. విక్రమరాజా అధ్యక్షతన జరుగనుంది. ఈ సమావేశంలో, వ్యాపారులు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న ముఖ్యమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటిని నెరవేర్చడానికి జనరల్ కమిటీ సమావేశం ద్వారా తీర్మానించనున్నారు. ఫెడరేషన్ తదుపరి చర్యలను జనరల్ కమిటీలో నిర్ణయం తీసుకుంటామని విక్రమరాజా మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
వ్యాన్ ఢీకొని పోస్ట్ ఉమెన్ మృతి
అన్నానగర్: అరియలూర్ జిల్లా తిరుమనూర్, సన్నవూర్ మేళా వీధికి చెందిన జేమ్స్ కుమార్తె జెన్నిఫర్ (24). ఈమె తిరుమనూర్ పోస్టాఫీసులో పోస్ట్‌మ్యాన్‌గా పనిచేస్తోంది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు వచ్చే నెలలో ఓ యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. (బుధవారం) నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ స్థితిలో, మంగళవారం ఉదయం, జెన్నీఫర్ తన స్కూటర్‌పై సన్నవూర్ నుండి మేళ కవట్టం కురిచ్చి మీదుగా తిరుమనూర్ పోస్టాఫీసుకి ఎప్పటి లాగే పనికి వెళ్లింది. ఆమె కరైవెట్టి గ్రామం సమీపంలో ఉన్నప్పుడు, ఎదురుగా వస్తున్న గూడ్స్ వ్యాన్ ఆమెను ఢీ కొట్టింది. ఇందులో తీవ్రంగా గాయపడిన జెన్నిఫర్ అక్కడికక్కడే మృతి చెందింది. వెంగనూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గోడకూలి విద్యార్థి మృతి
పళ్ళిపట్టు: ఆర్కేపేట మండలంలోని కొండాపురం గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 135 మంది బాల బాలికలు చదువుకుంటున్నారు. విద్యార్థులకు ఆరుమాసాల పరీక్షలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం విద్యార్థులు పాఠశాలలో పౌష్టికాహారం తీసుకుని పాఠశాల ప్రాంగణంలో భోజనం చేశారు.ఈ సందర్భంగా పాఠశాల ముందు ర్యాంప్ రెండు అడుగుల గోడ కూలడంతో భోజనం చేస్తున్న మోహిత్(13) అనే 7వ తరగతి విద్యార్ధి తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పాయాడు. సమాచారంతో విద్యార్ధి తల్లిదండ్రులతో పాటూ గ్రామీణులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆర్కేపేట పోలీసులతో పాటు తిరుత్తణి ఆర్డీఓ కణిమొళి, డీఎస్పీ కంద తదితరులు గ్రామస్తులతో చర్చలు జరిపారు. నాణ్యత లేని గోడను తొలగించక పోవడంతో కూలి విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విధులు నిర్లక్ష్యం ప్రదర్శించిన పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని, మృతి చెందిన విద్యార్ధి కుటుంబానికి ప్రభుత్వ ఆర్ధిక సాయంగా రూ. కోటి పంపిణీ చేయాలని ఆందోళన చేపట్టారు. ఈమేరకు చర్యలు తీసుకుంటామని అధికారుల హామీ ఇవ్వడంతో పోరాటం వీడారు. అనంతరం మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్కేపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్లుప్తంగా


