అర్ధ వార్షిక సెలవుల్లో మార్పు లేదు
● జనవరి 5న పాఠశాలల పునఃప్రారంభం
అన్నానగర్: తమిళనాడులోని పాఠశాలలకు అర్ధ వార్షిక పరీక్షల సెలవులను మార్చారనే వార్తలు వ్యాపించడంతో, పాఠశాల విద్యా శాఖ దీనికి సంబంధించి వివరణ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలల్లో 1 నుంచి 2 తరగతులు చదువుతున్న విద్యార్థులకు అర్ధ వార్షిక పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 23 వరకు జరుగుతాయని విద్యా శాఖ ప్రకటించింది. దీని తర్వాత, ప్లస్–1, ప్లస్– 2,10 తరగతులకు పరీక్షలు డిసెంబర్ 10వ తేదీన ప్రారంభమై కొనసాగుతున్నాయని పేర్కొంది. ఈనేపథ్యంలో 6 నుంచి 9 తరగతులకు అర్ధ వార్షిక పరీక్షలు, 1 నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెండవ మధ్యంతర పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఒకటి నుంచి ప్లస్‌టూ తరగతుల పరీక్షలు డిసెంబర్ 23న ముగుస్తాయి. దీని తరువాత, అన్ని తరగతులకు అర్ధ వార్షిక సెలవులు మంజూరు చేస్తారు. ఈ సెలవుల తర్వాత, పాఠశాలలు వచ్చే ఏడాది జనవరి 5న తిరిగి తెరుస్తారు. వర్షాల కారణంగా ఏర్పడిన మూసివేతను భర్తీ చేయడానికి జనవరి 2న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయనే వార్తలను విద్యాశాఖ ఖండించింది. తమిళనాడు ప్రభుత్వ పాఠశాల విద్యా క్యాలెండర్‌లో ఇప్పటికే చెప్పినట్లుగా, అర్ధ వార్షిక సెలవుల తర్వాత జనవరి 5న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని అధికారులు మంగళవారం స్పష్టం చేశారు.
జనవరి మొదటి వారంలో సభా పర్వం
సాక్షి, చైన్నె : జనవరి మొదటి వారంలో అసెంబ్లీని సమావేశ పరిచేందుకు ప్రభుత్వం సన్నద్ధ్దమవుతుంది. ఆరో తేదీ నుంచి నాలుగు రోజుల సభను మమా అనిపించే విధంగా నిర్వహించేందుకు తేదీ కసరత్తులు జరుగుతున్నాయి. ఏటా రాష్ట్ర గవర్నర్ ప్రసంగంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవి కొనసాగుతుండటంతో ఏటా డీఎంకే ప్రభుత్వంతో సమరం తప్పడం లేదు. ప్రభుత్వ ప్రసంగాన్ని ఆయన పక్కన పెట్టడం వంటి చర్యలకు పాల్పడటం అసెంబ్లీ వేదికగా వివాదాలకు దారి తీస్తూ వస్తున్నాయి. తాజాగా కొత్త సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల వేళ జరగబోతున్న తొలి సమావేశంలో గవర్నర్ ఎలా వ్యవహరించనున్నారో అన్న చర్చ అప్పుడే మొదలైంది. ఇందుకు కారణం సంక్రాంతి పండుగలోపు అసెంబ్లీని సమావేశ పరిచే విధంగా ప్రభుత్వం కసరత్తులు చేపట్టింది. జనవరి ఆరో తేదీ నుంచి నాలుగు రోజుల పాటూ సభను నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
పునరుత్పాదక రంగంలో ఏఐ సామర్థ్యం
సాక్షి, చైన్నె : పునరుత్పాదక ఇంధనంలో తమిళనాడు ముందజంలో ఉందని, పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఈ రంగంలో ఏఐ, డిజిటల్ సాంకేతికత సామర్థ్యాన్ని పెంచే దిశగా కార్యాచరణనలు వేగవంతం చేయనున్నామని ఫిక్కీ గ్రీన్ ట్యానర్జీ సమ్మిట్ 2025లో తీర్మానించారు. ఫిక్కీ నేతృత్వంలో గ్రీన్ ఎనర్జీ, మాన్యు ఫ్యాక్చరింగ్ టు డ్రైవ్ పేరిట మంగళవారం చైన్నెలో 15వ ఎడిషన్ సమ్మిట్ నిర్వహించారు. గ్రీన్ మాన్యుఫ్యాక్చరింగ్‌లో తమిళనాడు ఒక ట్రిలియన్ డాలర్ల వృద్దిని ఆధించడం లక్ష్యంగా తీర్మానించారు. ఇందులో పెట్టుబడులు, పునరుత్పాదక శక్తి, పర్యావరణ అనుకూల ఉత్పత్తులు,స్తిరత్వం,ఆవిష్కరణల గురించి చర్చించారు. తమిళనాడు ఆశయ సాధనకు మద్దతుగా ఈ వేదికను మార్చారు. గ్రీన్ ఎనర్జీ , స్థిరమైన పారిశ్రామిక వృద్దిలో తమిళనాడు అగ్రస్థానాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఫిక్కీ తమిళనాడు రాష్ట్ర మండలి చైర్మన్ జీఎస్‌కే వేలు నేతృత్వంలో ఈ సమ్మిట్ జరిగింది. ఏఐ ఆధారిత సామర్థ్యం పెంపు, శక్తి నిల్వ, ఎల్‌ఎన్‌జీ, అణు శక్తి , వంటి అంశాలను గురించి సమీక్షించారు. ఈ సమ్మిట్‌లో ఎనర్జీ ప్యానెల్ కన్వీనర్ నందకుమార్, ఐటీసీఓటీ చైర్మన్ హన్సరాజ్ వర్మ, ఎన్‌ఎంసీ చైర్మన్ శివథాను పిళ్‌లై, తదితరులు ప్రసంగించారు.
వేలచ్చేరి–సెయింట్ థామస్ మౌంట్ మధ్య..
కొరుక్కుపేట: చైన్నె బీచ్ – వేలచ్చేరి మధ్య ఎలివేటెడ్ ట్రాక్‌పై ఎలక్ట్రిక్ రైళ్లు నడుపుతున్నారు. ఈ పరిస్థితిలో, వేలచ్చేరి –సెయింట్ థామస్ మౌంట్‌ను అనుసంధానించే ఎలివేటెడ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ 2008లో ప్రారంభించారు. అయితే ఆదంబాక్కం , తిల్లై గంగానగర్‌లో భూమిని సేకరించడంలో సమస్యల కారణంగా పని ఆలస్యం అయింది. తరువాత, 2022 తర్వాత రైల్వే లైన్ కనెక్షన్ పనిని మళ్లీ ప్రారంభించి ప్రస్తుతం పూర్తి చేశారు. నవంబర్ 7న వేళచ్చేరి నుంచి సెయింట్ థామస్ మౌంట్ వరకు 5 కిలోమీటర్ల దూరం వరకు 10 కోచ్‌లతో కూడిన సరుకు రవాణా రైలును పరీక్షించారు. ఇంతలో, సోమవారం రెండవసారి సరుకు రవాణా రైలును మళ్లీ నడిపారు. తాజాగా పట్టాల స్థిరత్వాన్ని పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. ఈలైన్‌లో త్వరలో ఎలక్ట్రిక్ రైలుతో పరీక్షలు నిర్వహిస్తామని, ఆ తర్వాత హైస్పీడ్ రైళ్లను పరీక్ష కోసం నడుపుతామని రైల్వే అధికారులు తెలిపారు.


