రవి మోహన్ కథానాయకుడిగా నటించిన కోమాలి చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ వెంటనే హీరోగా మారాడు. స్వీయ దర్శకత్వంలో కథానాయకుడిగా లవ్‌టుడే సినిమా చేశాడు. యూత్‌ఫుల్ ప్రేమ కథా చిత్రంగా రూపొందిన ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది.
నాలుగు సినిమాలకే
ఆ తర్వాత ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించిన డ్రాగన్ మూవీ సంచలన విజయం అందుకుంది. అలాగే ఈయన హీరోగా నటించిన డ్యూడ్ కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అలా దర్శకుడిగా, హీరోగా అపజయం అనేదే లేకుండా నాలుగు సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నయనతార భర్త విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రంలో నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది.
నెక్స్ట్ ఏంటి?
దీంతో ఈయన నెక్స్ట్ సినిమా ఏంటన్న ఆసక్తి నెలకొంది. అయితే ప్రదీప్.. మరోసారి మెగా ఫోన్ పట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఈయన కథానాయకుడిగా నటించనున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి ప్రదీప్ రంగనాథన్ సైన్స్ ఫిక్షన్ కథను తెరకెక్కించనున్నాడట! దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరికొద్దిరోజుల్లో వెలువడే అవకాశం ఉంది.


