‘‘నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు’’ అంటూ హీరోయిన్ మెహరీన్ స్పష్టం చేశారు. నాని హీరోగా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’(2016) సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు మెహరీన్. ఆ తర్వాత ‘మహానుభావుడు, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, ఎఫ్ 3’ వంటి పలు హిట్ సినిమాల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన అభిమానం సొంతం చేసుకున్నారు మెహరీన్. నటిగా బిజీగా ఉన్న సమయంలోనే బీజేపీ నాయకుడు భవ్య బిష్ణోయ్‌తో నిశ్చితార్థం చేసుకున్న ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారనుకున్నారంతా.
ఆ తర్వాత ఆ నిశ్చితార్థం రద్దు అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే... మెహరీన్ రహస్యంగా పెళ్లి చేసుకున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ న్యూస్‌పై మోహరీన్ స్పందించి, సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘నేను సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నానంటూ కొన్ని ఆంగ్ల వెబ్‌సైట్స్‌లో ఆర్టికల్స్ వచ్చాయి. అందులోనూ నాకు తెలియని, ఎప్పుడూ కలవని వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని రాశారు.
నా వికీపీడియా పేజీని ఎవరో హ్యాక్ చేసి, ‘రెండు నిమిషాల పాపులారిటీ’ కోసం ప్రయత్నించిన ఒక నీచుడి పని ఇది. నా వివాహం విషయంలో రెండేళ్లుగా మౌనంగా ఉన్నప్పటికీ, ఈసారి వేధింపులు హద్దులు దాటడంతో నిజం చెప్పక తప్పలేదనిపించింది. నేను ఇప్పటి వరకు ఎవర్నీ పెళ్లి చేసుకోలేదు. నాకు ఎవరితోనూ వివాహం కాలేదు.. నన్ను నమ్మండి. భవిష్యత్తులో పెళ్లి చేసుకునే నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆ విషయం ప్రపంచం మొత్తానికి తెలిసేలా చెబుతాను.. ప్రామిస్’’ అంటూ పేర్కొన్నారు మెహరీన్. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.


