గత కొన్నేళ్లలో టాలీవుడ్ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే. అందుకు తగ్గట్లే పాన్ ఇండియా మార్కెట్‌లో మనోళ్లు పోటీపడుతున్నారు. పోటీపడితే పర్లేదు కానీ దీని మోజులో పడి అయిన కాడికి బడ్జెట్, రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు. ఇది తప్పితే ప్రేక్షకుడి గురించి ఒక్కరూ ఆలోచించట్లేదు. చూస్తుంటే ఇది భవిష్యత్తులో టాలీవుడ్‌కి సంకటంలా మారనుందా అనే సందేహం కలుగుతోంది.
టాలీవుడ్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది అంటే అంతంత మాత్రంగానే ఉందనేది అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఏడాది మొత్తంలో సరాసరిగా 250-300 సినిమాలు రిలీజైతే వీటిలో 10-20 తప్పితే మిగిలిన మూవీస్ అన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేస్తున్నాయి. ఎవరు ఒప్పుకొన్న ఒప్పుకోకపోయినా ఇదే సత్యం. కానీ అటు హీరోలకు గానీ ఇటు దర్శకనిర్మాతలకు గానీ ఈ విషయం అర్థం కావట్లేదా అనిపిస్తుంది.
ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమాల బడ్జెట్ గానీ టికెట్ రేట్లు గానీ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా ట్రెండ్ మొదలైందో.. మూవీస్ బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. హీరోలకు పదుల కోట్లు లేదంటే వందల కోట్ల పారితోషికాలు ఇస్తున్నారు. నిర్మాణానికీ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. దానికోసం ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెస్తున్నారు. ఇంతా చేసి హిట్స్ కొడుతున్నారా అంటే లేదు. పదిలో ఒకటో రెండు మాత్రమే హిట్ అవుతున్నాయి. వీటికి కూడా పెట్టిన డబ్బులు తిరిగి వస్తున్నాయి గానీ పెద్దగా లాభాలు మాత్రం రావట్లేదు. అటు సినిమాలు హిట్ కాక, ఇటు అప్పులు పెరిగిపోతుండటం కలవరపరిచే విషయం.
టికెట్ రేట్లు అయితే ఎప్పటికప్పుడు చర్చల్లో నిలుస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు టికెట్ రేట్లు రూ.50, రూ.100, రూ.150.. ఇలా అందుబాటులో ఉండేవి. ఎప్పుడైతే పాన్ ఇండియా సినిమాలు అంటూ ట్రెండ్ మొదలైందో వీటికోసం రేట్లలో పెంపు అడుగుతున్నారు. ప్రీమియర్లకు అయితే ప్రభుత్వాల నుంచి జీవోలు తెచ్చుకుని మరీ వందలు, వేల రూపాయలు రేట్లు పెట్టుకుంటున్నారు. అభిమానులు.. తమ హీరో మూవీ కలెక్షన్స్ ఎక్కడ తగ్గిపోతాయోనని నామోషీ వల్లనో ఏమో గానీ ఇంతింత రేట్లు పెట్టి థియేటర్లకు వెళ్తారు. మరి సామాన్య ప్రేక్షకుడు కొనుగోలు చేస్తాడా అంటే సందేహమే.
ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు.. థియేటర్లలో టికెట్ రేట్లు, తినుబండారాల ధరలు చూసి బెంబేలెత్తిపోతున్నారు. దీనికి బదులు ఇందులో కొత్త మొత్తం పెట్టి ఓటీటీల్లో సినిమాలు చూసుకుంటున్నారు. ఈ ట్రెండ్ రోజురోజుకూ పెరుగుతోంది. స్టార్ హీరోల సినిమాలకు అది కూడా బాగుందనే టాక్ వస్తే వెళ్తున్నారు. చిన్న చిత్రాలకైతే బ్లాక్‌బస్టర్ టాక్ వస్తే తప్ప ఆడియెన్స్.. థియేటర్ ముఖం చూడట్లేదు. ఒకప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఒకేలా టికెట్ రేటు ఉండేది. ఇప్పుడు అంతరం కనిపిస్తోంది. ప్రేక్షకుడు కూడా చూడాలా వద్దా అనే విషయంలో అంతరం చూపిస్తున్నాడు.


