సినిమాలని పైరసీ చేసి పోలీసులకు చిక్కిన రవి అలియాస్ ఐబొమ్మ రవి.. ప్రస్తుతం కస్టడీలో ఉన్నాడు. రీసెంట్‌గా బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్స్‌ని న్యాయస్థానం తిరస్కరించింది. నాంపల్లి కోర్టులో మంగళవారం మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో రవిని 12 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు అనుమతినిచ్చింది. ఒక్కో కేసులో 3 రోజులు పాటు విచారించాలని ఆదేశించింది. దీంతో 4 కేసులకుగాను 12 రోజులు పాటు విచారించనున్నారు. ఈనెల 18 నుంచి సైబర్ క్రైమ్ విచారణ మొదలవుతుంది.
మరోవైపు ఇవ్వాళ కొనసాగిన విచారణలోనే రవి తరఫు న్యాయవాది శ్రీనాథ్ తమ వాదనలు వినిపించారు. రవిని కస్టడీ పేరుతో ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు కస్టడీకి తీసుకున్నారని కోర్టుకు తెలిపారు. మరోవైపు సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం.. కస్టడీకి తీసుకుంటేనే రవి నెట్వర్క్ బయటపడుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంకు చెందిన ఇమ్మడి రవి.. ఐబొమ్మ, బప్పం అనే వెబ్‌సైట్లతో సినిమాల పైరసీ చేశాడు. దీని ద్వారానే బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్ల రూపాయలు సంపాదించాడు. ఇందుకోసం కరేబియన్ దీవులను ఎంచుకుని అక్కడి నుంచి సర్వర్లు, థర్డ్ పార్టీ ద్వారా వ్యవహారం నడిపించాడు.


