గత కొన్నిరోజుల నుంచి సినీ ప్రేమికులు ఓ సినిమా గురించి తెగ మాట్లాడుకుంటున్నారు. అదే 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ అయినప్పటికీ.. సౌత్‌లోనూ దీని సౌండ్ గట్టిగానే ఉంది. రణ్‌వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, మాధవన్, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ ఇందులో నటించారు. పదిరోజుల క్రితం థియేటర్లలో రిలీజైంది. కలెక్షన్స్ కూడా ఇప్పటికే రూ.500 కోట్లు దాటేశాయి. మరి అంతలా ఈ సినిమాలో ఏముంది? ఇంతకీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
కథేంటి?
1999లో కాందహార్ హైజాక్, 2001లో భారత పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత మన దేశ ఏజెంట్.. పాకిస్థాన్‌లో ఓ హై పొజిషన్‌లో ఉండాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (ఆర్.మాధవన్) భావిస్తారు. వెంటనే 'ఆపరేషన్ ధురంధర్' ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా హంజా అలీ (రణ్‌వీర్ సింగ్) పాక్‌లోని కరాచీకి స్పై ఏజెంట్‌గా వెళ్తాడు. తర్వాత లయరీ అనే ప్రాంతంలో రెహమాన్ బలోచ్(అక్షయ్ ఖన్నా) నడిపిస్తున్న లోకల్ గ్యాంగ్‌లో చేరతాడు. తర్వాత ఐఎస్ఐ లీడర్‌తోనూ స్నేహం చేసే స్థాయికి వెళ్తాడు. తర్వాత ఏమైంది? ఇందులో ఎస్పీ చౌదరి (సంజయ్ దత్) పాత్ర ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
ఎలా ఉందంటే?
ఇప్పటివరకు చాలా స్పై థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. అవన్నీ కూడా దాదాపు ఒకే టైపులో ఉంటాయి. కానీ 'ధురంధర్' మాత్రం పేరుకే స్పై జానర్ గానీ కేజీఎఫ్ స్టైల్లో ఉంటుంది. అంటే ఊరమాస్ అనమాట. కాందహార్ హైజాక్ సీన్‌తో మొదలయ్యే ఈ మూవీని మొత్తం ఎనిమిది ఛాప్టర్లుగా చూపిస్తారు. 214 నిమిషాల నిడివి అంటే మూడున్నర గంటలపైనే ఉంటుంది. చూస్తున్నంతసేపు ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిన అనుభూతి కలుగుతుంది.
ఈ సినిమా అంతా పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్‌లోనే ఉంటుంది. 1990ల్లో కరాచీలోని లయరీ అనే ప్రాంతం, అక్కడి గ్యాంగ్ వార్స్‌ని కళ్లకు కట్టినట్లు చూపించారు. షూటింగ్ అంతా ఎక్కడ చేశారో గానీ మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మనం పాకిస్థాన్‌లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ప్రతి సీన్, ప్రతి పాత్ర, ప్రతి డైలాగ్.. చాలా డీటైల్డ్‌గా చూపించారు. లయరీ ప్రాంతానికి చెందిన గ్యాంగ్‌స్టర్స్ రెహమాన్ బలోచ్, అర్షద్ అప్పు నిజ జీవిత పాత్రలే. రెహమాన్ పాత్రలో అక్షయ్ ఖన్నా జీవించేశాడు. పేరుకే రణ్‌వీర్ సింగ్ హీరో గానీ మూవీలో రెహమాన్ పాత్ర వేరే లెవల్లో ఉంటుంది.
సినిమా నిడివి విషయంలో ఇబ్బంది అనిపించొచ్చు గానీ ఒక్కసారి మీరు మూవీలోలో లీనమైతే మాత్రం అదిరిపోయే సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఎందుకంటే ఓవైపు విజువల్స్, మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, పాటలు.. ఇలా దేనికవే టాప్ నాచ్ ఉంటాయి. హీరోయిన్ పాత్ర అసలెందుకు ఉందా అని ప్రారంభంలో అనిపిస్తుంది గానీ ఆమె పాత్రని ఉపయోగించిన విధానం చూస్తే ఈమె క్యారెక్టర్ అవసరమే అనిపిస్తుంది. కాకపోతే రణ్‌వీర్ పక్కన హీరోయిన్ సారా చిన్నపిల్లలానే కనిపిస్తుంది. ఇది కాస్త మైనస్.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చాలా రియలస్టిక్‌గా ఉంటాయి. సున్నిత మనస్కులు ఎవరైనా ఉంటే ఓ మూడు నాలుగు సన్నివేశాలు ఉంటాయి. వీటిని చూడకపోవడమే బెటర్. అంత దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలో హీరోతో పాటు కొన్ని కల్పిత పాత్రలు ఉంటయి గానీ మిగిలినవి మాత్రం నిజ జీవిత సంఘటనల నుంచి తీసుకున్నవే. మాధవన్ చేసిన అజయ్ సన్యాల్ పాత్ర చూస్తున్నంతసేపు అజిత్ ఢోబాల్ గుర్తొస్తారు.
క్లైమాక్స్‌లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని హింట్ ఇచ్చారు. అది కూడా మరో మూడు నెలల్లో అంటే మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ కానుందని ప్రకటించారు. తొలిభాగంలో గ్యాంగ్‌స్టర్ గ్రూప్‌లో ఒకడిగా కనిపించిన భారత స్పై హంజా అలీ(రణ్‌వీర్).. సీక్వెల్‌లో మాత్రం ఏకంగా లయరీలోని గ్యాంగ్‌స్టర్స్‌లో ఒకడు అయిపోతాడు. మిగిలిన గ్యాంగ్‌స్టర్స్‌ని చంపేస్తాడు. ఇదంతా ఎండ్ క్రెడిట్స్‌లో చిన్నపాటి ట్రైలర్‌లా చూపించారు. తద్వారా సీక్వెల్‌పై ఆసక్తి పెంచారు.
ఈ సినిమా ప్రస్తుతానికి హిందీలో మాత్రం థియేటర్లలో రన్ అవుతోంది. ఈ వీకెండ్ తెలుగులోనూ రిలీజ్ చేయొచ్చని అంటున్నారు గానీ దానిపై స్పష్టత లేదు. ఓటీటీ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. డీల్ ప్రకారం 8 వారాల తర్వాత అంటే ఫిబ్రవరి తొలి వారంలో డిజిటల్ స్ట్రీమింగ్ ఉండొచ్చు. ఒకవేళ అప్పటివరకు వెయిట్ చేయలేం అనుకుంటే మాత్రం 'ధురంధర్'ని థియేటర్‌లో ఎక్స్‌పీరియెన్స్ చేయండి. వర్త్ వర్మ వర్త్ అనిపిస్తుంది.
- చందు డొంకాన
(ఇదీ చదవండి: ఓటీటీలో రొమాంటిక్ కామెడీ ఫీల్ గుడ్ సినిమా.. తెలుగు రివ్యూ)


