కుమార్తెలు స్వప్న, ప్రియాంకలతో అశ్వినీదత్
పట్టుమని పాతికేళ్ళున్న ఓ యువ నిర్మాత, మూడున్నర పదులు దాటి సినీ రంగంలో సుస్థిర స్థానం కోసం ప్రయత్నిస్తున్న ఓ నవ దర్శకుడు కలసి చేసిన వెండితెర మ్యాజిక్ అది. గత చిత్రాల్లోని ఎన్టీఆర్‌ను పూర్తిగా మార్చేసి, విగ్, కాస్ట్యూమ్స్, పాటలు సహా అంతా కొత్త రకం స్టైల్‌లో చూపించి, అభిమానులతో కేరింతలు కొట్టించిన శత
దినోత్సవ చిత్రమది.
ఇవాళ అగ్రనిర్మాతగా నిలిచిన సి.అశ్వినీదత్ సారథ్యంలోని ‘వైజయంతీ మూవీస్’ వేసిన ఆ తొలి అడుగే... కె. బాపయ్య దర్శకత్వంలో 1975 డిసెంబర్ 12న విడుదలైన ‘ఎదురులేని మనిషి’. ఇక అక్కడ నుంచి మాస్ హీరోగా ఎన్టీఆర్, నిర్మాణ సంస్థగా వైజయంతీ మూవీస్, దర్శకుడిగా బాపయ్య... అందరిదీ ఎదురులేని ప్రస్థానమే. ఎన్టీఆర్ ఇమేజ్‌ను మార్చేసిన కెరీర్‌లోని ఆ కీలక ఘట్టానికీ, దానికి వేదికైన ‘వైజయంతీ మూవీస్’కూ ఇది 50 వసంతాలు నిండిన స్వర్ణోత్సవ సందర్భం.
అది 1970ల ప్రథమార్ధం. బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాంతి తగ్గి, రంగుల చిత్రాల ప్రకాశం పెరుగుతున్న సమయం. సమాజంలోనూ, జీవితంలోనూ పెనుమార్పులు చోటుచేసుకుంటున్న కాలం. మారుతున్న జనం అభిరుచులు, ఆకాంక్షలకు తగ్గట్టుగా హీరోలు తమను తాము పునర్నిర్వచించుకోవాల్సి వచ్చిన సందర్భం. కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు లాంటి కొత్త తరం హీరోలు తెరపై మెరుస్తున్న తరుణం.
అప్పటికే అగ్రనటులుగా ఉన్న ఎన్టీఆర్, ఏయన్నార్‌లు సైతం కాలానుగుణంగా చేసే సినిమాలను మలుచుకుంటున్న వాతావరణం. ‘బడిపంతులు’, ‘తాతమ్మకల’ లాంటి చిత్రాల్లో పెద్ద వయసు పాత్రలతో కళాకారుడిగా ఎన్టీఆర్‌కు ఆత్మతృప్తి కలుగుతున్నా, కొత్త తరం అభిమానులకు తెలియని ఓ అసంతృప్తి. ‘నిప్పులాంటి మనిషి’, ‘అన్నదమ్ముల అనుబంధం’ లాంటి చిత్రాలు అదే సమయంలో వచ్చినా... ఒక్కసారిగా ‘కసిగా ఉంది... కసి కసిగా ఉంది’ లాంటి పాటలతో ఎన్టీఆర్ ఏజ్‌ను మరిపించి, ఇమేజ్‌ను మార్చేసిన మాస్ మసాలా సినిమాలకు పునాది – ‘ఎదురులేని మనిషి’.
నిర్మాత మారారు... ప్రాజెక్టూ మారింది...
‘‘ఎన్టీఆర్‌ను వెండితెరపై యంగ్‌గా చూపించి, సక్సెస్ చేయాలని నా మనసులో ఉండేది. దాని ఫలితమే ఈ చిత్రం’’ అని చెప్పారు దర్శకుడు బాపయ్య. నిజానికి, ఈ ప్రాజెక్ట్‌కు మొదట నిర్మాత అశ్వినీదత్ కాదట. ‘‘పేరు ఇప్పుడు జ్ఞాపకం లేదు కానీ, జయదేవ్, జగదీశ్ లాంటి పేరున్న ఒకరు నా దగ్గరకు వచ్చి, ఎన్టీఆర్ గారితో సినిమా చేయాలంటే, వెళ్ళి కలిశాం. ఎన్టీఆర్ చిత్రాలకు రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్లయిన ‘విజయా పిక్చర్స్’ కాకుండా, ఫలానా శివరామకృష్ణ వ్యవహారాలు మేనేజ్ చేస్తున్న ‘లక్ష్మీ ఫిలిమ్స్’ ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ చేసే డిస్ట్రిబ్యూటర్లంటే, ఎన్టీఆర్ మొదట తటపటాయించారు.
చివరకు సరే అన్నారు. ఈ సంగతి తెలిసి అశ్వినీదత్ నన్ను కలసి, తాను ఆ ప్రాజెక్ట్ చేస్తానంటూ ముందుకొచ్చారు. ముందుగా ప్రాజెక్ట్ అనుకున్న నిర్మాతతో కలసి మాట్లాడమన్నాను. చివరకు వారిద్దరి మధ్య రాజీ కుదిరింది. పరస్పర అంగీకారంతో, కొత్త కంపెనీ పెట్టి దత్ తానే స్వయంగా పూర్తి నిర్మాణ బాధ్యతలు చేపట్టారు’’ అని అని బాపయ్య ‘సాక్షి’తో గుర్తు చేసుకున్నారు. అలా ‘ఎదురులేని మనిషి’తో ఎన్టీఆర్‌తో ‘లక్ష్మీ ఫిలిమ్స్’ అనుబంధం కూడా ప్రారంభమైంది. 1968లో మొదలైన ఆ పంపిణీ సంస్థ ఏడేళ్ళ తర్వాత అలా తొలిసారిగా ఎన్టీఆర్ సినిమా చేసింది. ఆ తర్వాత ‘అడవి రాముడు’ నుంచి ఆ బంధం మరింత బలపడి, పలు చిత్రా లతో బాక్సాఫీస్ చరిత్ర తిరగరాయడం వేరే కథ.
అలాగే, ఈ ప్రాజెక్ట్‌కు ముందనుకున్న కథ కూడా ఇది కాదట. ‘‘అప్పట్లో శివాజీగణేశన్ ‘తంగపతకం’ (1974) రిలీజై బాగా ఆడుతోంది. ఆ సినిమా తెలుగులో చేద్దామని సినిమా కూడా చూశాం. అయితే, రీమేక్ రైట్ల రేటు ఎక్కువ చెప్పారు. ఆ సంగతి ఎంతకూ తెగలేదు. అదే సమయంలో అల్లు అరవింద్ దాన్ని డబ్బింగ్ చేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్టు శివాజీ గణేశన్ సోదరుడు షణ్ముగం నాకు చెప్పారు. దాంతో, ఈ కొత్త కథతో ‘ఎదురులేని మనిషి’ ప్రాజెక్ట్ సిద్ధమైంది’’ అని బాపయ్య చెప్పారు.
ఎన్టీఆర్ పెట్టిన పేరు... గీసిన బొమ్మ...
చిత్ర నిర్మాణ సంస్థకు పేరు పెట్టమని దత్ కోరడంతో విజయానికి చిహ్నమైన శ్రీకృష్ణుడి మెడలోని వైజయంతి మాల పేరిట ‘వైజయంతీ మూవీస్’ అని నామకరణం చేశారు ఎన్టీఆర్. కృష్ణుడి మెడలో వైజయంతి మాల వేస్తున్న రాధ బొమ్మతో ఎంబ్లమ్ లోగో ఎలా ఉండాలో స్వయంగా గీసి కూడా చూపించారు. చిత్రమేమంటే, అంతకు ముందు సురేశ్ ప్రోడక్షన్స్ వారి ఎన్టీఆర్ ‘శ్రీకృష్ణ తులాభారం’కి అసిస్టెంట్‌గా చేశారు బాపయ్య.
ఇక, ఎన్టీఆర్‌పై కృతజ్ఞతతో ఆయన మరణానంతరం తమ బ్యానర్‌పై తీస్తున్న తొలి చిత్రం చిరంజీవి ‘చూడాలని ఉంది’ (1998) నుంచి దత్ తమ బ్యానర్ ఎంబ్లవ్‌ులోనే ఎన్టీఆర్‌ను పెట్టారు. ‘శ్రీకృష్ణావ తారం’ (1967)లో వైజయంతి మాల ధరించి, పాంచ జన్య శంఖం పూరిస్తూ, విజయధ్వానం చేస్తున్నట్టున్న శ్రీకృష్ణ పాత్ర ధారి ఎన్టీఆర్ స్టిల్‌నే ఆ ఎంబ్లవ్‌ుగా ఎంచుకోవడం విశేషం.
హిందీ హిట్ పాయింట్... తెలుగు వంటకం...
నిజానికి, ‘ఎదురులేని మనిషి’ చిత్రం దేవానంద్ – హేమమాలిని నటించిన ‘జానీ మేరా నామ్’ (1970)కి యథాతథమైన రీమేక్ కాదు. ఆ హిందీ హిట్ అప్పటికే తమిళంలో శివాజీ గణేశన్‌తో ‘రాజా’ (1972)గా వచ్చింది. ఆ తర్వాత చాలాకాలానికి కన్నడంలో రాజ్‌కుమార్‌తో ‘అపూర్వ సంగమ’ (1984)గా రీమేకైంది. కాకపోతే, ‘‘ఎన్టీఆర్ ‘ఎదురులేని మనిషి’ లో మాత్రం చిన్నప్పుడే తమ తండ్రిని ఒక స్మగ్లర్ చంపినప్పుడు అనుకోకుండా విడిపోయిన అన్నదమ్ములు ఇద్దరు చివరకు ఎలా కలుసుకున్నారనే ప్రధానమైన ఇతివృత్తం వరకే రచయిత భమిడిపాటి రాధాకృష్ణ హిందీ నుంచి అనుసరించారు.
మిగతా కథనంతా మన వాతావరణానికి తగ్గట్టు కొత్తగా అల్లుకొని, తెలుగులో ఒక సరికొత్త వంట సిద్ధం చేశారు. ‘‘అప్పట్లో ‘ఊర్వశి’ చిత్రం షూటింగ్‌కై మైసూర్‌లో ఉన్నా. అక్కడ ‘లైఫ్’ మ్యాగజైన్‌లో ఓ జరిగిన కథ చదివా. దాన్ని ఇండియనైజ్ చేసి, డెవలప్ చేశాం. ఎన్టీఆర్ ప్రోసీడన్నారు. మెయిన్ పాయింట్, కీలక ఘట్టాలు, సాంగ్ సిచ్యుయేషన్స్ హిందీ నుంచి తీసుకున్నాం’’ అని వివరించారు బాపయ్య.
క్లాష్ వస్తే... కాపాడిన ‘డాడీ’
అప్పట్లో హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న కళాభినేత్రి వాణిశ్రీ కథానాయికగా చలాకీతనం చూపారు. చిన్నప్పుడు అన్న (ఎన్టీఆర్) నుంచి విడిపోయిన తమ్ముడి పాత్రలో జగ్గయ్య పోలీస్ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించారు. స్మగ్లర్లుగా దుష్టపాత్రల్లో ప్రభాకరరెడ్డి, కాంతారావు, సినిమాలో వినోదం కోసం ఎన్టీఆర్ పక్కన రాజబాబు నటించారు. అప్పటి పాపులర్ రేడియో కళాకారులు నండూరి సుబ్బారావు, ఎ.బి. ఆనంద్‌లు చిరుపాత్రల్లో తెరపై తళుక్కున మెరవడం విశేషం. ఈ చిత్రం షూటింగ్ సమయంలోనే బాపయ్య మరోపక్క శోభన్‌బాబుతో సురేశ్ ప్రోడక్షన్స్ వారి ‘సోగ్గాడు’కూ దర్శకత్వం వహిస్తున్నారు.
ఆ సమయంలో ఒకసారి రెండు సినిమాల షూటింగ్ డేట్స్‌కూ క్లాష్ వచ్చింది. ‘‘అప్పుడు నన్ను పెంచిన మా ‘డాడీ’ – ప్రముఖ దర్శకుడు కె.ఎస్. ప్రకాశరావు గారు వచ్చి, ‘ఎదురులేని మనిషి’లో కొన్ని సీన్లు తీశారు. ఆ తర్వాత కొన్నేళ్ళకు ఏయన్నార్ – కృష్ణలతో అశ్వినీదత్ నిర్మిస్తున్న ‘గురుశిష్యులు’ (1981) చేస్తున్నప్పుడూ అలాగే జరిగింది. నా హిందీ చిత్రాలతో క్లాష్ వస్తే, అప్పుడూ ప్రకాశరావు గారే వచ్చి నా బదులు షూటింగ్ చేశారు’’ అని బాపయ్య స్మరించుకున్నారు.
కత్తెర తప్పించు కున్న కసిపాటలు!
మ్యూజికల్‌గా పాపులరైన ‘ఎదురులేని మనిషి’ పాటల గురించి ఒక సంగతి ప్రచారంలో ఉంది. ఆ చిత్రంలో ‘‘అబ్బా... దెబ్బ తగిలిందా...’’ అనే పాటలో ‘తగలరాని తావులో తగిలింది’ అని ఓ లైను ఉంది. ఆ లైనుకు సెన్సార్ అభ్యంతరం చెప్పింది. ‘మీరంత బాహాటంగా, ఉద్దేశపూర్వకంగా శృంగారం గురించి రాస్తే ఎట్లా? దీన్ని మీరెలా సమర్థిస్తారు?’ అని సెన్సార్‌వారు అడిగారట. దర్శక – నిర్మాతలకు ఏం చేయాలో తోచక, పాట రాసిన ఆత్రేయనే సెన్సార్ బోర్డ్‌లో తమ పక్షాన వాదన వినిపించేందుకు పంపారు.
ఆత్రేయ చాలా తాపీగా, సెన్సార్ అభ్యంతరం విని, ‘తగలరాని చోటులో తగిలిందని రాసినందుకు మీరు అభ్యంతరం చెప్పారు. సరే... అసలు తగలవలసిన చోటులెక్కడో మీరు చెబితే, అసలు నేను రాసిన తగలరాని చోటేదే చెబుతాను’ అన్నారట. ఆ మాటలతో తెల్లబోవడం సెన్సార్ వంతు అయింది. అయితే, చివరకు సినిమాలో మాత్రం ఆ లైనును ‘తగలరాని హృదయంలో తగిలింది’ అని హీరోయిన్ అన్నట్టుగా చిరుమార్పు చేశారు.
అలాగే, ‘కసిగా ఉంది కసి కసిగా ఉంది...’, ‘హే కృష్ణా ముకుందా మురారీ...’ లాంటి పాటలు సైతం పామర జనానికి బాగా పట్టేశాయి. అలాగే పి. సుశీల పాడగా జ్యోతిలక్ష్మిపై చిత్రీకరించిన ‘కంగారూ ఒకటే కంగారూ... కళ్ళు కలిస్తే కంగారు... ఒళ్ళు తగిలితే కంగారు... కౌగిలిస్తే ఏమవుతారు దొర గారూ...’ పాట అప్పట్లో తరచూ రేడియోలోనూ మోగే పాపులర్ శృంగార గీతమైంది. మొత్తం మీద కె.వి. మహదేవన్ సంగీతం, ఆత్రేయ సాహిత్యం, హీరాలాల్ మాస్టర్ బావమరిది అయిన శీను మాస్టర్ నాయికా నాయకులకు కంపోజ్ చేసిన స్టెప్పులు... అన్నీ కలసి ప్రేక్షకులను హుషారెత్తించాయి.
తిరుగులేని ఓపెనింగ్స్...
ఎన్టీఆర్‌తో చిత్రాలన్నీ బ్లాక్ అండ్ వైట్‌లో ఆరేడు లక్షలు, కలర్‌లో దాదాపు పది లక్షల్లో తయారవుతున్న రోజులవి. నిర్మాత అశ్వినీదత్ సుమారు రూ. 11 లక్షల బడ్జెట్‌తో ఈ ఈస్ట్‌మన్ కలర్ చిత్రాన్ని నిర్మించారు. చిత్రమేమిటంటే, రిలీజవుతూనే ‘ఎదురులేని మనిషి’ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని ఓపెనింగ్స్ సాధించి, అంతకు అంత సంపాదించింది. కొత్త తరహా స్టైల్‌లో, కిర్రెక్కించే పాటలతో, యువతరం గెటప్‌లో ఎన్టీఆర్‌ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. వెరసి, ‘‘మొదటివారంలోనే రూ.17 లక్షలకు పైగా వసూలు చేసిన’’ట్టు నిర్మాతలు, పంపిణీదారులే స్వయంగా పత్రికా ప్రకటనల్లో ప్రముఖంగా ప్రస్తావించారు. రెండు వారాల్లో దాదాపు పాతిక లక్షల పైగా వచ్చినట్టు ప్రకటించారు.
అలాగే, అప్పట్లో నెల్లూరులో అనిత థియేటర్ ఈ సినిమాతోనే డిసెంబర్ 13న ప్రారంభమైంది. ఆ థియేటర్‌లో తొలి వారం రోజులకే ఈ చిత్రం రూ. 39,102 వసూలు చేసి, నెల్లూరు సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. మంచి రెవెన్యూ తెచ్చి, హిట్ చిత్రంగా నిలిచి, 5 కేంద్రాల్లో (డైరెక్ట్‌గా నెల్లూరులో, సింగిల్ షిఫ్టులతో విజయవాడ, గుంటూరు, కాకినాడ, హైదరాబాదుల్లో) శతదినోత్సవం జరుపుకొంది. 1976 మార్చి 25న మద్రాస్‌లోని చోళా హోటల్‌లో వందరోజుల వేడుక జరిగింది. ప్రముఖ గేయ రచయిత దాశరథి సభా కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ ప్రసంగిస్తూ, చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. ఆయన సోదరుడు – ఎన్.ఏ.టి. సంస్థ అధినేత త్రివిక్రమరావు అందరికీ జ్ఞాపికలు అందజేశారు.
బాపయ్య కెరీర్‌కు బాక్సాఫీస్ పునాది
‘ఎదురులేని మనిషి’ హిట్, ఆ తర్వాత సరిగ్గా వారం రోజులకే (1975 డిసెంబర్ 19న) వచ్చిన శోభన్‌బాబు ‘సోగ్గాడు’ బ్లాక్‌బస్టర్ కావడంతో దర్శకుడిగా బాపయ్య కెరీర్‌కు ఇక తిరుగులేకుండా పోయింది. వరుసగా కమర్షియల్ చిత్రాలు, ‘సోగ్గాడు’ హిందీ వెర్షన్ మొదలు అక్కడి అవకాశాలు... ఆయనను రెండు దశాబ్దాల పాటు ఊపిరి సలపని బిజీ డైరెక్టర్‌ను చేశాయి. ఆ తరువాత ఎన్టీఆర్‌తోనే వైజయంతీ మూవీస్ ‘యుగపురుషుడు’ (1978) సహా మరో 5 చిత్రాలు డైరెక్ట్ చేశారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్ళే ముందు చివరగా చేసిన ‘నా దేశం’ (1982) చిత్రం కూడా బాపయ్య దర్శకత్వంలో వచ్చినదే!
ఆ ‘స్వర్ణోత్సవ’ సంస్థల తొలి హీరో ఆయనే!
సంకల్పం మంచిదైతే, సాధించాలనే పట్టుదల తోడైతే, సాధన చేయడం మానకపోతే... సక్సెస్ రావడం తథ్యం. యాభై ఏళ్ళ క్రితం ‘ఎదురులేని మనిషి’తో సొంతంగా సినీ రంగంలో తొలి అడుగులు వేసి, ఇప్పటికీ ‘మహానటి’, ప్రభాస్ ‘కల్కి’ లాంటి చిత్రాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్న ప్రసిద్ధ చిత్ర నిర్మాణసంస్థ ‘వైజయంతీ మూవీస్’, దాని అధినేత అశ్వినీదత్ ప్రయాణం అక్షరాలా అలాంటిదే! సినీచరిత్రలో ఇలా 50 వసంతాలు ఆగకుండా ఒక చిత్రనిర్మాణ సంస్థ తెలుగు సినిమాలు తీయడం, దానికి ఒకే కుటుంబ సభ్యులు నిర్మాతలుగా, సారథ్యం వహించడం అతి కొద్ది సందర్భాల్లోనే జరిగింది.
‘రాముడు – భీముడు’ (1964)తో అ్రగ నిర్మాత డి. రామా నాయుడు ఆరంభించిన ‘సురేశ్ ప్రోడక్షన్స్’ గతంలో ఆ ఘనత సాధించింది. ‘ఎదురులేని మనిషి’ (1975)తో అశ్వినీదత్ స్థాపించిన ‘వైజయంతీ మూవీస్’ ఇప్పుడు ఆ అరుదైన జాబితాకెక్కింది. విశేషమేమిటంటే, ఆ రెండు బ్యానర్ల తొలి సినిమాలకూ మెడలో విజయానికి చిహ్నమైన వైజయంతి మాలతో వెండితెరపై అపర శ్రీకృష్ణావతారమైన అలనాటి అగ్రనటుడు ఎన్టీఆరే తొలి హీరో!
చరిత్రలో చెరగని ‘వైజయంతి’
అరుదైన కాంబినేషన్లతో తెలుగు నుంచి హిందీ దాకా వివిధ భాషల్లో భారీ చిత్రాలకూ, బాక్సాఫీస్ హిట్లకూ వైజయంతి సంస్థ, అశ్వినీదత్ చిరునామాగా నిలిచారు. ఎన్టీఆర్ మొదలు ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు... చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున మీదుగా ఇవాళ్టి మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, నాని దాకా అ్రగ హీరోలందరితో తెలుగులో సినిమాలు తీసిన అరుదైన సంస్థ కావడం చరిత్రలో చెరిగిపోని విషయం. అక్కడి అమితాబ్ నుంచి ఇక్కడి రజనీకాంత్, కమలహాసన్‌ల దాకా అందరూ గౌరవించే నిర్మాతగా నిలవడం అశ్వినీదత్ సమర్థతకూ, సినీ నిర్మాణ చాకచక్యానికీ నిదర్శనం.
ఇక, తరాలు మారినా తరగని వన్నెతో... ఆయన కుమార్తెలు స్వ΄్నా దత్, ప్రియాంకా దత్, అల్లుడు నాగ్ అశ్విన్‌లతో కలసి కొత్త అభిరుచులకు తగ్గట్టు వైజయంతీ మూవీస్ విజయవంతంగా సాగడం చెప్పుకొని తీరాల్సిన అంశం. తల్లితండ్రుల సినీ వారసత్వాన్ని ఇంత సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకువెళుతూ, ఓ సినీ నిర్మాణ సంస్థను ఇంత సమర్థంగా కుమార్తెలు నడిపిన ఉదంతాలు సినీ చరిత్రలో అత్యంత అరుదు. అందుకే, అక్షరాలా ఇది ఎదురులేని ప్రస్థానం!
భారతీయ సినిమా ఊహించని రీతిలో ఊపందుకొన్న సరికొత్త 1970వ దశకం అది. అన్ని తరగతుల ప్రేక్షకులనూ ఆకట్టుకోవాలనే ఆలోచన పెరిగి, వివిధ రకాల సినిమాలు ఏకకాలంలో రావడం మొదలైన కాలమది. ఒక పక్కన ప్రేమకథల ప్రాధాన్యం తగ్గకపోయినా, క్రైమ్ థ్రిల్లర్లు, ఆఫ్‌బీట్ కథలు హిందీ సినీ ప్రపంచాన్ని ఏలడం మొదలుపెట్టాయి. అలా అప్పుడు వచ్చినవే... దేవానంద్ ‘జానీ మేరా నామ్’ (1970), అమితాబ్ ‘జంజీర్’ (1973 – తెలుగులో ‘నిప్పులాంటి మనిషి’), ధర్మేంద్ర ‘యాదోంకీ బారాత్’ (1973 – తెలుగులో ‘అన్నదమ్ముల అనుబంధం’), రాజేశ్‌ఖన్నా ‘రోటీ’ (1974 – తెలుగులో ‘నేరం నాది కాదు ఆకలిది’), అమితాబ్ బచ్చన్ ‘దీవార్’ (1975 – తెలుగులో ‘మగాడు’). మారిన కాలం, మారుతున్న ప్రేక్షకాభిరుచికి తగ్గట్టుగా ఆ తర్వాత కాలంలో అవన్నీ తెలుగులోకి ఎన్టీఆర్ హీరోగా వచ్చాయి.
‘అడవి రాముడు’కు అనుకోని బీజం
1970ల మధ్యభాగంలో ఎన్టీఆర్ కెరీర్ మరో కొత్త మలుపు తిరగడానికి కారణమైన సినిమా... ‘ఎదురు లేని మనిషి’. ఆయన విగ్గు, కాస్ట్యూమ్‌ల దగ్గర నుంచి తెరపై ఆయన చూపు, పాటల్లో కిర్రెక్కించే ఆయన ఊపు అన్నీ మారాయి. కమర్షియల్ చిత్రం చేయడం అదే తొలిసారి అయినా దర్శకుడు బాపయ్య తెగ విజృంభించారు. పూర్తి సొంతంగా సినిమా తీయడం అదే ప్రథమం అయినా, ‘పెద్ద వయసు ఎన్టీఆర్‌తో ఈ కుర్ర చేష్టలేమిటి’ అంటూ చిత్రనిర్మాణ సమయంలోనే పరిశ్రమలో నెగటివ్ ప్రచారం సాగినా, విమర్శల్ని లెక్క చేయకుండా నిర్మాత దత్ నిబ్బరంగా నిలిచారు. మంచి ఫామ్‌లో ఉన్న అందాల నటి వాణిశ్రీ, మాస్ మెచ్చే పాటలు, స్టెప్పులు, సంగీతం, యాక్షన్... అన్నీ కలసి ‘ఎదురులేని మనిషి’ని తిరుగులేని సక్సెస్ చేశాయి.
ఈలలు, చప్పట్లతో అభిమానులను కేరింతలు కొట్టేలా చేశాయి. యాభై రెండేళ్ళ వయసులో ఎన్టీఆర్‌ను కుర్రకారుకు చేరువ చేశాయి. అంతే... ఆ తర్వాత నుంచి ఎన్టీఆర్ ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను...’ అంటూ హీరోయిన్లతో చిందులేశారు. మళ్ళీ కుర్రపాత్రలు, వాటికి తగ్గట్టు బెల్ బాటమ్ ΄్యాంట్‌లు, పై గుండీలు తీసేసి ఛాతీ చూపించే షర్టులతో మాస్ హీరోగా వెండితెరపై చెలరేగిపోయారు. ఆయన దుస్తులూ అప్పట్లో ఓ ట్రెండ్. ఒక రకంగా ఈ ‘ఎదురులేని...’ చిత్రమే బాపయ్య పెదనాన్న గారి కుమారుడైన కె. రాఘవేంద్రరావు ఆ తర్వాత కాలంలో ‘అడవి రాముడు’ (1977) తీయడానికి ప్రేరణైంది. అక్కడ నుంచి మహావృక్షం స్థాయికి విజృంభించిన
ఎన్టీఆర్ మాస్ ఇమేజ్‌కు అలా ఈ చిత్రమే కనిపించని విత్తనమైంది.
కుర్రాళ్ళ మాటకే ఎన్టీఆర్ ఓటు!
ఎన్టీఆర్‌కు సైతం అయిదు పదులు నిండిన ఆ వయసులో ఇలాంటి గెటప్‌లు, పాటలు, డ్యాన్సులు చేయడం కొత్తే. కాకపోతే, యువ ప్రేక్షకుల కోసమంటూ దర్శక, నిర్మాతలు పట్టుబట్టడంతో ఓకే అనేశారు. ‘ఎదురులేని మనిషి’ కోసం బొంబాయి నుంచి ప్రత్యేకంగా డ్రెస్‌లు, మేకప్, విగ్ అన్నీ తెప్పించారు. పాటల చిత్రీకరణతోనే పబ్లిసిటీ మొదలుపెట్టారు. పరిశ్రమలో ఎవరెంత నెగటివ్ ప్రచారం చేసినా, నిర్మాత దత్ ధైర్యంగా ముందుకు సాగారు. చివరకు ఒకసారి ఎన్టీఆర్ షూటింగయ్యాక ఆ గెటప్‌లో ఇంటికి వెళితే, వారి ఇంట్లో శ్రీమతి సహా అందరూ నివ్వెరపోయి, ఇదేమిటన్నారట! ‘యువ దర్శక, నిర్మాతలు సినిమా చేస్తున్నారు. వారి మాట విందాం. చేయనిద్దాం’ అన్నారట ఎన్టీఆర్.
అప్పట్లో ఈ సినిమాపై వివాదాలకూ తక్కువ లేదు. అప్పటికే తెలుగు సినీసీమలో ‘బూత్రేయ’ అంటూ ఒకింత చెడ్డపేరు తెచ్చుకున్న ఆత్రేయ మాత్రం అవేవీ పట్టించుకోకుండా, దర్శక, నిర్మాతలు తనను కోరిన విధంగా మాస్ పాటలు రాసేశారు. సాహిత్యంలోనూ, పాటల చిత్రీకరణలోనూ సరసం పాలు హెచ్చి శృంగారపుటంచులు తాకిందనే విమర్శలు వెల్లువెత్తాయి. సెన్సార్ సమయంలోనూ చిక్కులు తప్పలేదు. ‘‘అప్పట్లో ఆ పాటలు సెన్సార్ బారిన పడకుండా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకొని, నానాపాట్లు పడ్డాం’’ అని బాపయ్య నవ్వేశారు.
– రెంటాల జయదేవ


