కోలీవుడ్ స్టార్ విక్రమ్ హీరోగా నటించిన ‘నాన్న’ సినిమా గుర్తుందా? చూసిన వాళ్లు అయితే ఆ సినిమాను అంత ఈజీగా మార్చిపోరులేండి. ఇప్పుడీ సినిమా గురించి ఎందుకంటారా? అదే సినిమాలో విక్రమ్ కూతురుగా నటించిన ఓ చిన్నారు గుర్తుంది కదా? మతి స్థిమితం లేని నాన్నతో సైగలు చేస్తూ మాట్లాడి..మనకు కన్నీళ్లు తెప్పించింది. ఆ సినిమా విజయంలో విక్రమ్‌తో పాటు ఆ చిన్నారి పాత్ర కూడా చాలా ఉంది. ఆ చిన్నారు ఇప్పుడు హీరోయిన్‌గా కాదు కాదు.. ‘పాన్ ఇండియా హీరోయిన్’ మారిపోయింది. ఆమె పేరు సారా అర్జున్!
రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన ‘దురంధర్’లో హీరోయిన్‌గా నటించింది సారా. ప్రస్తుతం ఆమె వయసు 20 ఏళ్లు మాత్రమే. అప్పుడే పాన్ ఇండియా హీరోయిన్‌గా మారిపోయింది. డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ మూవీ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. పది రోజుల్లోనే రూ. 500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. ఈ సినిమా రిలీజ్ తర్వాత అందరూ సారా అర్జున్ గురించి ఆరా తీయడం ప్రారంభించారు.

ఏడాదిన్నరకే నటన
బాలీవుడ్ నటుడు అర్జున్ కూతురే సారా అర్జున్. 2005లో ముంబైలో పుట్టింది. ఏడాదిన్నర వయసులోనే ఓ యాడ్‌లో నటించి మెప్పించింది. తొలి యాడ్‌కి మంచి స్పందన రావడంతో సారాకు వరుస ఆఫర్లు వచ్చాయి. చిన్నవయసులోనే దాదాపు 100పైగా వాణిజ్య ప్రకటనల కోసం నటంచింది. . మ్యాగీ, క్లినిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్, కల్యాణ్ జ్యువెలర్స్ వంటి బడా సంస్థల యాడ్స్‌లో కనిపించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది.
ఆరేళ్లకే వెండితెరపై
కోలీవుడ్ డైరెక్టర్ విజయ్ ఓ యాడ్ తీశాడు. అందులో సారా నటించింది. ఆమె అమాయకత్వం చూసి మురిసిపోయిన విజయ్.. తన మూవీ ‘దైవ తిరుమగల్’లో చాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా తెలుగులో ‘నాన్న’ టైటిల్‌తో రిలీజైంది. విక్రమ్ కూతురుగా నటించిన సారా.. తొలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాకు గాను చైల్డ్ ఆర్టిస్‌గా ఎన్నో అవార్డులను అందుకుంది. ఆ తర్వాత మణిరత్నం'పొన్నియన్ సెల్వన్'లో ఐశ్వర్యరాయ్ చిన్నప్పటి రోల్‌లో నటించింది. దీంతో పాటు పలు బాలీవుడ్ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. తెలుగులో రాజేంద్రప్రసాద్ నటించిన దాగుడుమూతలు దండాకోర్ చిత్రంలో కనిపించింది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా సారా చరిత్ర సృష్టించింది.

అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ..
సారాకి మెగా ఫోన్ పట్టాలనే కోరిక ఉంది. ఎప్పటికైనా సినిమాకు దర్శకత్వం వహించాలనుకుంటుంది. ‘డంకీ’ సినిమాకిగాను డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది.డ్యాన్స్ అంటే కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడే కథక్, హిప్‌మాప్ నేర్చుకుంది. కరాటేతో పాటు మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘యుఫోరియా’ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 6న విడుదల కానుంది.


