తెలుగు సినిమాలు బాలీవుడ్ మార్కెట్‌ను శాసించే రేంజ్‌కు చేరుకున్నాయి. పుష్ప2,కల్కి, కార్తికేయ2, హనుమాన్ వంటి సినిమాలు అక్కడ భారీ విజయాన్ని దక్కించుకున్నాయి. రీసెంట్‌గా మిరాయ్ కూడా హిందీ ప్రేక్షకులను మెప్పించింది. దక్షిణాది కంటే హిందీ బెల్ట్‌లోనే మైథలాజికల్ కాన్సెప్ట్ సినిమాలు బాగా రన్ అవుతాయి. అందుకే మహావతార్ నరసింహ లాంటి యానిమేషన్ చిత్రం కూడా కోట్ల రూపాయలు రాబట్టింది. కానీ, అఖండ2 మాత్రం హిందీ మార్కెట్‌లో టోటల్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ మధ్య హరిహర వీరమల్లు సినిమా పరిస్థితి కూడా ఇంతే.. అసలు ఆ సినిమా హిందీలో విడుదలైన విషయం కూడా జనాలకు తెలియదు.
అఖండ్ హిట్.. సీక్వెల్ ఫట్
అఖండ పార్ట్-1 హాట్‌స్టార్‌లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాక హిందీలో భారీ హిట్ అయింది. ఈ సినిమా తప్పకుండా చూడండి అంటూ సోషల్‌మీడియాలో పోస్టులు కూడా షేర్ చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకుని, సీక్వెల్‌కు హిందీలో కూడా అదే ఆదరణ లభిస్తుందని మేకర్స్ విశ్వసించారు. ఈ నమ్మకంతోనే దర్శకుడు బోయపాటి శ్రీను కూడా నార్త్ ప్రేక్షకులపై ఆశలు పెట్టుకుని అఖండ 2ని రూపొందించారు. ఈ క్రమంలోనే శివుని తాండవం, హనుమంతుడి స్వరూపంతో పాటు భక్తి వంటి అంశాలను చేర్చడం.. ఆపై సనాతన ధర్మం, దేశభక్తి వంటి అంశాలను కథ డిమాండ్‌కు మించి చేర్చారు. కథలో బలం ఉండి దానికి ఈ అంశాలు జోడిస్తే అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు కనిపించేవి. కానీ, ప్రస్తుతం హిందీలో అఖండ2 పేలవమైన కలెక్షన్స్‌తో నిరాశపరిచింది.
ప్రెస్ మీట్ ఖర్చులు కూడా రాలేదు
మొదటిసారిగా, నందమూరి బాలకృష్ణ కూడా హిందీ వెర్షన్‌ను చురుకుగా ప్రమోట్ చేశారు, కొన్ని హిందీ యూట్యూబ్ ఛానెల్‌లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఉత్తర భారత మార్కెట్‌తో కనెక్ట్ అవ్వాలనే ఉద్దేశ్యం బాలయ్యతో పాటు దర్శకుడు బోయపాటి చాలా కష్టపడ్డారు. అయితే, వారి వ్యూహం ఫలించలేదు. ఆపై అఖండ 2 తెలుగులో కూడా పేలవమైన ప్రదర్శన ఇవ్వడమే కాకుండా ఉత్తర అమెరికా మార్కెట్‌లో నిరాశపరిచే విధంగా మొదటిరోజు కలెక్షన్స్ వచ్చాయి. దీంతో హిందీ వెర్షన్ నుండి అంచనాలు త్వరగా తగ్గిపోయాయి. హిందీ-డబ్బింగ్ విడుదల పూర్తిగా వాష్‌అవుట్‌గా నిరూపించబడింది.
మొదటి మూడు రోజుల్లో, హిందీ వెర్షన్ కేవలం రూ. 35 లక్షలు మాత్రమే వసూలు చేసిందని నివేదించబడింది. కనీసం ముంబై ప్రెస్ మీట్ ఖర్చులను కూడా అఖండ రాబట్టలేదని కథనాలు వచ్చాయి. తమిళం, కన్నడ వంటి ఇతర భాషలలో ఈ చిత్రం పేలవమైన ప్రదర్శన కొంతవరకు ఊహించినప్పటికీ, హిందీలో దారుణమైన స్పందన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ ఇద్దరికీ పెద్ద షాక్ ఇచ్చింది.


