డైరెక్టర్ శ్యామ్ బెనగళ్ ఈ పేరు ఇప్పటి తరానికి అంతగా తెలియకపోవచ్చు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక అధ్యాయం లిఖించుకున్న దర్శకుడాయన. కమర్షియల్ సినిమాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న రోజుల్లో సినిమాకి ఊపిరి పోసిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. ఆయన పూర్తి పేరు బెనగళ్ శ్యామ్ సుందర రావు. మన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలో డిసెంబరు 14, 1934న జన్మించారు. మన దేశ సినీ చరిత్రలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతేడాది డిసెంబర్ 23న 90 ఏళ్ల వయసులో అనారోగ్య కారణాలతో కన్ను మూశారు. ఈ సందర్భంగా శ్యామ్ బెనెగల్ దర్శకత్వంపై ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
శ్యామ్ బెనెగల్.. మొదట యాడ్ ఏటెన్సీలో కాపీ రైటర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన దృష్టి పూర్తిగా సినిమా వైపు మళ్లింది. కమర్షియల్ సినిమాలకు భిన్నంగా తన ఆలోచనలు ఉండేవి. జీవితాన్ని, సమాజంలోని పాత్రల్ని వాస్తవికంగా తెరపై ఆవిష్కరించాలనే ఆశయంతో శ్యామ్ బెనెగల్ సినీరంగంలో అడుగుపెట్టారు. హైదరాబాద్‌లో ఫిలిమ్ సొసైటీ ప్రారంభించిన ఏకైక వ్యక్తి శ్యామ్ బెనగళ్. ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన అత్యున్నతమైన సినిమాల ప్రింట్‌లు అతి కష్టం మీద తెప్పించుకుని.. సినిమా లవర్స్ కోసం హైదరాబాద్ ఫిలిమ్ సొసైటీలో ప్రదర్శిస్తుండే వారాయన. శ్యామ్ బెనెగల్ అంకుర్ సినిమాతో తన ప్రస్థానం మొదలెట్టారు. ఆ తర్వాత మంథన్, నిశాంత్, గరమ్ హవా, భూమిక ది రోల్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
స్త్రీ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యం..
శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన చివరి చిత్రం ముజిబ్: ది మేకింగ్ ఆఫ్ ఏ నేషన్. బంగ్లాదేశ్ తొలి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం 2023 అక్టోబరు 13న విడుదలైంది. శ్యామ్ బెనగళ్‌కు భార్య నీరా బెనగళ్, కుమార్తె పియా బెనెగళ్ ఉన్నారు. జన్మతః కన్నడిగ అయినప్పటికీ తెలంగాణలో పుట్టి పెరగడం వల్ల తెలంగాణ చైతన్యం ఆయనలో శ్యామ్ బెనెగల్‌లో కనిపించింది. సికింద్రాబాద్‌లో పుట్టి పెరగడం వల్ల రైతులు, విప్లవ పోరాటాల ప్రభావం నా మీద ఉంది. సినిమాలు ఎప్పుడు ప్రజల పక్షం నిలబడాలి ఎప్పుడు అనుకునేవారు శ్యామ్ బెనెగల్.
ముఖ్యంగా శ్యామ్ బెనగల్(ShyamBenegal)తన సినిమాల్లో శక్తివంతమైన స్త్రీ పాత్రలకు రూపకల్పన చేశాడు. అంకుర్(1974)తో మొదలెట్టి జుబేదా (2001) వరకు దాదాపుగా ప్రతి సినిమాలో స్త్రీ పాత్రలకు చైతన్యాన్ని, శక్తిని ఇచ్చిన దర్శకుడు శ్యామ్ బెనగళ్. సత్యజిత్ రే వాస్తవిక సినిమాను ప్రవేశపెట్టి ఆ పరంపరను మృణాళ్ సేన్ అందుకున్నాక శ్యామ్ బెనగళ్ ఆ ఛత్రాన్ని గట్టిగా పట్టుకుని నిలబెట్టాడు. ముస్లిమ్ మహిళల జీవితాలను స్పృశిస్తూ మమ్ము, సర్దారీ బేగమ్, జుబేదా అని మూడు సినిమాలు తెరకెక్కింటారు.
వెండితెరపై ప్రయోగాలు:
శ్యామ్ బెనగళ్ తన సినిమాల్లో ఎన్నో ప్రయోగాలు చేసేవారు. ఎప్పుడు కొత్తవారికే ఎక్కువ అవకాశం ఇచ్చేవారు. బెనగళ్ సినిమాలతో షబానా, స్మితా పాటిల్ గొప్ప పాత్రలతో గుర్తింపు పొందారు. షబానాకు మొదటి సినిమాతోటే జాతీయ పురస్కారం వచ్చింది. ఆయన దర్శకత్వంలో నటించాలనే అభిలాషతో అనుగ్రహంలో వాణిశ్రీ నటించింది. అంతేకాకుండా మన దేశం కోసం ఎన్నో డాక్యుమెంటరీలు తీశాడు. వాటిలో సత్యజిత్ రే మీద డాక్యుమెంటరీ, నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియాను భారత్ ఏక్ ఖోజ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మేకింగ్ ఆఫ్ మహాత్మా లాంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలు కేవలం బాక్సాఫీస్ సంఖ్యలు మాత్రే కాదు.. అంతకు మించి అని అందరూ చెప్పడం ఆయన టాలెంట్‌కు ఓ నిదర్శనం.
ఎనిమిది జాతీయ అవార్డులు...
శ్యామ్ బెనగళ్ భారత ప్రభుత్వం నుంచి 8 జాతీయ చలన చిత్ర అవార్డులు అందుకున్నారు. అవి అంకుర్(1975), నిశాంత్(1976), మంథన్ (1977), భూమిక: ది రోల్(1978), జునూన్(1979), ఆరోహణ్(1982), నేతాజీ సుభాష్ చంద్రబోస్(2005), వెల్‌డన్ అబ్బా(2009) చిత్రాలకు దక్కాయి. ఆయనకు సినీ రంగంలో సేవలకు గానూ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2003లో ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం, 2013లో ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా 2005 సంవత్సరానికిగాను 2007 ఆగస్టు 8న అత్యంత ప్రతిష్ఠాత్మమైన దాదా సాహెబ్ ఫాల్కే అందుకున్నారు. తెలుగు సినిమా అనుగ్రహంకు నంది అవార్డు దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో అనంత్ నాగ్, షబానా అజ్మీ , నసీరుద్దీన్ షా , ఓం పురి , స్మితా పాటిల్ , అమ్రేష్ పురి లాంటి గొప్ప నటుల్ని వెండితెరకు పరిచయే చేసిన డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కావడం విశేషం.


