breaking news
anr college
-
ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యాయత్నం
గుడివాడ: స్థానిక ఏఎన్నార్ కళాశాల ఆవరణలో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా విజయవాడ తరలించారు. వివరాలు.. గుడ్లవల్లేరుకు చెందిన నల్లజర్ల వెంకటేశ్వరరావు, అట్టుమిల్లి సురేంద్రబాబు గుడివాడ ఏఎన్నార్ కళాశాలలో చదువుతున్నారు. వెంకటేశ్వరరావు బీఏ ద్వితీయ సంవత్సరం, సురేంద్రబాబు బీకాం ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. ఇద్దరు హాజరు పది శాతానికి మించి లేదని సమాచారం. సురేంద్రబాబు తన స్నేహితుల వద్ద నాలుగు రోజులుగా ఆత్మహత్య చేసుకుంటానని పదేపదే చెప్పేవాడని అతడి స్నేహితుడుచెబుతున్నాడు. హాల్ టికెట్ కోసం వచ్చి.. పరీక్షల రాసేందుకు హాల్ టికెట్ తీసుకునేందుకు ఇద్దరు కళాశాలకు సోమవారం ఉదయం వచ్చారు. అక్కడే పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం చేసుకున్నారు. వీరిలో సురేంద్రబాబు గుడ్లవల్లేరులో ఉండే తన స్నేహితుడు చైతన్యకు ఫోన్‌చేసి పురుగుమందు తాగి చనిపోతున్నామని చెప్పినట్లు విద్యార్థులు చెబుతున్నారు. దీంతో చైతన్య స్నేహితులు కలసి కళాశాలకు బయలుదేరి వచ్చారు. ఇదే విషయాన్ని కళాశాలలోని సురేంద్ర స్నేహితులకు ఫోన్‌ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఆవరణలో ఉన్న వీరిద్దరిని చూసేసరికి కొన ఊపిరితో ఉన్నారు. వెంటనే 108 ద్వారా గుడివాడలోని ఓ ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. వీరిలో వెంకటేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉండగా ఇద్దరిని మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు. ఇద్దరూ అపస్మారక స్థితిలో ఉండటంతో కారణాలు ఇంతవరకు తెలియలేదు. -
రేపు సీఎం గుడివాడ రాక
మచిలీపట్నం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 17వ తేదీన గుడివాడకు రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం మూడు గంటలకు ఆయన విశాఖపట్నం నుం చి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకుంటారు. అక్కడి నుంచి నాలుగు గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గుడివాడ ఏఎన్ఆర్ కళాశాలకు వస్తారు. 4.15 గంటలకు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. సాయంత్రం 5.15 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గన్నవరం చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళతారు. సీఎం గన్నవరం రాక గన్నవరం : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సోమవారం గన్నవరం విమానాశ్రయానికి విచ్చేశారు. ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 11.30కి ఆయన ఇక్కడికి చేరుకున్నారు. విమానాశ్రయ అఫ్రాన్ వద్ద ముఖ్యమంత్రికి జిల్లా జాయింట్ కలెక్టర్ జె.మురళి, విజయవాడ నగర పోలీస్ కమీషనర్ ఏబీ వెంకటేశ్వరరావు, నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, తహసీల్దారు ఎం.మాధురి తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో ప్రకాశం జిల్లా బయలుదేరి వెళ్లారు.