కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా జాతీయరహదారులపై ఉపగ్రహ ఆధారిత టోల్‌చార్జీల వసూలు వ్యవస్థను అమలుచేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించారు. శాటిలైట్ టోల్ విధానం కారణంగా ఇకపై టోల్‌ప్లాజాల వద్ద చాలాసేపు కిలోమీటర్ల పొడవైన క్యూ వరసల్లో వేచి ఉండాల్సిన బాధ వాహనదారులకు తప్పుతుందని మంత్రి గడ్కరీ చెప్పారు.
బుధవారం రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా మంత్రి ఈ వివరాలను వెల్లడించారు. ‘‘కొత్త వ్యవస్థ పూర్తిగా కృత్రిమ ఉపగ్రహ, కృత్రిమ మేథ(ఏఐ)తో అనుసంధానమై పనిచేస్తుంది. దీంతో టోల్‌ప్లాజాల వద్ద వెయిటింగ్ పిరియడ్ అనేదే ఉండదు. క్యూ వరసల్లో వేచిఉన్నప్పుడు వాహనం ఇంజిన్ ఆన్‌చేసి ఉండటంతో ఏకంగా రూ.1,500 కోట్ల విలువైన ఇంధనం వృథాగా ఖర్చయిపోతోంది. ఇకపై ఈ వృథా ఉండదు.
కేంద్ర ప్రభుత్వానికి సైతం రూ.6,000 కోట్లు పరోక్షంగా ఆదా అవుతాయి. కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా అమలుచేయబోయే మలీ్టలేన్ ఫ్రీ ఫ్లో టోల్(ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్) విధానంతో వాహనదారులకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం. గతంలో టోల్ వద్ద మ్యాన్యువల్ విధానం ఉన్నప్పుడు ఒక్కో వాహనదారుడు టోల్‌ఫీజు చెల్లించేందుకు మూడు నుంచి పది నిమిషాల సమయం పట్టేది. ఫాస్టాగ్ వచ్చాక ఈ సమయం 60 సెకన్లు, అంతకంటే తక్కువకు దిగొచ్చింది. ఇకమీదట ఆ సమయం సున్నాకు చేరుకోబోతోంది. టోల్‌ప్లాజాల వద్ద కార్లు ఏకంగా గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవచ్చు. టోల్ వద్ద మిమ్మల్ని ఎవరూ ఆపరు’’ అని మంత్రి చెప్పారు.
నంబర్ ప్లేట్‌ను గుర్తుపట్టి..
‘‘నంబర్ ప్లేట్‌ను ఫాస్టాగ్, ఏఐ సాయంతో శాటిలైట్ అనేది గుర్తించి టోల్‌ప్లాజా వద్ద రుసుము చెల్లింపును అత్యంత సులభతరం చేయనుంది. ఇందుకోసం ఏఐ అనలైటిక్స్‌తో పనిచేసే ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగీ్నషన్(ఏఎన్‌పీఆర్) వ్యవస్థ, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ఆధారిత ఎల్రక్టానిక్ టోల్ కలెక్షన్(ఫాస్టాగ్)ల కలబోతగా ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్ విధానాన్ని అమలుచేయబోతున్నాం.
దీంతో టోల్‌ప్లాజాల వద్ద బడానేతల పేర్లు చెప్పి రుసుములు చెల్లించకుండా వెళ్లిపోవడం, బెదిరింపులు, చెల్లింపుల్లో సమస్యలు వంటివన్నీ మటుమాయం అవుతాయి. పేమెంట్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుంది. ఇదంతా 2026 ఏడాది చివరికల్లా 100 శాతం అమల్లోకిరానుంది. ఈ విధానంలో ఏవైనా అవకతవకలు చేయాలని కాంట్రాక్టర్లు ప్రయతి్నస్తే అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడం. ఇప్పటికే ఇతర పనులు సవ్యంగా చేయని కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు పనుల నుంచి డిబార్ చేస్తాం. మరోదఫా టెండర్లు వేయడానికి కూడా అనుమతించబోం’’ అని గడ్కరీ స్పష్టంచేశారు.
ఆ సమస్యలు మావి కాదు
‘‘జాతీయరహదారులపై నిర్వహణ మాత్రమే కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది. రాష్ట్రాల రహదారులు, నగర రహదారుల్లో రోడ్ల నిర్వహణ అనేది మా చేతుల్లో ఉండదు. స్టేట్, సిటీ రోడ్ల సంబంధ సమస్యలను సామాజిక మాధ్యమాల్లో కొందరు జాతీయరహదారుల సమస్యగా తప్పుగా చిత్రీకరిస్తున్నారు. వ్యవస్థను పారదర్శకంగా మార్చి అక్రమాలు జరక్కుండా చూస్తాం. పైలట్ ప్రాజెక్ట్‌గా ఇప్పటికే ఎంఎల్‌ఎఫ్‌ఎఫ్ అమలవుతోన్న టోల్‌ప్లాజాల్లో ప్రాజెక్ట్ విజయావకాశాలను బేరేజువేసుకుని ఇతర ప్రాంతాల్లో దశలవారీగా ఈ విధానాన్ని విస్తరించుకుంటూ వెళ్తాం. వచ్చే కొన్ని నెలల్లో ఆయా టోల్‌ప్లాజాల్లో భౌతికంగా అక్కడ ఎలాంటి టోల్‌బూత్‌లు, బ్యారియర్లు, మెయిన్‌టెనెన్స్ సిబ్బంది లేకపోవడంతో నిర్వహణ ఖర్చులు సైతం కలిసిరానున్నాయి’’ అని మంత్రి చెప్పారు.


