దేశ రాజధాని ఢిల్లీలో జనవరి 1, 2026 నుంచి రవాణా విభాగంలో ఒక కొత్త విప్లవం రాబోతోంది. ఇప్పటివరకు ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ దిగ్గజాల ఆధిపత్యంలో ఉన్న ఆన్‌లైన్ ట్యాక్సీ మార్కెట్‌లోకి ప్రభుత్వ మద్దతుతో ‘భారత్ ట్యాక్సీ’(Bharat Taxi) సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అధిక ఛార్జీలు, క్యాన్సిలేషన్ సమస్యలతో విసిగిపోయిన ప్రయాణికులకు, తక్కువ కమిషన్లతో సతమతమవుతున్న డ్రైవర్లకు ఇది ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
భారత్ ట్యాక్సీ
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ యాప్ ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ONDC) తరహాలో పనిచేసే అవకాశం ఉంది. ఇది ఒక ప్రైవేట్ లాభాపేక్ష కలిగిన సంస్థలా కాకుండా డ్రైవర్లను, ప్రయాణికులను నేరుగా అనుసంధానించే వేదికగా పనిచేస్తుంది. ఇందులో కేవలం కార్లు మాత్రమే కాకుండా ఆటోలు, బైక్ టాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుస్తుంది కాబట్టి భద్రత, పారదర్శకత ఎక్కువగా ఉంటాయి.
డ్రైవర్లకు చేకూరే ప్రయోజనాలు
ప్రస్తుతం ఓలా, ఉబర్ వంటి సంస్థలు డ్రైవర్ల సంపాదనలో 25% నుంచి 30% వరకు కమిషన్ రూపంలో తీసుకుంటున్నాయి. దీనివల్ల డ్రైవర్లకు గిట్టుబాటు కావడం లేదని అభిప్రాయాలున్నాయి. భారత్ ట్యాక్సీ ఈ విధానాన్ని పూర్తిగా మార్చేయనుంది. ప్రతి రైడ్ ద్వారా వచ్చే ఆదాయంలో 80% నేరుగా డ్రైవర్‌కే చెందుతుంది. మిగిలిన 20% నిర్వహణ ఖర్చులు, ఇతర పన్నులకు పోతుంది. తక్కువ కమిషన్ భారం వల్ల డ్రైవర్ల రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రభుత్వ అనుసంధానంతో ఉండటం వల్ల పేమెంట్స్ విషయంలో జాప్యం తగ్గుతుంది.
ప్రయాణికులకు కలిగే లాభాలు
ప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే సర్జ్ ప్రైసింగ్ (రద్దీ సమయంలో ఎక్కువ ధరలు), డ్రైవర్ల రైడ్ క్యాన్సిలేషన్లకు భారత్ ట్యాక్సీ చెక్ పెట్టనుంది. కంపెనీ తీసుకునే కమిషన్ తగ్గడం వల్ల సహజంగానే ప్రయాణికులపై పడే భారం తగ్గుతుంది. సాధారణ సమయాల్లోనూ, రద్దీ సమయాల్లోనూ స్థిరమైన ధరలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవర్లు ఉండటం వల్ల ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణించవచ్చు.
భారత్ ట్యాక్సీ రాకతో రవాణా రంగంలో గుత్తాధిపత్యానికి తెరపడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డ్రైవర్ల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం, ప్రయాణికులకు తక్కువ ధరలో సురక్షితమైన ప్రయాణం లభించడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు. జనవరి 1 నుంచి ఢిల్లీలో ప్రారంభం కానున్న ఈ ప్రయోగం విజయవంతమైతే త్వరలోనే దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: టెలికాం కంపెనీల మరో ‘ధరల’ బాదుడు


