న్యూఢిల్లీ: దేశంలోని 3–6 ఏళ్ల మధ్య చిన్నారుల సంరక్షణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రాజ్యసభ నామినేటెడ్ సభ్యురాలు సుధా మూర్తి కోరారు. ఈ చిన్నారులకు ఉచిత విద్య, సంరక్షణ బాధ్యతలను ప్రభుత్వాలే చేపట్టాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21బీ సవరించవచ్చని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రైవేట్ బిల్లును శుక్రవారం ఆమె రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘చిన్నారులే మనందరి భవిష్యత్తు.
వారు ఉదయించే సూర్యుని వంటివారు. ప్రారంభ విద్య వారి జీవితానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రస్తుతమున్న 6– 14 ఏళ్లకు బదులుగా 3– 14 ఏళ్లకు ప్రభుత్వమే ఉచితంగా విద్య, సంరక్షణను అందించేందుకు వీలు కలి్పంచేలా చట్టాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా’అని రాజ్యసభలో ఆమె తెలిపారు. చిన్నారులకు మంచి విద్యనందించడం ఎంతో కీలకమని నూతన విద్యా విధానం కూడా చెబుతోందన్నారు.


