‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు | Will you disregard safety? Unions express outrage over the railways decision | Sakshi
Sakshi News home page

‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు

Dec 13 2025 8:33 AM | Updated on Dec 13 2025 12:21 PM

Will you disregard safety? Unions express outrage over the railways decision

చెన్నై: భారతీయ రైల్వేలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించే లక్ష్యంతో భారతీయ రైల్వే  ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే నెట్‌వర్క్ అంతటా  వివిధ అవసరాలను తీర్చేందుకు తాత్కాలికంగా 5,058 మంది మాజీ సైనికులను (Ex-Servicemen) పాయింట్స్‌మెన్‌లుగా నియమించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ పూర్తయ్యే వరకు ఈ మాజీ సైనికులు విధులు నిర్వహిస్తారు. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్‌లకు సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి.

ఈ తాత్కాలిక నియామకాలు రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్‌ల ద్వారా సాధారణ అభ్యర్థులను నియమించే వరకు ఆపరేషనల్ అవసరాలను తీర్చడానికి  ఉపకరిస్తాయి. మాజీ సైనికుల సంక్షేమ బోర్డుల ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని రైల్వే బోర్డు ఆదేశించింది. వీరి ప్రారంభ ఒప్పందం 2026 డిసెంబర్ 31వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఖాళీలను బట్టి పొడిగింపు అవకాశం ఉంటుంది. పాయింట్స్‌మ్యాన్ పాత్ర చాలా కీలకం. ఇందులో ట్రాక్ స్విచ్‌లు, సిగ్నల్‌ల మాన్యువల్ ఆపరేషన్, రైళ్లను సురక్షితంగా నడిపించడం, షంటింగ్, ప్రమాద రహిత రైలు కదలికకు స్టేషన్ మాస్టర్‌కు సహాయం చేయడం తదితర బాధ్యతలు ఉంటాయి.

అయితే మాజీ సైనికులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత  ఎదురవుతోంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్‌ఎఫ్‌) జాతీయ అధ్యక్షుడు ఎన్. కన్నయ్య మాట్లాడుతూ కీలకమైన భద్రతా-సంబంధిత పాత్రలలో కాంట్రాక్టు సిబ్బందిని నియమించడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయన్నారు. స్వల్పకాలిక కాంట్రాక్టులపై నూతన సిబ్బందిని భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి అనుమతిస్తే భద్రతకు ముప్పువాటిల్లుతుందన్నారు. ఈ పోస్టులలో చేరేవారికి దీర్ఘకాలిక జవాబుదారీతనం లేదా బాధ్యత ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు పాయింట్స్‌మెన్‌లకు సూచించిన శిక్షణ పొందుతారు. కాంట్రాక్టు వేతనం అందుకుంటారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే వారిని ఫీల్డ్‌లో పోస్ట్ చేస్తారు. శిక్షణలో ఉత్తీర్ణులుకాని లేదా అనర్హులుగా తేలిన వారిని వెంటనే  ఉద్యోగంలోకి తీసుకోరు. అయితే వారికి వారి శిక్షణ కాలానికి ఒప్పంద నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.

గతంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ  నియామకాలు భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. 2024, అక్టోబర్ 11న దక్షిణ రైల్వేలోని కవరపేటై స్టేషన్‌లో జరిగిన  రైలు ప్రమాద విచారణలో రైల్వే భద్రతా కమిషనర్ (సీఎస్‌ఆర్‌‌) చేసిన సూచనలను గుర్తుచేస్తున్నాయి. నాటి ఘటనను సీఆర్‌ఎస్‌ విధ్వంసంగా వర్గీకరిస్తూ, భద్రతా పరంగా కీలకప్రాంతాలలో కాంట్రాక్టు సిబ్బందిని మోహరించే పద్ధతిని సమీక్షించాలని, దీర్ఘకాలికంగా ఈ సంఖ్యను సున్నాకి తగ్గించాలని రైల్వే బోర్డుకు స్పష్టంగా సిఫార్సు చేసింది.

కాగా సిబ్బంది కొరతను తక్షణమే తీర్చేందుకు రైల్వే బోర్డు తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం, ఒకవైపు మాజీ సైనికులకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు కార్మిక సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఈ నిర్ణయంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వేలు గతంలోనూ రిటైర్డ్ సిబ్బందిని తిరిగి నియమించుకోవడం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement