breaking news
ex service man
-
‘అయితే భద్రత గాలికే?’.. రైల్వే యూనియన్ల మండిపాటు
చెన్నై: భారతీయ రైల్వేలలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించే లక్ష్యంతో భారతీయ రైల్వే ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే నెట్వర్క్ అంతటా వివిధ అవసరాలను తీర్చేందుకు తాత్కాలికంగా 5,058 మంది మాజీ సైనికులను (Ex-Servicemen) పాయింట్స్మెన్లుగా నియమించేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. రెగ్యులర్ రిక్రూట్మెంట్ పూర్తయ్యే వరకు ఈ మాజీ సైనికులు విధులు నిర్వహిస్తారు. ఈ మేరకు రైల్వే బోర్డు అన్ని జోనల్ రైల్వేల జనరల్ మేనేజర్లకు సర్క్యులర్ జారీ చేసింది. అయితే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక యూనియన్లు మండిపడుతున్నాయి.ఈ తాత్కాలిక నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ల ద్వారా సాధారణ అభ్యర్థులను నియమించే వరకు ఆపరేషనల్ అవసరాలను తీర్చడానికి ఉపకరిస్తాయి. మాజీ సైనికుల సంక్షేమ బోర్డుల ద్వారా ఈ నియామకాలు చేపట్టాలని రైల్వే బోర్డు ఆదేశించింది. వీరి ప్రారంభ ఒప్పందం 2026 డిసెంబర్ 31వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఖాళీలను బట్టి పొడిగింపు అవకాశం ఉంటుంది. పాయింట్స్‌మ్యాన్ పాత్ర చాలా కీలకం. ఇందులో ట్రాక్ స్విచ్‌లు, సిగ్నల్ల మాన్యువల్ ఆపరేషన్, రైళ్లను సురక్షితంగా నడిపించడం, షంటింగ్, ప్రమాద రహిత రైలు కదలికకు స్టేషన్ మాస్టర్‌కు సహాయం చేయడం తదితర బాధ్యతలు ఉంటాయి.అయితే మాజీ సైనికులను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించే ఈ నిర్ణయంపై రైల్వే కార్మిక సంఘాల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ (ఏఐఆర్ఎఫ్) జాతీయ అధ్యక్షుడు ఎన్. కన్నయ్య మాట్లాడుతూ కీలకమైన భద్రతా-సంబంధిత పాత్రలలో కాంట్రాక్టు సిబ్బందిని నియమించడాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయన్నారు. స్వల్పకాలిక కాంట్రాక్టులపై నూతన సిబ్బందిని భద్రతా వ్యవస్థలను నిర్వహించడానికి అనుమతిస్తే భద్రతకు ముప్పువాటిల్లుతుందన్నారు. ఈ పోస్టులలో చేరేవారికి దీర్ఘకాలిక జవాబుదారీతనం లేదా బాధ్యత ఉండదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు పాయింట్స్మెన్లకు సూచించిన శిక్షణ పొందుతారు. కాంట్రాక్టు వేతనం అందుకుంటారు. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత మాత్రమే వారిని ఫీల్డ్‌లో పోస్ట్ చేస్తారు. శిక్షణలో ఉత్తీర్ణులుకాని లేదా అనర్హులుగా తేలిన వారిని వెంటనే ఉద్యోగంలోకి తీసుకోరు. అయితే వారికి వారి శిక్షణ కాలానికి ఒప్పంద నిబంధనల ప్రకారం చెల్లింపులు జరుగుతాయి.గతంలో జరిగిన ఒక సంఘటన నేపథ్యంలో ఈ నియామకాలు భద్రతాపరమైన ఆందోళనలను మరింత పెంచుతున్నాయి. 2024, అక్టోబర్ 11న దక్షిణ రైల్వేలోని కవరపేటై స్టేషన్లో జరిగిన రైలు ప్రమాద విచారణలో రైల్వే భద్రతా కమిషనర్ (సీఎస్ఆర్) చేసిన సూచనలను గుర్తుచేస్తున్నాయి. నాటి ఘటనను సీఆర్ఎస్ విధ్వంసంగా వర్గీకరిస్తూ, భద్రతా పరంగా కీలకప్రాంతాలలో కాంట్రాక్టు సిబ్బందిని మోహరించే పద్ధతిని సమీక్షించాలని, దీర్ఘకాలికంగా ఈ సంఖ్యను సున్నాకి తగ్గించాలని రైల్వే బోర్డుకు స్పష్టంగా సిఫార్సు చేసింది.కాగా సిబ్బంది కొరతను తక్షణమే తీర్చేందుకు రైల్వే బోర్డు తీసుకున్న ఈ తాత్కాలిక నిర్ణయం, ఒకవైపు మాజీ సైనికులకు ఉపాధి కల్పిస్తున్నప్పటికీ, మరోవైపు కార్మిక సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. మరోవైపు ఈ నిర్ణయంతో భద్రతా పరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా సిబ్బంది కొరతను అధిగమించేందుకు రైల్వేలు గతంలోనూ రిటైర్డ్ సిబ్బందిని తిరిగి నియమించుకోవడం లాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకున్నాయి. -
19న మాజీ సైనికుల సమావేశం
కర్నూలు(అర్బన్): అనంతపురంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ స్టేడియంలో ఈ నెల 19న మాజీ సైనికుల సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రాచయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి జిల్లాలోని మాజీ సైనికులు, వితంతువులపై ఆధారపడిన వారు తప్పక హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు జిల్లా సైనిక సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. -
భూవివాదంలో మాజీ సైనికుడిపై దాడి
కపిలేశ్వరపురం : భూ వివాదంలో ఈ నెల 11న మాజీ సైనికుడినిపై కొందరు దాడి చేశారు. మండలంలోని అద్దంకివారిలంక గ్రామ శివారు పల్లపులంకలో జరిగిన దాడిలో గాయపడిన మాజీ సైనికుడు మలకా లక్ష్మణరావు అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రి నుంచి సమాచారం రాగానే తగిన చర్యలు తీసుకుంటామని అంగర ఎస్సై వాసా పెద్దిరాజు తెలిపారు. బాధితుడు లక్ష్మణరావు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం... లక్ష్మణరావుకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి ఈ నెల 11న వెళ్లగా బూరుగు సత్యనారాయణ, బూరుగు అర్జునరావు, కొత్తపల్లి దుర్గారావు, బూరుగు చిన్న, బూరుగు ఏసు, బూరుగు ప్రసాదు వచ్చి పొలంలోని సర్వే రాళ్ళను తొలగించి లక్ష్మణరావుపై దాడికి దిగారు. వివాదం నేపథ్యం ఇదీ... లక్ష్మణరావు సేవలను గుర్తించిన ప్రభుత్వం 1976లో పల్లపులంకలో 259/1 సర్వేలో ఐదు ఎకరాల భూమిని డి–పట్టాగా ఇచ్చింది. తర్వాతక్రమంలో ఆ భూమిని కొందరు ఆక్రమించి కొంతకాలంగా సాగు చేస్తున్నారు. దీంతో 1992లో తన భూమిని అప్పగించాలంటూ కోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం ప్రారంభించారు. 2014 సెప్టెంబర్‌లో అప్పటి జిల్లా కలెక్టరు నీతూకుమారిప్రసాద్‌ను కలిసి తన గోడును విన్నవించుకున్నారు. దీంతో 2016 జూలైలో సర్వే నిర్వహించగా ఆ సర్వే నంబరుతో మొత్తం 11.36 ఎకరాలున్నట్టు, అందులో ఐదు ఎకరాలు లక్ష్మణరావుకు చెందినదిగా నిర్ధారించారు. దీంతో లక్ష్మణరావు కొద్ది రోజుల క్రితం కొబ్బరిమొక్కలు వేసి భూమికి కంచెను ఏర్పాటు చేసుకున్నారు. వాటిని కొందరు తొలగించారు. అప్పటి నుంచి వివాదం రాజుకుంంది. ఈ నేపథ్యంలో 11న లక్ష్మణరావుపై దాడి జరిగింది. -
కలెక్టరేట్లో మాజీ సైనికోద్యోగి ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్ (మహబూబ్‌నగర్ జిల్లా) : ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలం వివాదం పదేళ్లుగా పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన మాజీ సైనికోద్యోగి ఒకరు కలెక్టరేట్లో పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. సోమవారం కలెక్టరేట్‌కు చేరుకున్న అబ్రహాం(65) అనే మాజీ సైనికోద్యోగి గ్రీవెన్స్ డేలో పాల్గొన్నాడు. షాద్‌నగర్ మండలం కందిమల్ల గ్రామంలో తనకు కేటాయించిన స్థలాన్ని ఆ గ్రామస్తులు పదేళ్లుగా అడ్డుకుంటున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. పదేళ్లుగా పోరాటం చేస్తున్నా తనకు న్యాయం జరగకపోవడంతో కలెక్టరేట్లోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే ఆయన్ని 108లో ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.


