రైలు ప్రయాణంలో గర్భిణీలు, సీనియర్ సిటిజన్లు ఉన్నపుడు వారికి లోయర్ బెర్త్ కావాలని ఆశపడతాం. కానీ లోయర్ బెర్త్ దొరుకుతుందా అనేది నమ్మకం ఉండదు. లోయర్ బార్త్ రాక, మిడిల్, అప్పర్ బెర్త్ ఎక్కలేక, పక్క వాళ్లని రిక్వెస్ట్ చేసుకుంటూ చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. గర్భిణీలు, అనారోగ్యంతో ఉన్న పెద్దవాళ్లకి నిజంగా ఇది చాలా సమస్య.
అయితే లోయర్ బెర్త్ కావాలంటే సీనియర్ సిటిజన్లు ఈ తప్పు చేయకండి అంటూ టికెట్ ఎగ్జామినర్ (TTE) చెప్పిన చిట్కా ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది.సీనియర్ సిటిజన్ కోటా కింద సీట్ల కేటాయింపునకు సంబంధించి ఈ వైరల్ వీడియో ప్రశంసలందుకుంటోంది.
తమకు లోయర్ బెర్త్ రాలేదంటూ కొందరు ప్రయాణికులు సీనియర్ సిటిజన్లు టికెట్ చెకింగ్‌కు వచ్చిన టీటీఈకి చెప్పుకున్నారు. అపుడు టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు ఈ తప్పు చేయకండి అంటూ ఆయన ఏం చెప్పారంటే..
"మీరు సీనియర్ సిటిజన్ కోటాను పొందాలనుకుంటే, అదీ లోయర్ బెర్త్ పొందాలనుకుంటే, ఒకే టికెట్‌లో ఇద్దరు ప్రయాణీకులను మాత్రమే బుక్ చేసుకోవాలి. అప్పుడు బుక్ చేసిన ఇద్దరికీ లోయర్ బెర్త్ వస్తుంది, లేదా ఇద్దరిలో ఒకరికైనా లోయర్ బెర్త్ వస్తుంది. అలా కాకుండా ఒకే టికెట్‌లో ఇద్దరు కంటే ఎక్కువ మందిని చేర్చుకుంటే, కోటా ప్రయోజనాలు రద్దు అవుతాయి అంటూ టీటీసీ అసలు రహస్యాన్ని చెప్పారు. అయితే ఇంకో సమస్య ఏంటంటే.. ఇలా నలుగురు ఇలా బుక్ చేసుకున్నపుడు నలుగురికి ఒకే చోట, లేదా ఒకే కోచ్‌లో సీట్లు వస్తాయనే గ్యారంటీ లేదు.
Important and useful train ticket booking hack... if you are senior citizen
Kudos to this TTE for calmly explaining this, He deserves a raise @RailwaySeva @AshwiniVaishnaw pic.twitter.com/l5VJwATRKR— Woke Eminent (@WokePandemic) November 10, 2025
ఆగస్టు ప్రారంభంలో ఇలాంటి ప్రశ్నకు ప్రతిస్పందనగా, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఎక్స్‌లో వివరణ ఇచ్చింది. "లోయర్ బెర్త్/సీనియర్ సిటిజన్ కోటా బెర్త్‌లు 60 ఏళ్లు , అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులకు, 45 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుంది. ఒంటరిగా లేదా ఇద్దరు ప్రయాణికులతో (పేర్కొన్న ప్రమాణాల ప్రకారం) ఒకే టికెట్‌పై ప్రయాణించే టప్పుడు. ఇద్దరు కంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నా, లేదా ఒకరు సినీయర్ సిటిజన్ కాని వ్యక్తి ఉన్నా కోటా వర్తించదని IRCTC పేర్కొంది.
లోయర్ బెర్త్‌లు స్వయంచాలకంగా సీనియర్ సిటిజన్లు (60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు) 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల మహిళా ప్రయాణీకులకు, లభ్యతకు లోబడి కేటాయించబడతాయి. ప్రతి రైలు కోచ్‌లో, స్లీపర్ క్లాస్‌లో ఆరు నుండి ఏడు లోయర్ బెర్తులు, AC 3-టైర్‌లో నాలుగు నుండి ఐదు, AC 2-టైర్‌లో మూడు నుండి నాలుగు సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలుగర్భిణీ స్త్రీలకు రిజర్వ్ చేయబడతాయి.అదనంగా, అన్ని జోనల్ రైల్వేలలోని సబర్బన్ సెక్షన్లలోని మొదటి ,చివరి సెకండ్-క్లాస్ జనరల్ కంపార్ట్‌మెంట్లలో కనీసం ఏడు సీట్లు సీనియర్ సిటిజన్లకు రిజర్వ్ చేయబడతాయి.
బుకింగ్ సమయంలో వయస్సు రుజువు అవసరం లేనప్పటికీ, ప్రయాణీకులు ప్రయాణ సమయంలో చెల్లుబాటు అయ్యే వయస్సు గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఎందుకంటే చెకింగ్ ఆఫీసర్లు వచ్చినపుడు, వాటిని చూపించాల్సి ఉంటుంది.


