పది అంతస్తుల పైనుంచి కిందపడితే..వామ్మో ఎముకలు ముక్కలు ముక్కలు అవ్వాల్సిందే. అస్సలు ఆ ఊహే వెన్నులో వణుకి పుట్టిస్తుంది కదా. అసలు ఎంత ఎత్తునుంచి కిందికి చూడాలంటేనే మామూలు మనుషులకి గుండెల్లో గుబులు. అయితే అంత ఎత్తునుంచి జారిపడిన 57 వ్యక్తి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఎలా అంటే...
గుజరాత్‌లోని సూరత్‌ని జహంగీర్‌పురా ప్రాంతంలోని టైమ్స్ గెలాక్సీ నివాస సముదాయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. 57 ఏళ్ల నితిన్ ఆదియా ఒక ఎత్తైన భవనంలోని తన 10వ అంతస్తు అపార్ట్‌మెంట్ నుండి పొరపాటున జారిపడి పోయాడు. అపార్ట్‌మెంట్‌లోని కిటికీ దగ్గర విశ్రాంతి తీసుకుంటుండగా బ్యాలెన్స్ కోల్పోయి జారిపడ్డాడు.
అయితే మధ్యలోనే మిరాకిల్ జరిగింది. పడిపోతున్న క్రమంలో ఎనిమిదో అంతస్తులోని కిటికీ వెలుపల అమర్చిన ఇనుప గ్రిల్‌కి చిక్కుకున్నాడు. ఆ మెటల్ విండో గ్రిల్‌కి ఒక కాలు చిక్కుకుంది. ఒకవైపు బాధ, మరోవైపు బాధతో దాదాపు గంటసేపు అలా వేలాడాడు. ఇంతలో సంఘటనా స్థలానికి చేరుకున్న అత్యవసర సేవల సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది అతడిని జాగ్రత్తగా రక్షించారు. నేరుగా కిందపడకుండా ఉండటం వల్లే అతను తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడని అధికారులు తెలిపారు.
Surat: Dramatic Rescue as 57-Year-Old Man Dangles from 8th Floor Window Grill After Fall from 10th Floor – Fire Brigade Saves Life
pic.twitter.com/s4yitzduXv— Ghar Ke Kalesh (@gharkekalesh) December 25, 2025
జహంగీర్‌పుర, పాలన్‌పూర్, అడాజన్ అనే మూడు స్టేషన్ల నుండి అగ్నిమాపక దళ బృందాలు హైడ్రాలిక్ కట్టర్లు,ప్రత్యేక పరికరాలతో మోహరించాయి. ఒక యూనిట్ భద్రతా వలయ కింద రక్షణగా ఉండగా, దిగువ ప్రాంతాన్ని ఇతర బృందాలు 10-8 అంతస్తుల నుండి భవనంలోకి ప్రవేశించి ఒకేసారి చిక్కుకున్న వ్యక్తిని మృత్యు ముఖం నుంచి కాపాడాయి. ఏదైనా అనుకోనిది జరిగితే ఎలా అనే ఆందోళనతో స్థానికులు కూడా పెద్ద ఎత్తున అక్కడకు చేరి సహాయక చర్యల్లో పాల్గొనడం విశేషం.
తీవ్ర ఉద్రిక్తత మధ్య సాగిన ఈ ఆపరేషన్‌పై ఒక అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ, ఇది కష్టంగా, చాకచక్యంగా అతణ్ని రక్షించాం అన్నారు. తొలుత బాధితుడిని 10వ అంతస్తు నుండి తాళ్లు ,సేఫ్టీ బెల్ట్‌తో కట్టేసాం..అతని అతని శరీర బరువుకు మద్దతు లభించింది. అలా గ్రిల్లో చిక్కుకున్న కాలుని విడిపించి , ఆదియను సురక్షితంగా కిందకు దించి చికిత్స కోసం గురుకృప ఆసుపత్రికి తరలించామని చెప్పారు. కాలికి గాయాలు అయినప్పటికీ, పెద్ద ప్రమాదం నుండి బయటపడ్డాడని వైద్యులు కూడా నిర్ధారించారు. ఈ రెస్క్యూకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతణ్ణి రక్షించిన అధికారులను నెటిజన్లు కొనియాడారు. పలు బృందాలు సమన్వయంతో పెద్ద ప్రమాదాన్ని నివారించారంటూ అధికారులను అభినందించారు.


