ఘర్షణ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు
రాయ్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో జిందాల్ పవర్ లిమిటెడ్‌కు సంబంధించిన బొగ్గు గని ప్లాంట్ వద్ద స్థానికులు చేపట్టిన ఆందోళన శనివారం హింసాత్మకంగా మారింది. తమనార్ పరిధిలోని లిబ్రా గ్రామంలో ఉన్న కోల్ హ్యాండింగ్ ప్లాంట్ నుంచి బొగ్గు తరలించే వాహనాలను అడ్డుకుంటూ స్థానికులు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఉద్యమ నాయకుడు రాధేశ్యామ్ శర్మ, మరో 40 మందిని అరెస్ట్‌చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంచేశారు.
అయితే సైకిల్‌పై వెళ్తున్న స్థానికుడిని మరో బొగ్గు ట్రక్కు ఢీకొట్టిందన్న వార్తతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి పోలీసులపైకి రాళ్లు రువ్వారు. తర్వాత ప్లాంట్‌లోకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించారు. కోల్ ప్లాంట్‌లోని కన్వేయర్ బెల్ట్, ట్రాక్టర్లు, పోలీస్ బస్సు, జీప్‌కు నిప్పుపెట్టారు. ఈ ఘర్షణలో పలువురు పోలీసులు గాయపడ్డారు. సెక్టార్–1 కోల్‌బ్లాక్ పరిధిలోని 14 గ్రామాలకు చెందిన వేయి మందికిపైగా గ్రామస్తులు ఈ విధ్వంసకాండలో పాల్గొన్నారు. అయినాసరే పరిస్థితి అదపులోనే ఉందని జిల్లా ఎస్పీ శనివారం వెల్లడించారు.


