బంగ్లాదేశ్‌లో పేరు నమోదు చేసుకున్న బీఎన్‌పీ నేత తారిఖ్ రహ్మాన్
ఢాకా/న్యూఢిల్లీ: బ్రిటన్‌లో ప్రవాసజీవితం గడుపుతున్న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పారీ్ట(బీఎన్‌పీ) తాత్కాలిక చైర్మన్, మాజీ మహిళా ప్రధాని ఖలీదా జియా తనయుడు తారిఖ్ రెహ్మాన్ పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్లీ బంగ్లాదేశ్ ఓటరుగా తన పేరును నమోదుచేయించుకున్నారు. లండన్ నుంచి ఇటీవల స్వదేశానికి తిరిగొచ్చిన రెహ్మాన్ శనివారం ఓటరు జాబితాలో తన పేరును జతచేయడంతోపాటు జాతీయ గుర్తింపు(ఎన్‌ఐడీ) కార్డును సంపాదించినట్లు బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ శనివారం ఢాకాలోని ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన రహ్మాన్ నుంచి అధికారులు వేలి గుర్తులు, ఐరిస్ స్కాన్ తీసుకుని ఓటర్‌గా పేరు నమోదుచేశారు. అంతకుముందే రెహ్మాన్ తన ఓటరు దరఖాస్తును ఆన్‌లైన్‌లో సమర్పించారని ఎన్నికల కమిషన్‌లోని జాతీయ గుర్తింపు నమోదు విభాగ డైరెక్టర్ జనరల్ హుమయూన్ కబీర్ వెల్లడించారు. రెహ్మాన్‌తోపాటు ఆయన కుమార్తె జైమా సైతం ఎన్‌ఐడీ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
2007–08 రాజకీయ సంక్షోభం తర్వాత ఫక్రుద్దీన్ అహ్మద్ సారథ్యంలోని సైనిక తాత్కాలిక ప్రభుత్వం తొలిసారిగా 2008లో బంగ్లాదేశ్‌లో ఫొటో, బయోమెట్రిక్ డేటాతో ఓటర్ జాబితాను తయారుచేయడం తెల్సిందే. ఆ కాలంలో రాజకీయ ఖైదీగా ఉన్న రెహ్మాన్‌ను జైలు నుంచి విడుదలచేయగానే ఆయన 2008 సెపె్టంబర్ 11వ తేదీన లండన్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయన పేరు ఓట్ల జాబితాలో నమోదుకాలేదు. ఆ తర్వాత వైరి వర్గానికి చెందిన షేక్ హసీనా పార్టీ అధికారంలోకి రావడంతో రెహ్మాన్ ఇంకెప్పుడూ స్వదేశానికి రాలేదు.


